Advertisement

నాన్న మాటంటే మాటే!

Jan 24 2021 @ 00:56AM

తెలుగు చిత్రపరిశ్రమకు అందించిన తెలంగాణా ప్రాంతం అందించిన మంచి నటుడు డాక్టర్‌ ఎం. ప్రభాకరరెడ్డి. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తన  బహుముఖ ప్రజ్ఞను ఆయన చాటారు. ప్రభాకరరెడ్డి 25వ వర్ధంతి సంవత్సరంగా ఆయన రెండో కుమార్తె, సెన్సార్‌ బోర్డు మాజీ సభ్యురాలు  శైలజారెడ్డి చెప్పిన విశేషాలు


మీ చిన్నతనం గురించి చెప్పండి.. ఆ సమయంలో ప్రభాకరరెడ్డిగారు బాగా బిజీ కదా.. మీరు మిస్‌ అయ్యేవారా?

నాకు ఊహ తెలిసేనాటికే నాన్న బాగా బిజీగా ఉండేవారు. ఆయన చిత్రపరిశ్రమలోకి ప్రవేశించిన తొలి రోజుల గురించి నాకు తెలీదు కానీ నిర్మాతగా మారి తీసిన తొలి సినిమా ‘పచ్చని కాపురం’ నాటి రోజులు లీలగా గుర్తున్నాయి. అందులో శ్రీదేవి బాలనటిగా నటించింది. అప్పటి నుంచి నాకు సంఘటనలన్నీ గుర్తున్నాయి. మేము నలుగురు సోదరిమణులం. నాన్న షూటింగ్‌ నుంచి ఎంత లేట్‌గా వచ్చినా.. మా దగ్గరకు వచ్చేవారు. మేలుకొని ఉంటే మాతో కాసేపు గడిపేవారు. ఔట్‌డోర్‌ షూటింగ్‌కు వెళ్తే ప్రతి రోజూ ఫోన్‌ చేసేవారు. ఈ విషయంలో ఎంత పట్టింపుగా ఉండేవారంటే.. ఒక సారి రాజస్థాన్‌ వెళ్లారు. లొకేషన్‌లో ఫోన్‌ సదుపాయం లేకపోవటంతో ప్రతి రోజూ 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి అక్కడి నుంచి మాతో మాట్లాడేవారు. ఒక రోజు ఆయన దగ్గర నుంచి ఫోన్‌ రాలేదు. ఏమయిందా అని అందరం కంగారు పడ్డాం. మేము అనుకున్నట్లే ఆయన గుర్రం మీద నుంచి జారి పడడంతో కాలు విరిగింది. 


మీ అక్కచెల్లెళ్లలో ఎవరికీ సినిమాలంటే ఆసక్తి లేదా?

నాన్న మమల్ని సినిమాలకు దూరంగా పెంచారు. అప్పుడప్పుడు షూటింగ్‌లకు వెళ్లేవాళ్లం. మాకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు ఇచ్చి పెళ్లిచేయాలని ఆయనకు ఉండేది. హోదా ఉన్న ఉద్యోగులైతే పవర్‌ ఉంటుందని భావించేవారు. అయితే ఆ సమయంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు కూడా చాలా తక్కువ జీతాలొచ్చేవి. దీంతో మనసు మార్చుకొని.. మమల్ని బిజినెస్‌మెన్‌లకు ఇచ్చి పెళ్లి చేశారు. 


మీ అమ్మగారు- ఆ సమయంలో కాస్ట్యూమ్‌ డిజైనరట కదా..

