యాక్షన్‌ క్వీన్స్‌!

ABN , First Publish Date - 2021-04-04T05:31:29+05:30 IST

ప్రస్తుతం బాలీవుడ్‌లో కొందరు స్టార్‌ హీరోయిన్లు యాక్షన్‌ బాట పట్టారు. హీరోతో చేతులు కలిపి విలన్లతో భారీ

యాక్షన్‌ క్వీన్స్‌!

ప్రస్తుతం బాలీవుడ్‌లో కొందరు స్టార్‌ హీరోయిన్లు యాక్షన్‌ బాట పట్టారు. హీరోతో చేతులు కలిపి విలన్లతో భారీ పోరాటాలకు తెరతీస్తున్నారు. యాక్షన్‌ క్వీన్లుగా వెండితెరపై సందడి చేయటానికి సిద్ధమవుతున్న కొందరు బాలీవుడ్‌ తారలు వీరే. 


దీపికా పడుకోన్‌

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దీపికా పడుకోన్‌ యాక్షన్‌ ఓరియంటెడ్‌ నేపథ్యంలో వరుస చిత్రాలు చేస్తున్నారు. గూడచర్యం నేపథ్యంలో ఆమిర్‌ఖాన్‌ కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం ‘పఠాన్‌’. పూర్తిస్థాయి యాక్షన్‌ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది. ‘పఠాన్‌’లో దీపికా పడుకోన్‌ భారీ స్టంట్లు చేయబోతున్నారు. అలాగే హృతిక్‌ రోషన్‌ సరసన దీపికా పడుకోన్‌ నటిస్తోన్న ‘ఫైటర్‌’ చిత్రంలోనూ ఆమె సివంగిలా శత్రువులతో తలపడనున్నారు. ఈ మెగా బడ్జెట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రంలో దీపిక గూఢచారి పాత్రలో కనిపిస్తారని సమాచారం. దేశానికి హాని కలిగించే కొన్ని శక్తులను మట్టుపెట్టే మిషన్‌లో భాగంగా ఆమె విదేశాల్లో విలన్లతో తలపడతారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం ఆమె ముందస్తుగా సన్నద్ధమవుతున్నారు.  




దిశాపటానీ

సల్మాన్‌ఖాన్‌ సరసన దిశాపటాని కథానాయికగా నటిస్తోన్న చిత్రం ‘రాధే’. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇం దులో సల్మాన్‌ అండర్‌ కవర్‌ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారని సమాచారం.  ఆయనతో పాటు దిశా కూడా భారీ పోరాట సన్నివేశాల్లో ప్రేక్షకులను అలరించనున్నారు. తన పాత్ర కోసం దిశా మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.




కంగనా రనౌత్‌

హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కంగనా రనౌత్‌. నిజజీవితంలో ప్రత్యర్థులపై విరుచుకుపడే ఈ ఫైర్‌బ్రాండ్‌ ‘దాక్కడ్‌’ చిత్రంతో తనలోని కొత్త కోణాన్ని తెరపైకి తెస్తున్నారు. హాలీవుడ్‌ చిత్రం ‘రెసిడెంట్‌ ఈవిల్‌’ స్ఫూర్తితో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇందులో కంగన గూఢచారి పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన స్టిల్స్‌లో కంగన మెషీన్‌ గన్లతో మోత మోగిస్తున్నారు. థాయ్‌లాండ్‌ నుంచి వచ్చిన స్టంట్‌ డైరెక్టర్ల దగ్గర యుద్దవిద్యలు, తుపాకుల వాడకంలో కంగన ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రంలో ఒక యాక్షన్‌ సీక్వెన్స్‌ను 14 రోజుల పాటు రూ. 25 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు. అలాగే కంగన యుద్ధ విమానాల పైలెట్‌గా నటిస్తున్న ‘తేజస్‌’ కూడా యాక్షన్‌ చిత్రంగా రూపొందుతోంది. 



కట్రినా కైఫ్‌

 సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘టైగర్‌ 3’లో కట్రినా కైఫ్‌ కథానాయికగా నటిస్తున్నారు. హీరో హీరోయిన్లు ఇద్దరూ గూఢచారుల పాత్రల్లో నటిస్తున్నారు. ఐఎ్‌సఐ ఏజెంట్‌ జోయా పాత్రలో కట్రినా కనిపించనున్నారు. షూటింగ్‌ ప్రారంభించటానికి ముందు కట్రినా సౌత్‌ కొరియాకు చెందిన స్టంట్‌ మాస్టర్ల దగ్గర 14 రోజుల శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రంలో హై వోల్టేజ్‌ యాక్షన్‌ సన్నివేశాల్లో కట్రినా నటన ఆకట్టుకుంటుందని బాలీవుడ్‌ టాక్‌. 


Updated Date - 2021-04-04T05:31:29+05:30 IST