ప్రచారంలో కనిపించని జోష్‌

ABN , First Publish Date - 2021-04-06T07:06:48+05:30 IST

పంచాయతీ, పురపాలక ఎన్నికల ప్రచారాల్లో కనిపించిన జోష్‌ ప్రాదేశిక ఎన్నికల్లో కన్పించడం లేదు.

ప్రచారంలో కనిపించని జోష్‌

ఆర్భాటాల జోలికి పోని అభ్యర్థులు

నేటితో ముగియనున్న ‘పరిషత్‌’ ప్రచారం


చిత్తూరు, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ, పురపాలక ఎన్నికల ప్రచారాల్లో కనిపించిన జోష్‌ ప్రాదేశిక ఎన్నికల్లో కన్పించడం లేదు. ఈ ఎన్నికల నిర్వహణకు అధికారులు హైరానా పడుతున్నారు కానీ అభ్యర్థులు మాత్రం నిదానంగానే ఉన్నారు. నేటితో ప్రచారానికి తెర పడనున్న ఈ ఎన్నికలకు ఇంకా ఓటరు తలుపు తట్టని అభ్యర్థులెందరో ఉన్నారు. అప్రజాస్వామికంగా ఎన్నికలను నిర్వహిస్తున్నారని టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరించడంతో అధికార పార్టీ అభ్యర్థుల్లో ధీమా పెరిగింది. ప్రచారం చేయకపోయినా గెలిచేస్తామనే నమ్మకంతో ఉన్నారు.పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి కొన్ని చోట్ల ప్రచార వాహనాలకు కూడా టీడీపీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేదు. మరికొన్ని చోట్ల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోటీలో నిలబడాలని నిర్ణయించుకుని హంగూ ఆర్భాటాలు లేకుండా ప్రచారం చేసుకున్నారు. జనసేన, వామపక్షాల అభ్యర్థులు కూడా అంతంతమాత్రంగానే ప్రచారం చేసుకుంటున్నారు.రెండు నెలల కిందట జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచి అభ్యర్థుల బంధువులంతా కూడా ప్రచారంలో కన్పించారు. వలస వెళ్లిన ఓటర్లను రప్పించి మరీ ఓట్లు వేయించుకున్నారు. గత నెలలో జరిగిన పురపాలక ఎన్నికల్లో కూడా అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల నేతలు విస్త్రృతంగా ప్రచారం చేశారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలను కూడా అన్ని ప్రఽధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని బలమైన నేతలతో ప్రచారం చేసుకుంటున్నాయి. వైసీపీ, టీడీపీ నేతలు తమ దృష్టిని పూర్తి స్థాయిలో తిరుపతి ఎన్నికల మీద పెట్టారు. పరిషత్‌ ఎన్నికలకు వచ్చేసరికి వైసీపీ తరఫున అవసరాన్ని బట్టి నాయకులు ప్రచారం చేస్తుండగా.. అధినేత నిర్ణయం మేరకు టీడీపీ నాయకులు ప్రచారంలో కన్పించడం లేదు.పోటీ పెద్దగా లేదన్నచోట ప్రచార, ప్రలోభాల ఖర్చు తగ్గించుకోవడానికే అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారు.కొన్నిచోట్ల ప్రత్యర్థులు ముందే చేతులెత్తేయడంతో ఓటర్లకు సొమ్ములు పంచినా.. పంచకపోయినా గెలిచేస్తామనే ధీమాతో జేబు నుంచి డబ్బులు తీయడానికి చాలామంది ఇష్టపడడం లేదు. జిల్లాలో 65 జడ్పీటీసీ స్థానాలుండగా.. 30 వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. 35 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. కలకడ, బంగారుపాళ్యం మండలాల్లో టీడీపీ అభ్యర్థులు చనిపోవడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. మొత్తంగా ఈ నెల 8వ తేదీన 33 మండలాల్లో మాత్రమే జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 424 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 5 చోట్ల అభ్యర్థులు మరణించారు. దీంతో 419 చోట్ల ఎంటీపీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.పోలింగుకు 1554 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 10వ తేదీన ఓట్ల లెక్కింపు కోసం 10 కౌంటింగ్‌ సెంటర్లను సిద్ధం చేశారు.

Updated Date - 2021-04-06T07:06:48+05:30 IST