ఇప్పుడు అలాగే పిలుస్తున్నారు కానీ అప్పుడు అలాంటి టైటిల్స్‌ ఏవీ లేవు. అమ్మ చిన్నప్పటి నుంచి బుక్స్‌ బాగా చదివేది. కన్నడ, తమిళ, మలయాళ, హిందీ, బెంగాలీ చిత్రాలన్నీ చూసేది. ఏ సినిమా ఎందుకు హిట్‌ అయిందో.. ఎందుకు ప్లాప్‌ అయిందో చెప్పేది. సమయం దొరికితే అమ్మ, నాన్న సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. మేము బీచ్‌లో ఆడుకుంటూ ఉంటే అమ్మ, నాన్న సినిమాల గురించి మాట్లాడుకోవడం నాకింకా జ్ఞాపకం. ఇక ‘పండంటి కాపురం’ సినిమాలో జమునగారు పోషించిన రాణీ మాలినీదేవి పాత్ర ఎలా ఉండాలనే విషయంలో అమ్మ, నాన్న మాట్లాడుకొని ఒక స్కీమ్‌ తయారుచేసుకున్నారు. ఆ సమయంలో బెనారస్‌ శాలువాల గురించి ఎక్కువ మందికి తెలియదు. ఈ శాలువాలను చీరలపై వేసుకుంటే బావుంటుందని సూచించింది అమ్మే! కేవలం శాలువాలు మాత్రమే కాదు.. చీరలు, ఇతర కాస్ట్యూమ్స్‌ అమ్మ ఎంపిక చేసినవే! కార్తీక దీపం సినిమాలో- శారద, శ్రీదేవి ధరించిన చీరలు.. ‘గృహప్రవేశం’ సినిమాలో జయసుధ చీరలు అమ్మ ఎంపిక చేసినవే! నాన్న 27 సినిమాలు తీస్తే వాటన్నింటికీ అమ్మ పనిచేశారు. 


ఎన్టీఆర్‌కు సన్నిహితంగా ఉన్న ప్రభాకరరెడ్డి ఆ తర్వాత ఎందుకు దూరమయ్యారు?

ఎన్టీఆర్‌ నాన్నను చాలా ప్రొత్సహించారు. ఆయన సినిమాల ప్రివ్యూ షోలకు పిలిచేవారు. అలాంటిది- కొన్ని కారణాల వల్ల వారిద్దరి మధ్య దూరం పెరిగింది. మండలాదీశుడు సినిమా తీయటంతో అది అగాధంగా మారింది. ఆ సినిమాను డైరక్ట్‌ చేసినందుకు- నాన్నగారిని చిత్ర పరిశ్రమ రెండేళ్లు అనధికారికంగా బ్యాన్‌ చేసింది. ఆ రెండేళ్ల పాటు ఆయనకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ఆయనతో పాటు ‘మండలాదీశుడు’ సినిమాలో నటించిన వారెవ్వరికి అలాంటి పరిస్థితి రాలేదు. ఆ సమయంలో కూడా నాన్నగారు ఎవరినీ పాత్రల కోసం అర్థించలేదు. కథలు రాసుకుంటూ గడిపారంతే!


నమ్మినవారు మోసం చేసిన సందర్భాలేమైనా ఉన్నాయా?

ఆ రోజుల్లో నాన్నగారికి చిత్ర పరిశ్రమలో మంచి గుడ్‌విల్‌ ఉండేది. ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా కూడా పనిచేశారు కాబట్టి అనేక మంది ఇంటికి వచ్చి సమస్యలు చెప్పుకుంటూ ఉండేవారు. ముఖ్యంగా హీరోయిన్లు వచ్చి- ఇతర నటుల వల్ల కలిగే సమస్యలు చెప్పుకొనేవారు. అలాంటి వేధింపులేవైనా ఉంటే నాన్న పరిష్కరించేవారు. అంతే కాదు.. ‘రెడ్డిగారు ఓ మాట చెబితే చాలు మేం ఫైనాన్స్‌ చేస్తాం’ అని ఫైనాన్షియర్లు చెప్పేవారు. దీనితో అనేక మంది నిర్మాతలు నాన్న దగ్గరకు వచ్చి సాయం అడిగేవారు. ఆయన మధ్యలో ఉండి ఎంతో మంది నిర్మాతలకు ఫైనాన్స్‌ ఇప్పించేవారు. కానీ ఆ తర్వాత వాళ్లు  ఆ డబ్బు తిరిగి కట్టలేకపోతే నాన్న కట్టిన సందర్భాలు ఎన్నో! ఒక పెద్ద సినిమాకు నాన్న ఫైనాన్స్‌ ఇప్పించారు. ఆ నిర్మాత డబ్బు కట్టలేకపోతే రెండు కోట్ల రూపాయలు ఖరీదు చేసే మా ఇల్లు అమ్మేసి ఆ అప్పు తీర్చారు. నా పెళ్లి అయిన కొత్తలో జరిగిన సంఘటన ఇది. ఆ రోజుల్లోనే రెండు కోట్ల ఖరీదైన ఇల్లు అంటే ఇప్పుడు ఎంత ఖరీదు  ఉంటుందో ఊహించుకోండి. మాట ఇచ్చాం కనుక దానికి కట్టుబడి ఉండాలనుకొనే మనస్తత్యం నాన్నది. ఎంత కష్టమైనా, నష్టమైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవారు.


