ఆశలన్నీ అడుగంటిపోయాయి.. అంటూనే ప్రాణాలు విడిచిన నటుడు రాహుల్

May 9 2021 @ 15:58PM

న్యూఢిల్లీ: కుటుంబాలను కకావికలం చేసి బంధాలను ఛిన్నాభిన్నం చేస్తున్న కరోనా మహమ్మారి మరో ప్రముఖుడిని బలితీసుకుంది. ‘‘నాక్కూడా మంచి వైద్యం అందితే బతుకుతా’ అంటూ ఫేస్‌బుక్‌లో తన పరిస్థితిని వెల్లడించిన కాసేపటికే ఉత్తరాఖండ్‌కు చెందిన నటుడు రాహుల్ వోహ్రా కన్నుమూశాడు. ఆ మాట చెప్పడానికి అతడు ఎంత వేదన అనుభవించి ఉంటాడో తలచుకుని సోషల్ మీడియా కన్నీరు పెడుతోంది. ఇక తాను బతికే అవకాశాలు లేవని ఓ నిర్ణయానికి వచ్చేసిన రాహుల్.. ‘మళ్లీ పుడితే మంచి పనులు చేస్తా. ఇప్పటికైతే బతుకుతానన్న ఆశ లేదు’’ అంటూ అతడు పెట్టిన పోస్ట్ హృదయాలను మెలితిప్పుతోంది. రాహుల్ తుదిశ్వాస విడిచిన విషయాన్ని థియేటర్ డైరెక్టర్-ప్లేరైట్ అరవింద్ గౌర్ నేడు ఫేస్‌బుక్ పోస్టు ద్వారా వెల్లడించాడు.  

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై చిరపరిచితుడైన రాహుల్ కరోనా వైరస్ బారినపడిన తర్వాత చాలా సమస్యలు అతడిని చుట్టుముట్టాయి. ఆరోగ్యం రోజురోజుకు మరింతగా క్షీణిస్తుండడంతో జీవితంపై ఆశలు వదిలేసుకున్నాడు. తనకు సరైన వైద్యం అందడం లేదని ఊహించాడు. అందుకనే తనకు ఇంకాస్త మంచి వైద్యం అందితే బతుకుతానన్న ఆశను బయటపెట్టాడు. చివరికి బతుకుతానన్న ధైర్యాన్ని కోల్పోయాడు. ధైర్యం సన్నగిల్లుతోందంటూ నిన్న పోస్టు పెట్టాడు. చివరి నిమిషంలో మరో ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

‘‘రాహుల్ వెళ్లిపోయాడు. మంచి నైపుణ్యం ఉన్న నా నటుడు ఇక లేడు. మరింత మంచి వైద్యం అందితే బతుకుతానని నిన్ననే నాతో చెప్పాడు. సాయంత్రం ద్వారకాలోని ఆయుష్మాన్‌కు తరలించాం. కానీ అతడి ప్రాణాలను కాపాడలేకపోయాం. మమ్మల్ని క్షమించు. మేమందరం దోషులమే’’ అని అరవింద్ తన ఫేస్‌బుక్ పోస్టులో ఆవేదన వ్యక్తం చేశాడు. 


రాహుల్ గతవారం ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెడుతూ.. తన కోసం ఒక ఆక్సిజన్ బెడ్ కావాలంటూ సాయాన్ని అర్థించాడు. ‘‘నాకు కొవిడ్ సోకింది. ఆసుపత్రిలో చేరా. ఇప్పటికి దాదాపు నాలుగు రోజులు అయింది. ఏమాత్రం కోలుకోలేదు. ఈ ఆసుపత్రి దుస్థితి ఇలా ఉంది. ఎక్కడైనా ఆక్సిజన్ సౌకర్యం ఉన్న బెడ్ లభిస్తుందా? ఎందుకంటే రోజురోజుకు నా ఆక్సిజన్ స్థాయులు పడిపోతున్నాయి. నా గురించి పట్టించుకునేవారు కూడా లేరు. కుటుంబ సభ్యులు కూడా ఇంతకుమించి ఏమీ చేయలేకపోతున్నారు. పూర్తిగా నిస్సహాయతతోనే ఈ పోస్టు చేయాల్సి వచ్చింది’’ అని  రాహుల్ చేసిన పోస్టు  సోషల్ మీడియాతో కన్నీరు పెట్టించింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.