అక్విటెన్షన్‌...!

ABN , First Publish Date - 2021-10-27T06:54:43+05:30 IST

జగనన్న విద్యాకానుక (జేవీకే) కిట్ల పంపిణీ వ్యవహారం ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలకు పెద్ద టెన్షనగా మారింది

అక్విటెన్షన్‌...!
కంబదూరు మండలంలోని ఓ పాఠశాలలో బూట్లు వృథాగా పడేసిన దృశ్యం

కొత్త పిల్లల్లో వేలాదిమందికి నేటికీ అందని జేవీకే కిట్లు

వాటి బయోమెట్రిక్‌ పూర్తిచేయాలంటూ ఒత్తిళ్లు

తలలు పట్టుకుంటున్న  ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు

చాలా స్కూళ్లకు తక్కువ వచ్చిన వైనం

అనంతపురం విద్య, అక్టోబరు 26: జగనన్న విద్యాకానుక (జేవీకే) కిట్ల పంపిణీ వ్యవహారం ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలకు పెద్ద టెన్షనగా మారింది. పంపిణీ అస్తవ్యస్తంగా సాగడంతో నేటికీ వేలాది స్కూళ్లలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో కిట్లు అందించలేదు. కొన్ని స్కూళ్లలో కిట్లు కుప్పలుతెప్పలుగా పారబోస్తే, కొన్నిచోట్ల కొర త ఏర్పడింది. పంపిణీ పూర్తికావడంతో కిట్లు తీసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రుల వేలిముద్రలు (అక్విటెన్స్‌) తీసుకోవడం తలపోటుగా మారింది. దీంతో ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం 45,563 మంది బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ వేయాల్సి ఉంది. విద్యార్థులు అందుబాటులో లేకపోవడం, కొత్త విద్యార్థుల వివరాలు అప్‌డేట్‌ కాకపోవడం, పిల్లల వేలిముద్రలు పడకపోవడం తదితర సమస్యల కారణంగా భారీగా పెండింగ్‌లో ఉన్నాయి.


ఇవ్వకున్నా .. ఇచ్చినట్లు ధ్రువీకరించాలట..!

జిల్లావ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు అందలేదు. తప్పు అధికారులదైనా, తి ప్పలు మాత్రం ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలకు తప్పడం లేదు. అధికారులు గతేడాది ఉన్న విద్యార్థుల సం ఖ్య ఆధారంగా జేవీకే కిట్ల ఇండెంట్‌ పంపారు. వచ్చిన వాటిని ఆ మేరకు విద్యార్థులకు అందజేశారు. కొత్తగా చేరిన విద్యార్థులు వేలల్లో ఉ న్నారు. ప్రతి స్కూల్‌లో 30 మంది దాకా కొత్తగా 1, 6 తరగతుల్లో చేరారు. వారిలో చాలామందికి కిట్లు అందించలేదు. కిట్లు ఇవ్వకున్నా 100 శాతం అక్విటెన్స్‌ పూర్తి చేయాలన్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఒత్తిళ్లు తెస్తున్నారు. దీంతో ప్రధానోపాధ్యాయులకు ఇబ్బందులు తప్పడం లేదు.


జిల్లాలో 45 వేలకుపైగానే...

అధికారుల గణాంకాల మేరకు జిల్లావ్యాప్తంగా జేవీకే కిట్లు 4,11,745 మందికి లబ్ధి చేకూరగా 3,66,182 మంది వేలి ముద్రలు  జేవీకే యాప్‌లో నమోదు చేసి88.93 శాతం పూర్తిచేశారు. మరో 45,563 మంది వేలిముద్రలు పెండింగ్‌లో ఉన్న ట్లు గణాంకాలు చెబుతున్నాయి. బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ పూర్తి చేయకపోవడం ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలకు తీవ్ర సమస్యగా మారింది. విద్యార్థులు, తల్లిదండ్రులు అం దుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సీఆర్పీల జీతాలు నిలిపివేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొందరు విద్యార్థులు స్కూళ్ల వైపు కూడా చూడకపోవడంతో వారిని వెతికి వేలిముద్రలు వేయించేందుకు సీఆర్పీలు నానా అవస్థలు పడుతున్నారు.

Updated Date - 2021-10-27T06:54:43+05:30 IST