నాన్నగారు చనిపోయే సమయానికి మీ కుటుంబ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంది?

అప్పటికే మా అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అందరికీ మంచి సంబంధాలు చూసి చేశారు. అందరినీ బాగా సెటిల్‌ చేసిన ఆయన- తన గురించి మాత్రం పట్టించుకోలేదు. హైదరాబాద్‌లో ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు. సినీ కార్మికుల కోసం ‘ట్విన్సీ క్లబ్‌’ ప్రారంభించారు. ఎంతో మంది సినీ కార్మికులకు అక్కడ భోజన సదుపాయం ఏర్పాటు చేశారు.


నాన్నగారికి నటుడిగా ఇండస్ట్రీ నుంచి రావాల్సినంత గుర్తింపు రాలేదనే అసంతృప్తి మీలో ఉందా?

నటుడిగా, దర్శకుడిగా నాన్నకు మంచి పేరు వచ్చింది. కానీ తగిన గౌరవ పురస్కారాలు దక్కలేదని వెలితి మాత్రం ఉంది. ఆయనకు పెద్ద పెద్ద అవార్డులు రాకపోవచ్చు కానీ అందరూ గౌరవించేవారు. వాస్తవానికి ఆయనే పదవులు వద్దనుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి మా మామగారికి సన్నిహితులు. మా ఇంటికి ఎక్కువగా వచ్చేవారు. ‘మీ నాన్న ఎప్పుడూ ఆ సినిమా వాళ్ల లాండ్‌ (చిత్రపురి కాలనీ) గురించే అడుగుతాడమ్మా..’’ అనేవారు. అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ కూడా కొన్ని పదవులు ఆఫర్‌ చేశారు. వాటిని తిరస్కరించారు. రాజ్యసభ సీటును కూడా వద్దనుకున్నారు. 


మీరు మూడు సార్లు సెన్సార్‌ బోర్డు సభ్యురాలిగా ఉన్నారు.. మీ అనుభవాలేమిటి?

చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. నాన్న తీసిన సినిమాలు విడుదలయినప్పుడు హైదరాబాద్‌కు వచ్చేదాన్ని. ప్రేక్షకులతో కలిసి సినిమా చూసి.. నాన్న దగ్గరకు వెళ్లి టాక్‌ చెప్పేదాన్ని. ఇప్పటికీ నాకు ఫస్ట్‌డే ఫస్ట్‌ షో చూసే అలవాటుంది. కొందరు నిర్మాతలు నా అభిప్రాయాన్ని ఇప్పటికీ అడుగుతూ ఉంటారు. ఇక సెన్సార్‌బోర్డు సభ్యురాలిగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పనిచేశా! 

