‘ఎయిడెడ్‌’కు స్వాధీనమే పరిష్కారం!

ABN , First Publish Date - 2021-11-30T06:14:45+05:30 IST

రాష్ట్రంలోని ఎయిడెడ్‌ విద్యాసంస్థలు సక్రమంగా పనిచేయడం లేదని, ప్రభుత్వ నియమనిబంధనలను, కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు కాలానుగుణంగా జారీచేస్తున్న చట్టాలను అమలుచేయడంలేదని...

‘ఎయిడెడ్‌’కు స్వాధీనమే పరిష్కారం!

రాష్ట్రంలోని ఎయిడెడ్‌ విద్యాసంస్థలు సక్రమంగా పనిచేయడం లేదని, ప్రభుత్వ నియమనిబంధనలను, కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు కాలానుగుణంగా జారీచేస్తున్న చట్టాలను అమలుచేయడంలేదని, అందువల్ల వాటిని స్వాధీనం చేసుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. 1947కు పూర్వం జాతీయోద్యమ స్ఫూర్తితో సామాజిక చింతన, సేవాదృక్పథం ఉన్న వదాన్యులు తమ సొంత ధనంతో విద్యాసంస్థలను స్థాపించారు. ప్రభుత్వం వాటికి గ్రాంట్‌–ఇన్‌–ఎయిడ్‌‌ మంజూరు చేసింది. కాలక్రమంలో ప్రైవేట్ ఎయిడెడ్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు గ్రాంట్‌–ఇన్‌–ఎయిడ్‌లో సింహభాగాన్ని తీసుకుని ఉపాధ్యాయులకు కొద్దో గొప్పో వేతన భత్యాలు చెల్లించేవి. కొన్ని మతసంస్థలు స్థాపించిన విద్యాలయాలు, మరికొన్ని నంస్థలు మాత్రమే నిజంగా విద్యాసేవకు కట్టుబడి పనిచేశాయి. ఈ పరిస్థితులలో మార్పు తేవడానికి 1954 నుంచి ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ సాగించిన ఉద్యమాల ఫలితంగా 1956–-59 మధ్యకాలంలో రాష్ట్రంలోని ఎయిడెడ్‌ పాఠశాలలను (మతసంస్థలు, మైనారిటీలు నిర్వహించే పాఠశాలలు మినహా) ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పంచాయతీరాజ్‌ చట్టం వచ్చాక ఇవే జిల్లాపరిషత్‌, పంచాయతీ సమితి పాఠశాలలుగా మారాయి.


తరువాత మరల ప్రైవేట్ పాఠశాలల స్థాపనకు రాష్ట్రప్రభుత్వం అనుమతినిచ్చింది. గ్రాంట్‌–ఇన్‌–ఎయిడ్‌ మంజూరు చేయడం ప్రారంభించింది. తిరిగి 1988లో ఒక కొత్త చట్టం ద్వారా గ్రాంట్‌–ఇన్‌– ఎయిడ్‌ నిలిపివేసింది. ‘జాతీయ విద్యావిధానం- 1986’కు అనుగుణంగా ఆ చట్టాన్ని తీసుకువచ్చారు. 1985 సెప్టెంబర్ 1 తరువాత స్థాపించిన పాఠశాలల్లో కొత్త సెక్షన్లకు, 1985 మార్చి 1 తరువాత స్థాపించిన కళాశాలల్లో కొత్త కోర్సులకు గ్రాంట్‌–ఇన్‌– ఎయిడ్‌‌ మంజూరు చేయడం సాధ్యం కాదని ఆ చట్టంలో పేర్కొన్హారు. ఆ జాతీయ విద్యావిధానాన్ని అనుసరించి యూజీసీ గ్రాంట్లు తగ్గిపోయాయి; విశ్వవిద్యాలయాలలో స్వయంపోషిత కోర్సులు ప్రారంభించడం మొదలయింది.


