అంధకారంలో అచ్యుతాపురం!

ABN , First Publish Date - 2022-07-03T06:33:56+05:30 IST

ఏపీ ట్రాన్స్‌కో ఉద్యోగి అవగాహనా లోపం కారణంగా అచ్యుతాపురంలో శనివారం ఎనిమిది గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఇందుకు గల కారణాలను మాత్రం సదరు శాఖ సిబ్బంది బహిర్గతం చేయలేదు.

అంధకారంలో అచ్యుతాపురం!
చీకటిమయమైన అచ్యుతాపురం

సుమారు ఎనిమిది గంటలకు పైబడి సరఫరాకు అంతరాయం 

మరమ్మతులు చేపట్టే క్రమంలో ట్రాన్స్‌కో ఉద్యోగికి తీవ్ర గాయాలు!

ఎటువంటి సమాచారం వెల్లడించని విద్యుత్‌ సిబ్బంది 


అచ్యుతాపురం, జూలై 2 : ఏపీ ట్రాన్స్‌కో ఉద్యోగి అవగాహనా లోపం కారణంగా అచ్యుతాపురంలో శనివారం ఎనిమిది గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఇందుకు గల కారణాలను మాత్రం సదరు శాఖ సిబ్బంది బహిర్గతం చేయలేదు.  శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. త్వరలో వచ్చేస్తుందని అంతా భావించారు. కానీ గంటలు గడుస్తున్నా రాలేదు.  దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ వివరాలు సేకరించగా, బ్రాండిక్స్‌ సబ్‌స్టేషన్‌ వద్ద 220 కేవీ లైన్‌లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్టు తెలిసింది. దీంతో ఏపీ జెన్‌కోకు చెందిన సిబ్బంది వచ్చి మరమ్మతులు చేపట్టారు. సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో ఏపీ జెన్‌కోకు చెందిన ఓ ఉద్యోగి విద్యుత్‌షాక్‌కు గురైనట్టు తెలిసింది.  ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతనిని ఆస్పత్రికి తరలించిన అనంతరం మరమ్మతులు చేపట్టారు.  ఇదిలావుండగా విద్యుత్‌ సిబ్బందిని వైసీపీ ప్రభుత్వ భారీ స్థాయిలో బదిలీలు చేసింది. అచ్యుతాపురం సబ్‌ స్టేషన్‌లో గల అధికారులతో పాటు, ఇతర సిబ్బంది బదిలీ అయ్యారు. ఈ సమయంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగడంతో  సిబ్బంది విధులు నిర్వహించడంలో జాప్యం జరిగినట్టు తెలిసింది. ఎట్టకేలకు సుమారు రాత్రి పది గంటలకు విద్యుత్‌ సరఫరాను మెరుగుపర్చారు. అయితే ఆ మరుక్షణమే మళ్లీ సరఫరా నిలిచిపోయింది. రాత్రి పదకొండు గంటలైనా కరెంటు ఇవ్వలేదు.


Updated Date - 2022-07-03T06:33:56+05:30 IST