ఏపీ అనేది కులాల కుంపటి: నటుడు శివాజి

ABN , First Publish Date - 2021-11-18T21:12:53+05:30 IST

ఏపీ అనేది రాష్ట్రం కాదు.. కులాల కుంపటి అని నటుడు

ఏపీ అనేది కులాల కుంపటి: నటుడు శివాజి

ప్రకాశం: ఏపీ అనేది రాష్ట్రం కాదు.. కులాల కుంపటి అని నటుడు శివాజీ అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న మహాపాద యాత్రకు ప్రకాశం జిల్లాలో ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఎవరూ గుర్తించడంలేదన్నారు. మనమంతా బాగా పొల్యూట్‌ అయ్యామన్నారు. దీన్నుంచి బయటపడితేగాని భవిష్యత్‌ తరం బాగుపడదని ఆయన అభిప్రాయపడ్డారు.  "నేను.. నా కుటుంబం" అనుకునే ఈ సమాజంలో ఉన్న అందరి పాదాలకు దండాలన్నారు. ఒక సమాజం ఒక నిర్ణయం తీసుకుని ఒకరిని ఎన్నుకుని చట్ట సభలకు పంపితే విడగొట్టాలనుకునే వారు విడగొట్టారన్నారు. 


రాజధానిని అభివృద్ధి చేయాలనుకున్న వారు చేశారని, మరొకరు ఇంకొక మాట అంటున్నారన్నారు. కులాల కుంపట్ల మధ్య ఏపీ ఏమి అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రశ్నించారు. జనం సినిమాలో సీన్లను గుర్తు పెట్టుకున్నంతగా సమాజంలో ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకోవటం లేదన్నారు. మీడియా కూడా వర్గాలుగా విడిపోయిందన్నారు. దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ వల్ల  అంబానీ వంటి వారే దేశం విడిచి వెళ్లాలనుకుంటున్నారన్నారు. అమరావతిని ఏదో చేద్దామంటే సాధ్యం కాదన్నారు. ఆంద్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతి మాత్రమేనన్నారు.


బొత్స.. కొడాలి నాని.. వంటి మంత్రులు ఎన్ని మాటలైనా మాట్లాడుకోవచ్చన్నారు. రాజకీయ నేతలు తాము శాశ్వతం అనుకుంటే కుదరదన్నారు. ఎన్నికల్లో ఎంత డబ్బులు పంచినా ఓటరు మాత్రం ఆత్మసాక్షికే ఓటేస్తారన్నారు. ప్రజలకు ఎవరికి ఓటేయాలో అర్థమైందన్నారు. నేతల పాపం ఊరికే పోదు.. వెంటాడుతోందన్నారు. 



Updated Date - 2021-11-18T21:12:53+05:30 IST