Advertisement

‘నువ్వు తగ్గితే పనికిరావు అని హెచ్చరిస్తూనే ఉంటారు’

Sep 8 2020 @ 08:25AM

విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి 08/09/2020న గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశారు. విలన్‌గా భయపెట్టే పాత్ర అయినా హాస్యనటుడిగా నవ్వించే పాత్ర అయినా జయప్రకాష్ రెడ్డి తన నటనతో ప్రేక్షకులను ఎంతో అలరిస్తూ వచ్చారు. రంగస్థలం నుంచి సినిమాల్లోకి వచ్చిన ప్రముఖ నటుల్లో జయప్రకాశ్‌రెడ్డి ఒకరు. పాత్ర ఏదైనా.. ఆయన నటన అద్భుతం. విలనిజంలోనే కామెడీని పండించడం ఆయన ప్రత్యేకత... ఫ్యాక్షనిష్టు పాత్రల్లో ఎక్కువగా నటించిన ఆయన నాటక రంగమే నా ప్రాణం అన్నారు. ప్రతిభావంతులను ప్రోత్సహించాల్సిన అవసరముందంటున్న ఆయన.... భారీతనం కోసం పరభాషా నటులొద్దంటున్నారు. ఆయనతో 8-4-13న జరిగిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమం విశేషాలు...


మీ నేపథ్యం..

మాది కర్నూలు జిల్లా. మా నాన్న పోలీస్‌ డిపార్ట్‌మెంటులో పనిచేశారు. నేను అనంతపురంలో ఎస్సెస్సెల్సీ చదువుకున్నాను. తర్వాత గుంటూరులో కాలేజీ చదువు సాగింది. అక్కడే లెక్కల మాస్టారుగా మునిసిపల్‌ హైస్కూల్లో పనిచేశాను. చిన్నప్పటి నుంచీ నాటకాలు వేశాను. నాకు మొదట్లో కమర్షియల్‌ టాక్స్‌ విభాగంలో, అటవీ విభాగంలో ఉద్యోగాలు వచ్చాయి. కానీ, మా నాన్న వద్దన్నారు. నా కుమారుడు లంచం తీసుకునే ఉద్యోగం చేయకూడదనేది ఆయన ఉద్దేశం. రంగస్థలం నాకు చాలా ఇష్టం. నేనీ స్థితిలో ఉండడానికి అదీ ఒక కారణం. నాటకాలు వేయడాన్ని మా నాన్న ప్రోత్సహించారు. నేను మొదటగా వేసింది ‘ఓ సీ్త్ర పాత్ర’. దానికి ‘ఉత్తమ నటి’ అవార్డు కూడా ఇచ్చారు.

Advertisement

విలనిజం ముద్ర మీకు లాభమా.. నష్టమా?

ఒకే రకమైన యాస, నటన ఉండకూడదు. అలాంటి ముద్ర పడకూడదనేది నా ఉద్దేశం. ‘ప్రేమించుకుందాం.. రా’ చిత్రంలో మొదటగా రాయలసీమ యాస వాడాను. అది నాకు టర్నింగ్‌ పాయింట్‌. ఈ యాస కోసం.. పది రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో తిరిగి భాషను గమనించాను. ఈ సారి నాయక్‌ సినిమాకు సంబంధించి నాకు మంచి పేరొచ్చింది.


ఇంత లావెప్పుడయ్యారు?

డిగ్రీ చదువుతున్నప్పటి వరకూ సన్నగా, పొడుగ్గా ఉండేవాడిని. ఆ తర్వాతే లావెక్కాను. కానీ, ఈ శరీరమే ఇప్పుడు పనికొచ్చింది. ‘నువ్వు ఈ స్థాయిలో ఉండాల్సిందే. తగ్గితే పనికిరావు’ అంటూ సినీజనాలు హెచ్చరిస్తూనే ఉంటారు.

సినిమాల్లోకి ఎలా వచ్చారు?

