ఎంపీడీఓ కార్యాలయంలో వినతిపత్రం అందిస్తున్న దళితులు
-గ్రామాల్లో యథేచ్ఛగా పింఛన్ల కోత
గోరంట్ల, మార్చి 2: పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీవారి మాట వినలేదని తమకు పింఛన రాకుండా చేసినట్లు మల్లాపల్లి పంచాయతీ కళిగేరి ఎస్సీకాలనీకి చెందిన గోవిందప్ప, వెంకటలక్ష్మమ్మలు ఆరోపించారు. ఈ మేరకు వారు టీడీపీ నాయకులతో కలిసి మండలపరిషత కార్యాలయానికి వచ్చి అధికారులకు మంగళవారం వినతిపత్రం అందించారు. గోవిందప్ప మల్లాపల్లి పంచాయతీ 9వ వార్డుకు టీడీపీ మద్దతుతో ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. మాట వినకుండా ఎన్నికల్లో నిలబడినందుకు ఈనెల పింఛన ఇవ్వకుండా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు రనివ్వమని అధికార పార్టీవారు బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. గత రెండేళ్లుగా పొందుతున్న డప్పు కళాకారుల పింఛన రాకుండా చేశారని పింఛన మంజూరు చేయాలని ఎంపీడీఓను కోరారు. అలాగే హరిజన నరసింహప్ప భార్య వెంకటలక్ష్మమ్మకు గత నాలుగేళ్లుగా వితంతు పింఛన వచ్చేది, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల వెంట ప్రచారం చేసి వారికే ఓటువేశావంటూ పింఛన కట్‌చేశారు. పింఛనతోపాటు ఇతర ప్రభుత్వ పథకాలు రద్దుచేస్తున్నట్లు గ్రామ వలంటీరు తెలిపారని ఆమె ఆరోపించారు. ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో టైపిస్ట్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి నరసింహులు, మాజీ ఎంపీటీసీ గంగిరెడ్డి, డీఆర్ గంగిరెడ్డి, గంగిరెడ్డి, వెంకటరెడ్డి, కళిగేరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.