విధులకు డుమ్మా కొడితే చర్యలు : జేసీ

ABN , First Publish Date - 2020-12-04T04:56:19+05:30 IST

సచివాలయ సిబ్బంది విధులకు డుమ్మా కొడితే కఠిన చర్యలు తప్పవని జేసీ మహేష్‌కుమార్‌ హెచ్చరించారు.

విధులకు డుమ్మా కొడితే చర్యలు : జేసీ
సెమినార్‌లో మాట్లాడుతున్న జేసీ

విజయనగరం (ఆంధ్రజ్యోతి), డిసెంబరు 3: సచివాలయ సిబ్బంది విధులకు డుమ్మా కొడితే కఠిన చర్యలు తప్పవని జేసీ మహేష్‌కుమార్‌ హెచ్చరించారు. గురువారం ఆనందగజపతి ఆడిటోరియంలో ప్రవర్తన , సీసీఏ నియామవళి, కార్యాలయ మర్యాద తదితర అంశాలపై సచివాలయ సిబ్బందికి సెమినార్‌ నిర్వహించారు. డివిజన్‌ల వారీగా శిక్షణ కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సచివాలయాల్లో కొన్ని శాఖలకు చెందిన సిబ్బంది వారంలో రెండు, మూడు రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. పద్ధతి మార్చుకోక పోతే శాఖపరమైన చర్యలు తప్పవని  స్పష్టం చేశారు. ప్రభుత్వ పఽథకాలు అమలులో సచివాలయ ఉద్యోగులది కీలకపాత్ర అని, నియామవళిని పాటిస్తూ క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని సూచించారు.  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. మధ్యాహ్నం మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, స్థానికంగా నివాసం ఉండాలని చెప్పారు.  అనంతరం  సచివాలయ ఉద్యోగులు పాటించాల్సిన నియామావళి 1964 సీసీఏ, 1991 కార్యాలయ, సమాచార నడవడికను  జాయింట్‌ డైరెక్టర్‌ ఎం.సురేష్‌కుమార్‌  వివరించారు. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా 29 నియమాలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యక్తిత్వం, విశ్వసనీయత కలిగి ఉండాలని చెప్పారు. మాస్ట్‌ర్‌ ట్రైనీలుగా శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు  అందజేశారు. విజయనగరం, పార్వతీపురం డివిజనల్‌  డెవలప్‌మెంట్‌ అధికారులు రామచంద్రరావు, రాజ్‌కుమార్‌ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఎంపీడీవోలు, ఈవోపీఆర్‌డీలు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2020-12-04T04:56:19+05:30 IST