నాన్నగారు మా ఫ్యామిలీ వద్దకు తీసుకువచ్చి పరిచయం చేసిన తొలి హీరోయిన్‌ జయప్రద. సాధారణంగా నాన్నగారు ఏ హీరోయిన్‌ను ఇంటికి తీసుకువచ్చి పరిచయం చేసేవారు కారు. జయప్రద మా ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. జయప్రద హీరోయిన్‌గా పరిచయమయిన సినిమా- ‘నాకూ స్వాత్రంత్యం వచ్చింది’. ఆమె అసలు పేరు లలితారాణి. తొలిసారి పరిచయమవుతున్న హీరోయిన్‌కు ఏ పేరు పెట్టాలా అని నాన్న ఆలోచించి.. పెద్దమ్మ పేరు పెట్టారు. ఎందుకంటే పెద్దమ్మ అంటే నాన్నకు చాలా గౌరవం. అలా లలితారాణి జయప్రద అయింది. ‘నాకూ స్వాతంత్య్రం వచ్చింది’ అనే సినిమా విడుదలకు ముందు  మా పెద్దమ్మ జయప్రదకు నవరత్నాలు పొదిగిన నెక్లెస్‌, ఇయర్‌ రింగ్స్‌ ప్రజెంట్‌ చేసింది.నాన్న స్వగ్రామం సూర్యాపేట దగ్గరున్న తుంగతుర్తి. అక్కడ మాకు 30 ఎకరాల భూమి ఉండేది. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు- సినీ కార్మికులకు రాకపోకలు కష్టమయ్యేవి. దీనితో కార్మికులకు హైదరాబాద్‌లోనే సొంత ఇళ్లు కట్టించాలంటూ నాన్న ప్రభుత్వానికి ఉత్తరం రాశారు. పది ఎకరాలు భూమి కేటాయించమన్నారు. కొంత సొమ్ము కడితే ప్రభుత్వం భూమి ఇస్తామంది. దీనితో నాన్న తనకున్న భూమినంతా అమ్మి ప్రభుత్వానికి సొమ్ము కట్టారు. కార్మికులందరికీ 20 ఎకరాలు చాలవు కాబట్టి.. మరో 57 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రభుత్వాలు మారినా ఆ స్థలాన్ని కేటాయించలేదు. ఆ తర్వాత ఈ భూమి వివాదం రకరకాల మలుపులు తిరిగింది. 


మేం మొత్తం నలుగురం అక్కాచెల్లెళ్లం. పెద్ద అక్క శ్రీశైలంలో ఉంటుంది. నేను, మిగిలిన ఇద్దరు చెల్లెళ్లు హైదరాబాద్‌లోనే ఉంటాం. మా అమ్మ సంయుక్త చెల్లెలు దగ్గర ఉంటుంది. మా చిన్నప్పుడు మద్రాసు టీ నగర్‌లో ఉండేవాళ్లం. నాన్న మమల్ని హోలీ ఏంజెల్స్‌ కాన్వెంట్‌లో చేర్పించారు. విజయశాంతి, రమ్యకృష్ణ, తులసి, రేవతి.. వీళ్లంతా మా స్కూల్లోనే చదివేవారు.  మాకు చిన్ననాటి స్నేహితురాళ్లు. 


కిడ్నాప్‌ల వ్యవహారం..

నాన్నను ఓ సారి కిడ్నాప్‌ చేసి మద్రాసులోని పామ్‌గ్రోవ్‌ హోటల్‌లో వారం రోజులు బంధించారు. ఆయన ఎక్కడ ఉన్నారో తెలియక చాలా కంగారు పడ్డాం. ఆ తర్వాత వదిలేశారు. హైదరాబాద్‌ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు నాలుగైదు జరిగాయి. ఆయనకు కిడ్నాప్‌ ఎందుకు చేశారో.. ఎవరు చేశారో ఇప్పుడు చెబితే పెద్ద వివాదమవుతుంది. తనను నమ్మినవారి కోసం.. సినీ కార్మికుల కోసం ఆయన రాజీ లేని పోరాటం చేశారు. ఈ సమయంలో ఇలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. 


- వినాయకరావు

ఫొటో: లవకుమార్‌


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.