కొలువు దీరిన మునిసిపల్‌ పాలక వర్గాలు

ABN , First Publish Date - 2021-05-08T04:08:39+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేట మునిసిపాలిటీల పాలకవర్గాలు శుక్రవారం కొలువు దీరాయి.

కొలువు దీరిన మునిసిపల్‌ పాలక వర్గాలు
జడ్చర్ల చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేస్తున్న దోరేపల్లి లక్ష్మీ

జడ్చర్ల, అచ్చంపేట మునిసిపల్‌ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

జడ్చర్ల చైర్‌పర్సన్‌గా దోరేపల్లిలక్ష్మీ

అచ్చంపేట చైర్మన్‌గా ఎడ్ల నర్సింహ గౌడ్‌

ముఖ్య అతిథులుగా పాల్గొన్న లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు


ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేట మునిసిపాలిటీల పాలకవర్గాలు శుక్రవారం కొలువు దీరాయి. జడ్చర్లలో అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, అచ్చంపేటలో ఎన్నికల అధికారి పాండు నాయక్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. అచ్చంపేటలో నలుగురు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లకు కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో వారితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రమాణ స్వీకారం చేయించారు.


జడ్చర్ల, మే 7: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా దోరేపల్లి లక్ష్మీ, వైస్‌ చైర్‌పర్సన్‌గా పాలాది సారిక ఎన్నికయ్యారు. మునిసిపాలిటీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన ఈ ఎన్నికకు సాధారణ పరిశీలకులుగా మునిసిపల్‌ అడ్మినిస్ర్టేట్‌ అండ్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ శాఖ ప్రభుత్వ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డిని వచ్చారు. ఎక్స్‌అఫీషియో సభ్యుడు, జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ముందుగా కౌన్సిలర్‌లతో మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ల ఎన్నికను నిర్వహించారు. చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా దోరేపల్లి లక్ష్మీ పేరును ఉమాశంకర్‌గౌడ్‌ ప్రతిపాదించగా, లత బలపరిచారు. వైస్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పాలాది సారిక పేరును కాటేమోనిశంకర్‌ ప్రతిపాదించగా, రమేశ్‌ బలపరిచారు. ఆయా స్థానాలకు ఒక్కరే పోటీలో ఉండడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తేజ్‌సనందలాల్‌ ప్రకటించారు. అనంతరం వారితో ప్రమాణ స్వీకారం చేయించి, ధృవీకరణ పత్రాలను అందించారు.


ఆలస్యంగా వచ్చిన కాంగ్రెస్‌ కౌన్సిలర్లు

మునిసిపాలిటీ కార్యాలయానికి టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వెంట వచ్చారు. ప్రమాణ స్వీకారం సమయంలోగా బీజేపీ కౌన్సిలర్‌లు చేరుకున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పూర్తయిన అనంతరం ఆలస్యంగా వచ్చిన కాంగ్రెస్‌ కౌన్సిలర్లతో అదనపు కలెక్టర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. 


తడబడిన అభ్యర్థులు

ప్రమాణ స్వీకారం సందర్భంగా కొందరు అభ్యర్థులు తడబడ్డారు. అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌ ప్రమాణ స్వీకారం చేయించగా, తెలియచేయనని అనే పదాన్ని తెలియచేయాలని అని, సత్యనిష్ట అనే పదాన్ని చెత్తనష్ట అని పలికారు.


కలిసి కట్టుగా పని చేయాలి: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 

ప్రజలకు మౌలిక వసతులు కల్పించేలా అందరు కౌన్సిలర్‌లతో కలిసికట్టుగా పని చేయాలని చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌లకు ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి సూచించారు. ఇప్పటికే మునిసిపాలిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ఇక ముందు అదే ఒరవడి కొనసాగిస్తామని అన్నారు. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌లతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్‌లకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. శాలువాలు కప్పి సన్మానించారు.  


అచ్చంపేటలో నిరాడంబరంగా

అచ్చంపేట, మే 7: నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పురపాలిక నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం పట్టణంలోని సరోజినీదేవి ఆడిటోరియంలో శుక్రవారం నిరడాంబరంగా జరిగింది. సభ్యులతో ప్రిసైడింగ్‌ అధికారి పాం డు నాయక్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికైన 20 మందిలో 16 మందితో ప్రత్యక్షంగా, మిగిలిన నలుగురు తెరాస సభ్యులకు కరోనా పాజిటివ్‌ రావడంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికను ప్రారంభించారు. 20 వార్డులకు గాను 13 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. మెజారిటీ ఉన్నందున టీఆర్‌ఎస్‌ నుంచి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎంపిక నిర్వహించారు. చైర్మన్‌గా ఎడ్ల నర్సింహగౌడ్‌ పేరును ఆకుల లావణ్య ప్రతిపాదించగా, రామేశ్వర్‌రావు బలపరిచారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో నర్సింహగౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. వైస్‌ చైర్‌పర్సన్‌గా శైలజను ఖాజా బీ ప్రతిపాదించగా మనోహర్‌ ప్రసాద్‌ బలపరిచారు. ఇక్కడ కూడా ఎవరూ పోటీలో లేనందున ఆమె ఎన్నిక కూడా ఏకగ్రీవం అయినట్లు ప్రిసైడింగ్‌ అధికారి ప్రకటించి, వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఉ త్తర్వులను అందించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్‌, ఎక్స్‌-అఫిషియల్‌ సభ్యుడు గువ్వల బాలరాజు హాజరయ్యారు.


కనకాల మైసమ్మను దర్శించుకున్న టీఆర్‌ఎస్‌ సభ్యులు

ప్రమాణ స్వీకారానికి ముందు బల్మూర్‌ మండల పరిధిలోని కనకాల మైసమ్మను ఎ మ్మెల్యే గువ్వల బాలరాజు, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు దర్శించుకున్నారు. అనం తరం తెలకపల్లి మండలం రాంరెడ్డిపల్లిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి, ఎంపీ రాములును కలిసి మంత్రి దగ్గర ఉన్న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పేర్లు ఉన్న సీల్డ్‌ కవర్‌ను తీసుకున్నారు. 


అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులు

ఆరు వార్డులను కైవసం చేసుకున్న కాంగ్రెస్‌ కౌన్సిలర్లు డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణతో కలిసి పట్టణంలోని అం బేడ్కర్‌ చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఒక వార్డులో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి సుగుణమ్మ గిరిజన దుస్తులలో హాజరయ్యారు.







Updated Date - 2021-05-08T04:08:39+05:30 IST