రీ సర్వేలో తప్పులు దొర్లితే చర్యలు: జేసీ

ABN , First Publish Date - 2022-06-25T06:14:47+05:30 IST

భుత్వం ద్వారా గ్రామాలవారీగా చేపడుతున్న రీ సర్వే జాగ్రత్తగా చేయాలని, తప్పులు దొర్లితే చర్యలు తప్పవని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ అధికారులను హెచ్చరించారు.

రీ సర్వేలో తప్పులు దొర్లితే చర్యలు: జేసీ
గుడుపల్లె మండలం సొన్నార్సనపల్లెలో గ్రామస్థులతో మాట్లాడుతున్న జేసీ వెంకటేశ్వర్‌

రెవెన్యూ అధికారులకు జేసీ హెచ్చరిక


కుప్పం, జూన్‌ 24: ప్రభుత్వం ద్వారా గ్రామాలవారీగా చేపడుతున్న రీ సర్వే జాగ్రత్తగా చేయాలని, తప్పులు దొర్లితే చర్యలు తప్పవని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ అధికారులను హెచ్చరించారు. కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, గుడుపల్లె, రామకుప్పం మండలాల్లో జరుగుతున్న రీ సర్వే కార్యక్రమాన్ని శుక్రవారం జేసీ విస్తృతంగా తిరిగి పరిశీలించారు. రామకుప్పం మండలంలోని విజలాపురం, కుప్పం మండలంలోని పెద్దిగానూరు, గుడుపల్లె మండలంలోని ఉన్సిగానిపల్లె, సొన్నార్సనపల్లె గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న రీ సర్వే పనులను పరిశీలించి ఆయా గ్రామాలలో ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందితో జేసీ మాట్లాడుతూ రీ సర్వే కార్యక్రమంలో డ్రోన్‌ సర్వే తర్వాత, ఓఆర్‌ఐ షీట్లు ద్వారా వచ్చిన వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడం గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకోసం మొదట ప్రభుత్వ భూములను ముందుగానే కొలుస్తామన్నారు. అనంతరం ప్రైవేటు వ్యక్తుల భూములను కొలుస్తామన్నారు. ఈ కార్యక్రమం సక్రమంగా పూర్తి అయితే గ్రౌండ్‌ ఫ్లోర్‌ వాలిడేషన్‌ నిర్వహిస్తామన్నారు. దీనిపై క్షేత్ర స్థాయిలో భూమి కొలతల విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే డీటీ స్థాయి అధికారి ద్వారా ఆయా సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు. 110 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న ఈ సర్వే రెవెన్యూ శాఖకు ఎంతో అవసరమన్నారు. ఈ సర్వే ద్వారా పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన వారు రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధిగమించగలరన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గాంధీ జయంతినాటికి రెండువేల గ్రామాల భూములకు సంబంధించిన హక్కు పత్రాలను అందజేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. దీనితోపాటు భూ సమస్యల పరిష్కారం ఈ సర్వే ద్వారా పూర్తి స్థాయిలో జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శివయ్యతోపాటు ఆయా మండలాల తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-06-25T06:14:47+05:30 IST