డీఈపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-22T05:29:40+05:30 IST

వంకలు, వాగుల ఆక్రమణలను తొలగించి, విస్తరించాల్సిన పంచాయతీరాజ్‌ డీఈ మల్లేశ్వరరెడ్డి స్వయంగా వంకను ఆక్రమించి రోడ్డును వేస్తున్నారని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు శుక్రవారం తహసీల్దారు ప్రేమంతకుమార్‌కు ఫిర్యాదు చేశారు.

డీఈపై చర్యలు తీసుకోవాలి
తహసీల్దారుకు ఫిర్యాదు చేస్తున్న రైతులు

తహసీల్దారుకు ఫిర్యాదు చేసిన రైతులు

మైదుకూరు, జనవరి 21: వంకలు, వాగుల ఆక్రమణలను తొలగించి, విస్తరించాల్సిన పంచాయతీరాజ్‌ డీఈ మల్లేశ్వరరెడ్డి స్వయంగా వంకను ఆక్రమించి రోడ్డును వేస్తున్నారని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు శుక్రవారం తహసీల్దారు ప్రేమంతకుమార్‌కు ఫిర్యాదు చేశారు. వంకను పూడ్చి రోడ్డు వేస్తున్న వైనంపై శుక్రవారం ఆంధ్రజ్యోతిలో కథనం రావడంతో మండలంలోని సోమయాజుపల్లెకు చెందిన గ్రామస్తులు, రైతులు కొందరు శుక్రవారం మైదుకూరులోని తహసీల్దారు కార్యాలయానికి చేరుకొని తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. వక్కిలేరు వంకకు దాదాపు కిలోమీటరు వరకు రోడ్డు వేస్తున్నారని,  ఇది న్యాయం కాదని తాము అడ్డుకోబోతే పోలీసులతో మమ్మల్ని తోసేయించారని, రహదారి నిర్మిస్తే వంక వారగా ఉన్న తమ వ్యవసాయం భూములకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యత గల అధికారే ఇలా ఆక్రమిస్తే ఎలాగని, డీఈఈపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 


అధికారమనే గర్వమా..: పుట్టా

వంకలు, వాగులను పరిరక్షించాల్సిన అధికారులే ఆక్రమించి రోడ్డు వేయడం చూస్తూంటే అధికారులమనే అహంకారం కనిపిస్తోందని టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. వర్షాకాలంలో రైతులకు ఉపయోగపడుతున్న వంకను ఆక్రమించి రోడ్డు వేయడం తగదని, అధికార పార్టీ నాయకులతో పాటు అధికారులు కూడా ఆక్రమిస్తే ఇక రైతులకు మిగిలేది ఏమీ ఉండదని,  డీఈపై తగిన చర్యలు తీసుకోక పోతే  కోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2022-01-22T05:29:40+05:30 IST