ఎయిడెడ్‌ సంస్ధల యాజమాన్యంలోనికి కొత్తతరం ప్రవేశించింది. అధికశాతం ఎయిడెడ్‌ విద్యాసంస్థలలో వ్యాపార ధోరణి ప్రబలమయింది. కొన్ని ఎయిడెడ్‌ విద్యాసంస్థలు అదే ప్రాంగణంలో సమాంతరంగా కొత్త పాఠశాలలు, కళాశాలలు లేదా అదనంగా సెక్షన్‌లు ప్రైవేటుగా స్థాపించి ఫీజులు వసూలు చేసుకోవడం ప్రారంభించాయి. విద్యా శాఖాధికారులు ఉపేక్షించడంతో పాటు నూతన ఆర్థిక విధానాల అమలు ప్రారంభమయిన తరువాత ప్రైవేటీకరణకు ప్రభుత్వం నుంచి లభిస్తున్న ప్రోత్సాహం ఎయిడెడ్‌ విద్యాసంస్థలు మరింత వ్యాపారధోరణికి మరలడానికి అవకాశం కల్పించాయి. నూతన ఆర్థిక విధానాల అమలులో భాగంగా ప్రభుత్వ సహాయంతో నడుస్తున్న విద్యాసంస్ధల భారాన్ని వదిలించుకోవాలనే ప్రయత్నాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఎయిడెడ్‌ విద్యాసంస్థలలో ఖాళీ అవుతున్న పోస్టులను భర్తీచేయకుండా అవి సహజ మరణానికి గురయ్యే విధానాలు రూపొందించి అమలుచేశారు. 2004లో నాటి రాష్ట్రప్రభుత్వం ఎయిడెడ్‌ పాఠశాల్లో పోస్టులు భర్తీచేసేది లేదంటూ ఉత్తర్వులు జారీచేసింది. అప్పటినుంచి ఎయిడెడ్‌ విద్యాసంస్థల పతనం వేగవంతమయింది. ఆ పాఠశాలలు, కళాశాలలు నాలుగోవంతు సిబ్బందితోనే పనిచేస్తున్నాయి. కొన్ని సంస్థలు సొంతంగా ఉపాధ్యాయులను, అధ్యాపకులను నియమించుకుని విద్యార్ధుల నుంచి ఎంతోకొంత ఫీజులు వసూలుచేసి నెట్టుకొస్తున్నాయి. కాని అధికశాతం సంస్థలు ముఖ్యంగా పాఠశాలలు మూతబడుతూనే ఉన్నాయి. అనేకం మూతబడినాయి కూడా.


