కరోనా కట్టడికి యాక్షన్‌ ప్లాన్‌

ABN , First Publish Date - 2020-11-29T05:12:04+05:30 IST

కరోనా వైరస్‌ రెండో దశ విజృంభించకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలకు దిగుతోంది. ప్రతి ఒక్కరినీ అప్రమత్తం చేయటమే ప్రధాన అజెండాగా 50 రోజుల ప్రణాళిక సిద్ధం చేసింది. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.

కరోనా కట్టడికి యాక్షన్‌ ప్లాన్‌

 వైరస్‌ వ్యాప్తి చెందకుండా 50 రోజుల కార్యాచరణ

సెకెండ్‌ వేవ్‌లో కేసులు రాకుండా చర్యలు

సమన్వయంతో ముందుకు సాగుదాం: కలెక్టర్‌ 

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

కరోనా వైరస్‌ రెండో దశ విజృంభించకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలకు దిగుతోంది. ప్రతి ఒక్కరినీ అప్రమత్తం చేయటమే ప్రధాన అజెండాగా 50 రోజుల ప్రణాళిక సిద్ధం చేసింది. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ ముందస్తు ప్రణాళికను శనివారం కలెక్టర్‌ ప్రారంభించారు. జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులతో సమావేశమయ్యారు. వారు తిరిగి సంబంధిత శాఖల సిబ్బందితో సమావేశమై కార్యాచరణ, జాగ్రత్తలు, ముందస్తు జాగ్రత్తలు పాటించే తీరు తెన్నులపై చర్చించారు. ఇదిలా ఉండగా మండల స్థాయిలోనూ వివిధ శాఖల అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి... ఉద్యోగులు, ప్రజలు రెండో దశ కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

 సంక్రాంతి వరకూ.. 

కరోనా జిల్లాలో ప్రబలకుండా తొలి మూడు నెలల వరకు కట్టడి చేయగలిగారు. గ్రీన్‌జోన్‌గా గుర్తింపు తెచ్చారు. ఇతర జిల్లాల్లో వైరస్‌ కేసులు విజృంభిస్తుంటే మనం నిశ్చింతగా ఉన్నాం.  వలస కూలీలు, ఇతర రాషా్ట్రల నుంచి జిల్లాకు వచ్చిన వారి ద్వారా జిల్లాలో వైరస్‌ వ్యాప్తి చెందిన సంగతి తెలిసినదే. ఇదిలా ఉండగా రెండో విడతలో ప్రబలుతున్న కరోనా వైరస్‌ ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తిస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇతర రాషా్ట్రలు, దేశాల్లో కరోనా సెకెండ్‌ వేవ్‌ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  దీంతో మన జిల్లాలో కరోనా వైరస్‌ ప్రబలకుండా ముందుగానే కార్యాచరణను ప్రారంభించారు. అవగాహన, ముందస్తు జాగ్రత్తలే ప్రధానం కావటంతో ఈ దిశగా ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమాలు చేపట్టాలని జాతీయ స్థాయి నుంచే ప్రత్యేక కార్యాచరణ అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  వ్యాక్సిన్‌ వచ్చేవరకు జాగ్రత్తలు పాటించాల్సిందేనని కలెక్టర్‌ సూచించారు. సెకెండ్‌ వేవ్‌లో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా చూడటమే లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఇందుకోసం శనివారం నుంచి 50 రోజుల కార్యాచరణ అమలు చేద్దామని చెప్పారు. గ్రామ స్థాయి వరకు అవగాహనా కార్యక్రమాలు వెళ్లాలని ఆదేశించారు. జనవరి 15వరకు ప్రచారోద్యమం నిర్వహించాలని అన్ని శాఖలకు ఆదేశించారు. వ్యాక్సిన్‌ వచ్చేందుకు ఇంకా రెండు మూడు నెలలు పడుతుందని, అంతవరకు తగిన జాగ్రత్తలు పాటించాల్సిందేనని చెప్పారు. జిల్లాలో ఇక నుంచి కరోనా నిర్ధారణ కోసం ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు మాత్రమే నిర్వహిస్తారని చెప్పారు. ర్యాపిడ్‌, యాంటీజెన్‌ పరీక్షలు చేయరని  వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్‌వి రమణకుమారి, జేసీ కిశోర్‌కుమార్‌, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ నాగభూషణరావు, డీఆర్‌ఓ గణపతిరావు, జెడ్పీ సీఈఓ టి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

------------------


Updated Date - 2020-11-29T05:12:04+05:30 IST