నేను నల్లగొండలో ఒక నాటకం వేసినప్పుడు దాసరి నారాయణరావు అతిథిగా వచ్చారు. నా నటన నచ్చి రామానాయుడుగారికి చెప్పారు. ఆయన మా బృందాన్ని పిలిపించుకుని అన్నపూర్ణ స్టూడియోలో నాటకం వేయించుకున్నారు. ఆ తర్వాత 1984లో బ్రహ్మపుత్రుడు సినిమాలో అవకాశమిచ్చారు. తర్వాత చాలా సినిమాల్లో నటించినా.. సరైన గుర్తింపు రాలేదు. అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డాను. ఖర్చుల కోసం నా భార్య మెడలోని బంగారం కూడా కుదువ పెట్టాను. 1992లో సినీ పరిశ్రమను వదిలి వెళ్లిపోయాను. అయితే.. 97లో మళ్లీ ‘ప్రేమించుకుందాం..రా’ కోసం రామానాయుడు పిలిచారు. అక్కడ్నించి వెనుదిరిగి చూడలేదు.


ఫ్యాక్షన్‌పై మీ అభిప్రాయం?

ఫ్యాక్షనిస్టులంతా వ్యక్తిగతంగా చాలా మంచి వారేనని నా అభిప్రాయం. పంతం వల్లే వారు అలా వ్యవహరిస్తుంటారు. ఫ్యాక్షన్‌ పాత్రలే కాదు.. ఇటీవల హాస్య పాత్రలూ ఎక్కువగా వస్తున్నాయి. నూతిలో కప్పలు అనే సినిమాలో గంగ్నమ్‌ స్టైల్‌లో డ్యాన్స్‌ కూడా చేశాను. దానికి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.


సినిమాల్లో బిజీగా ఉండీ.. నాటకాలు వేస్తారేం?

రంగస్థలం నాకు ప్రాణం. కొన్ని సినిమాల్లో ఆశిష్‌ విద్యార్థి అనే ఒక నటుడితో కలిసి చేశాను. ఆయనా రంగస్థలం నుంచే వచ్చారు. తాను ఒకే పాత్రతో నాటకాలు వేశానని చెప్పారు. పూసల వెంకటేశ్వరరావు అనే రచయిత రాసిన ‘అలెగ్జాండర్‌’ అనే నాటకాన్ని వేయాలని నిర్ణయించుకున్నాను. దానికోసం తోటి నటులు తమ వాయిస్‌ ఇచ్చారు కూడా. 100 నిమిషాల పాటు ఏకధాటిగా ఏకపాత్రాభినయంతో ఆ నాటకాన్ని 30 ప్రదర్శనలిచ్చాను. నేను సినిమా ఆర్టిస్టును కాదు. సినిమాల్లో వేషాలు వేస్తున్నానంతే!

పరభాషా నటులను రానివ్వొద్దనేదానితో ఏకీభవిస్తారా?

ఇందులో రెండు విషయాలున్నాయి. టాలెంట్‌ ఎక్కడున్నా.. ప్రోత్సహించవచ్చు. అంతేగానీ, ఎప్పుడూ వీళ్లేనా అనే ఉద్దేశంతోనో, ఏదో భారీ సినిమా తీస్తున్నామనే పేరుతో.. వేరే రాషా్ట్రల నుంచి నటులను తీసుకురావడం మాత్రం సరికాదు. భాష రాని వారితో పనిచేయించుకోవడం సమస్య కూడా.


శేష జీవితం ఎలా గడుపుతారు?

సినిమా నటుడిగా ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు. నా వల్ల కాదనుకున్నప్పుడు నేనే రిటైరవుతాను. మంచి నాటకాలు వేసుకుంటూ గడిపేస్తాను. ఆంధ్రప్రదేశ్‌లో నాటకాన్ని అభివృద్ధి చేయాలనే కోరిక ఉంది. ప్రతీ ఆదివారం జిల్లా కేంద్రాల్లో, ముఖ్య కేంద్రాల్లో ఒక నాటకం జరుగుతుండాలి. ఇందుకోసం ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రజల్లోనూ చైతన్యం రావాలి.


Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.