రాష్ట్రంలో చురుగ్గా రక్త సేకరణ

ABN , First Publish Date - 2022-08-08T09:14:15+05:30 IST

తెలంగాణలో రక్తసేకరణ కార్యక్రమం చురుగ్గా జరుగుతోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది.

రాష్ట్రంలో చురుగ్గా రక్త సేకరణ

ఆరునెలల్లోనే లక్ష యూనిట్ల సేకరణ

బ్లడ్‌ బ్యాంకుల్లో ఐదోస్థానంలో తెలంగాణ: కేంద్ర ఆరోగ్య శాఖ 


హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రక్తసేకరణ  కార్యక్రమం చురుగ్గా జరుగుతోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు ఆరునెలల వ్యవధిలో రాష్ట్రం లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించిందని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన రక్తనిధి(బ్లడ్‌ బ్యాంకు), రక్తసేకరణ యూనిట్ల వివరాలను ఆదివారం విడుదల చేసింది. ‘దేశవ్యాప్తంగా మొత్తం 3908 బ్లడ్‌ బ్యాంకులున్నాయి. బ్లడ్‌ బ్యాంకుల విషయంలో తెలంగాణ దేశంలో ఐదో స్థానంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 256 బ్లడ్‌ బ్యాంకులున్నాయి. వాటిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 66 ఉండగా, ప్రైవేటులో 190 ఉన్నాయి, దేశంలో అత్యధికంగా బ్లడ్‌ బ్యాంకులు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నా యి. అక్కడ సర్కారు ఆఽధ్వర్యంలో 114, ప్రైవేటులో 342 బ్లడ్‌ బ్యాంకులున్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 374, తమిళనాడులో 338, కర్నాటకలో 273 బ్లడ్‌ బ్యాంకులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వీటి సంఖ్య 220గా ఉంది. ఇక అత్యల్పంగా లక్షద్వీప్‌లో ఒకే ఒక్క బ్లడ్‌ బ్యాంకు ఉంది.


అండమాన్‌నికోబార్‌, దాద్రానగర్‌హవేలీ, లద్దాఖ్‌లలో మూడేసి చొప్పున బ్లడ్‌ బ్యాంకులున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యధిక రక్తనిధి కేంద్రాలున్న రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉత్తరప్రదేశ్‌(114), ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా పశ్చిమ బెంగాల్‌(109), తమిళనాడు(106) ఉన్నాయి. తెలంగాణలో బ్లడ్‌ బ్యాంకులు ఎక్కువగా ఉన్నప్పటికీ రక్త సేకరణలో మాత్రం మిగతా రాష్ట్రాలతో పోల్చితే వెనుకబడింది, రాష్ట్రం కంటే బ్లడ్‌ బ్యాంకులు తక్కువగా ఉన్న పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌లు మెరుగ్గా ఉన్నాయి. ఇక గత రెండేళ్లుగా రికార్డు స్థాయిలో రక్త సేకరణలో మహారాష్ట్రలో అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది ఆరు నెలల్లో 5,69,505 యూనిట్లను సేకరించి ప్రస్తుతం ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో గుజరాత్‌, యూపీ ఉన్నాయి’ అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ఏటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ యూనిట్ల రక్తాన్ని సేకరించాల్సిన అవసరం ఉందని బ్లడ్‌ బ్యాంకుల నిర్వాహకులు చెబుతున్నారు.  ఇక గర్భిణులు, న్యూరో సర్జరీ కేసులు, తలసేమియా, సికిల్‌ సెల్‌ రోగులకు నిత్యం రక్తం అవసరమున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలకు రక్త సేకరణ మరింత పెరగాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 

Updated Date - 2022-08-08T09:14:15+05:30 IST