ఎయిడెడ్‌ విద్యాసంస్థలను రక్షించాలని ఇప్పడు ఉద్యమిస్తున్న శక్తులు గత ఇరవై సంవత్సరాలుగా మిన్నకుండటంతో ప్రస్తుత దుస్థితి దాపురించింది. ఇప్పుడు విద్యార్ధులు ముందుకువచ్చి ఎయిడెడ్‌ విద్యాసంస్థలను కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం కించిత్ తలొగ్గింది. ఒక మెమోను జారీచేసింది. ఆ మెమోలో ఇచ్చిన నాలుగు ప్రత్యామ్నాయాలలో యాజమాన్యాలు 3 లేదా 4వ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటాయి, మరల ప్రైవేటీకరణకు మొగ్గుచూపుతాయి. వ్యాపారకాంక్ష లేని, నిజంగా సేవ చేయాలనుకున్న సంస్థలు, మతపరమైన సంస్థలు మాత్రమే ఎయిడ్‌ను కోరతాయి. ప్రభుత్వం ఎయిడెడ్‌ యాజమాన్యాల స్వాధీనం పేరుతో 41, 50, 51, 52 జీఓలను జారీచేసి తేనెతుట్టెను కదిలించింది కానీ, సక్రమంగా వ్యవహరించలేకపోయింది. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు, తరువాత విడుదల చేసిన మెమో అంతిమంగా యాజమాన్యాలకు ఉపయోగపడతాయి. ఇటు విద్యార్థులకు, అటు ఉపాధ్యాయ, అధ్యాపక సిబ్బందికి ఎటువంటి మేలు చేయవు. ఎయిడ్‌ను వదులుకునే సంస్థలు ప్రైవేటు విద్యాసంస్థలుగా నడుపుకోవచ్చునని ప్రభుత్వం ఉత్తర్వు నిచ్చింది. ఆ సంస్థలలో 30 శాతం సీట్లు యాజమాన్య కోటాగా భర్తీచేసుకోవచ్చనే ఆదేశాలు కూడా జారీచేశారు. ఇది పూర్తిస్థాయి ప్రైవేటీకరణకు దారితీస్తుంది. ప్రభుత్వానికి ఎయిడెడ్‌ విద్యాసంస్థలను స్వాధీనం చేసుకునే హక్కు ఉన్నది. విద్యాహక్కు చట్టం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విద్యాచట్టం 1982 సెక్షన్‌ 60 ద్వారా ప్రభుత్వానికి సంక్రమించిన అధికారాలను ఉపయోగించి వాటిని (మతసంస్థల ఆధ్వర్యంలోని వాటికి మినహాయింపు ఉంది) స్వాధీనం చేసుకోవచ్చు. 1982 విద్యాచట్టానికి ఆర్డినెన్స్‌ ద్వారా చేసిన సవరణతో కూడా ప్రభుత్వానికి ఆ అధికారం సంక్రమించింది. కాని ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడంలేదు? స్వాధీనం చేసుకునే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు. గ్రాంట్‌–ఇన్‌–ఎయిడ్‌ రద్దుచేసి ఆ పద్దు కింద కేటాయించే 680 కోట్ల రూపాయలను మిగుల్చుకునే ఆలోచన చేసింది. ఆ కారణంగా ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించలేదు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలలో చదువుకుంటున్న లక్షలాది పేద విద్యార్థుల భవిష్యత్‌ ఏమిటి? సంవత్సరాల తరబడి పోస్టులు భర్తీ చేయనందువల్ల కునారిల్లుతున్న ఎయిడెడ్‌ వ్యవస్థను చక్కదిద్దాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే అనేక ప్రత్యామ్నాయాలు ఆలోచించవచ్చు. మొదటిది- ప్రైవేటు ఎయిడెడ్‌ సంస్థలను స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయి ప్రభుత్వ సంస్థలుగా నడపడం, (మతసంస్థలు నిర్వహించే విద్యాసంస్థల స్వాధీనాన్ని చట్టం అనుమతించదు కనుక ఆ సంస్థలలోని ఖాళీలు అన్నింటినీ భర్తీచేయాలి). రెండవది- ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులన్నింటిని రద్దుచేసి, ఖాళీలన్నింటినీ భర్తీచేసి, అవసరమైన కొత్త పోస్టులు మంజూరు చేసి ఎయిడెడ్‌ వ్యవస్థకు పూర్వవైభవాన్ని తీసుకురావడం. జీఓలను రద్దుచేస్తే సరిపోతుందనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఉద్యమం కూడా ఆ దిశలోనే ఉంది. కేవలం ఆ నాలుగు జీఓలను రద్దు చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. ఖాళీలు భర్తీచేయకపోతే నాలుగైదు సంవత్సరాలలో ఎయిడెడ్‌ వ్యవస్థ దానంతటదే మూతబడుతుంది. అప్పుడైనా ఈ విద్యాసంస్థలలో చదివే లక్షలాది విద్యార్థులకు ప్రత్యామ్నాయ వ్యవస్థ లేదు. ఇక మూడవ ప్రత్యామ్నాయం- ఎయిడెడ్‌ విద్యాసంస్థలు ఉన్న గ్రామాలు, పట్టణాలలో ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను స్థాపించాలి. ఈ ప్రత్యామ్నాయాలలో మొదటిదే మెరుగైనది. గతంలో ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్న చరిత్ర ఉన్నది. ఇప్పుడు ఆ సాహసం చేయలేకపోతే మూడవ ప్రత్యామ్నాయం తప్పనిసరి అవుతుంది. పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ప్రభుత్వరంగంలోనే కొనసాగడం ఆవశ్యకం, ప్రయోజనకరం. సాంఘిక, ఆర్థిక అంతరాలు కొంతమేరకైనా తగ్గడానికి మార్గం సుగమం అవుతుంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి.

పి. పాండురంగవరప్రసాదరావు

ఏపిటియఫ్‌ ప్రధానకార్యదర్శి


Updated Date - 2021-11-30T06:14:45+05:30 IST