కేసుల పరిష్కారానికి చర్యలు

ABN , First Publish Date - 2022-08-13T06:18:34+05:30 IST

కేసుల పరిష్కారానికి జిల్లా పోలీస్‌ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.

కేసుల పరిష్కారానికి చర్యలు

నేడు జాతీయ లోక్‌ అదాలత్‌
సద్వినియోగం చేసుకోవాలని పోలీసు యత్రాంగం సూచన

కర్నూలు, ఆగస్టు 12: కేసుల పరిష్కారానికి జిల్లా పోలీస్‌ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం శనివారం జరిగే నేషనల్‌ లోక్‌ మెగా అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని బావించింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సిద్దార్థకౌశల్‌ జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు గత వారం రోజుల నుంచే సమాచారం ఇచ్చారు. చిన్న చిన్న కేసుల్లో రెండు పార్టీలు రాజీమార్గంలో ఉండే కేసులను తీసుకుని లోక్‌అదాలత్‌లో వాటి పరిష్కారాం చూపాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో సీఐలు, ఎస్‌ఐలు కక్షిదారులను గత రెండు రోజుల నుంచి స్టేషన్‌లకు పిలిపిస్తున్నారు. లోక్‌అదాలత్‌లలో కేసులు రాజీ చేసుకోవాలని సూచనలు ఇస్తున్నారు.

లోక్‌ అదాలత్‌తోనే సత్వర న్యాయం: జడ్జి

లోక్‌ అదాలత్‌తోనే సత్వర న్యాయం జరుగుతుందని, కక్షిదారులు శనివారం జరిగే జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీని యర్‌ సివిల్‌ జడ్జి డీఎల్‌ఎస్‌ఏ కన్వీనర్‌ సీహెచ్‌వీఎన్‌ శ్రీనివాసరావు సూచిం చారు. శుక్రవారం తాలుకా పోలీస్‌స్టేషన్‌లో కక్షిదారులకు కౌన్సెలింగ్‌ నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి సీనియర్‌ సివిల్‌ జడ్జి డీఎల్‌ఎస్‌ఏ కన్వీనర్‌ సీహెచ్‌వీఎన్‌ శ్రీనివాసరావు, జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ హాజరయ్యారు. డీసీ ఎల్‌ఏ కన్వీనర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యక్తుల మధ్య తగాదాలను, రాజీమార్గం ద్వారా పరిష్కరించడానికే చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వివిధ కేసులలో కక్షిదారులైన వారిని ఈ విధంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వచ్చి సత్వర న్యాయమేళా కౌన్సిలింగ్‌ కార్యక్రమాన్ని ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఇలా న్యాయ కౌన్సెలింగ్‌ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారిగా చూస్తున్నామ న్నారు. కర్నూలు కోర్టులో 4,800 కేసులు పెండింగ్‌ లో ఉన్నాయని తెలిపారు. కేసులన్నీ ట్రయల్‌కు రావాలంటే ఎన్ని సంవ త్సరాలు పడుతుందోనని తెలిపారు. చిన్న చిన్న కేసులు పేరుకుపోయి పరిష్కారం కాకుండా ఉన్నాయన్నారు. కేసులలో రాజీ అయితే కోర్టుకు పని భారం తగ్గుతుందని, రాజీమార్గమే రాజమార్గమని భావించాలని సూచించారు.

మూడు నెలలకొకసారి లోక్‌ అదాలత్‌: ఎస్పీ

 శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పని చేస్తామని ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ తెలిపారు. లోక్‌ అదాలత్‌లో కచ్చితంగా సత్వర న్యాయం జరుగుతుందని, 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన లోక్‌ అదాలత్‌ల ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. తెలియని వారికి తెలిసిన వారు చెప్పాలని, తీవ్రమైన నేరాలు కాకుండా, చిన్న చిన్న కారణాలు, తగాదాలతో కేసులు నమోదై ఉంటే లోక్‌అదాలత్‌ల ద్వారా పరిష్కరించుకునే విదంగా అవగాహన కల్పించాలన్నారు. వంద శాతం న్యాయం జరిగే విదంగా చేస్తామన్నారు. కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ ప్రసాద్‌, తాలుకా సీఐ శేషయ్య, కోర్టు మానిటరింగ్‌ సీఐ రామయ్య నాయుడు, తాలుకా ఎస్‌ఐలు ఉన్నారు.


Updated Date - 2022-08-13T06:18:34+05:30 IST