ఆడలేక జగన్నాటకం!

ABN , First Publish Date - 2021-08-08T05:47:47+05:30 IST

ఎదురుదాడి ఆయుధంగా పనిచేస్తున్న జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తాజాగా కేంద్ర ప్రభుత్వంపై కూడా అదే ఎదురుదాడి మొదలెట్టింది. రాజ్యాంగ నిబంధనలను అతిక్రమించి అప్పులు చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని...

ఆడలేక జగన్నాటకం!

ఎదురుదాడి ఆయుధంగా పనిచేస్తున్న జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తాజాగా కేంద్ర  ప్రభుత్వంపై కూడా అదే ఎదురుదాడి మొదలెట్టింది. రాజ్యాంగ నిబంధనలను అతిక్రమించి అప్పులు చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కేంద్రప్రభుత్వం సంజాయిషీ కోరడం ఇందుకు కారణం. రుణ పరిమితులతో నిమిత్తం లేకుండా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటుచేసి భవిష్యత్‌ ఆదాయాన్ని కూడా తనఖా పెట్టి అప్పు చేయడం, సదరు అప్పులను నిర్దేశిత లక్ష్యంకోసం కాకుండా దారిమళ్లించడంపై పలు విమర్శలు రావడంతో కేంద్రప్రభుత్వం మేల్కొని వివరణ కోరిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం అప్పులు చేయడం లేదా? రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ప్రశ్నించడం ఏమిటి? అని నిలదీశారు. అంతటితో ఆగకుండా జగన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోసి, కాషాయం శాలువా కప్పుకొన్న వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికి భారతీయ జనతాపార్టీ ప్రయత్నిస్తోందని కూడా ఆయన ఆరోపించారు. ఇంతకాలంగా బీజేపీతో, ముఖ్యంగా కేంద్రంలోని ఆ పార్టీ పెద్దలతో అన్యోన్యంగా మెలుగుతూ వచ్చిన జగన్‌ అండ్‌ కోకు హఠాత్తుగా ఇంత కోపం ఎందుకు వచ్చింది? ఇదో సరికొత్త నాటకం కాదు కదా?! అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. శాసనసభలో తిరుగులేని మెజారిటీ ఉన్న జగన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడం అంటే ఆషామాషీ కాదు. అయినా పేర్ని నానితో ముఖ్యమంత్రి ఈ ఆరోపణ ఎందుకు చేయించారో తెలియదు! జగన్‌ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పతనావస్థకు చేరింది. ఈ నెలలో ఇంతవరకూ జీతాలు, పెన్షన్లూ పూర్తిస్థాయిలో చెల్లించలేదు. మరో 1800 కోట్లు సమకూరితే గానీ జీతాలు, పెన్షన్ల చెల్లింపు పూర్తి కాదు.


ఎడాపెడా అప్పులు చేస్తున్నప్పటికీ ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఎందుకొచ్చిందో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి. జీతాల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని నెలలుగా నిధుల కొరత ఎదుర్కొంటోంది. రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌ అప్పు 96వేల కోట్ల రూపాయలుగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి ఈ అప్పు 2లక్షల 30వేల కోట్లకు చేరుకుంది. ఇది కాకుండా మరో 20వేల కోట్ల రూపాయల వరకు వివిధ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న అప్పు 4 లక్షల కోట్లు. ఇది కాకుండా పెండింగ్‌లో ఉన్న బిల్లులు మరో లక్ష కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. అంటే, రెండేళ్లలో జగన్‌ ప్రభుత్వం చేసిన అప్పు లక్షా 70వేల కోట్లే కాకుండా పెండింగ్‌లో ఉన్న బిల్లుల విలువ 20 వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు చేరింది. అంటే దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల వరకు కొత్తగా అప్పు చేశారు. సగటున నెలకు పది వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారన్న మాట! ఈ రెండేళ్లలో పథకాల రూపంలో వివిధ వర్గాల ప్రజలకు 85వేల కోట్ల రూపాయలు చెల్లించామని ప్రభుత్వం చెబుతోంది. ఈ లెక్కన కొత్తగా చేసిన రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులో 85వేల కోట్లు పోనూ మిగిలిన లక్షా 65వేల కోట్లు ఏమయ్యాయి? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎందుకంటే ఈ రెండేళ్లలో అభివృద్ధి కార్యక్రమాలకు చేసిన ఖర్చు 30 వేల కోట్ల రూపాయలకు మించడం లేదు. స్థూలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇదీ! రాష్ట్ర ప్రభుత్వాలైనా, కేంద్రప్రభుత్వమైనా అప్పు చేయడానికి కొన్ని పరిమితులు ఉంటాయి.


రాష్ర్టాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా చూడడం కోసం రాజ్యాంగంలోనే కొన్ని నిబంధనలను పొందుపర్చారు. ఇప్పుడు జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఈ నిబంధనలను ఉల్లంఘించిందన్నది ప్రధాన ఆరోపణ. వచ్చే పదిహేనేళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని తనఖాగా పెట్టి 25వేల కోట్ల రూపాయలను రాష్ర్టాభివృద్ధి కార్పొరేషన్‌ పేరిట అప్పు చేయడం, ఈ మొత్తాన్ని నిర్దేశించిన లక్ష్యం కోసం కాకుండా ఇతరత్రా అవసరాలకు ఖర్చు చేయడంతో జగన్‌ ప్రభుత్వం వివాదంలో చిక్కుకుంది. అయిదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం లక్షా 30వేల కోట్ల రూపాయలు అప్పు చేసినందుకే అధికారంలోకి వచ్చిన కొత్తలో జగన్‌ అండ్‌ కో తీవ్రంగా ఆక్షేపించారు. ఇప్పుడు ఐదేళ్లు పూర్తయ్యేసరికి జగన్‌ ప్రభుత్వం చేసే అప్పు అయిదు లక్షల కోట్ల రూపాయలు దాటిపోతుందని ఆర్థికనిపుణుల అంచనా. 


నాడలా... నేడిలా!

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘చంద్రబాబు చేసిన అప్పులు ఎవరు తీరుస్తారు?’ అని నిలదీసిన ప్రస్తుత ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇప్పుడు ‘అప్పు చేయకపోతే ఎలా?’ అని ఎదురుదాడి చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పుతోందని ఆందోళన వ్యక్తంచేస్తూ వచ్చిన వారిపై నీలిమూకతో పాటు నీలిమీడియా విరుచుకుపడుతూ వచ్చింది. ఇప్పుడు కేంద్రప్రభుత్వం రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం అధికారులతో తనిఖీ చేయించాలని కేంద్రప్రభుత్వం తాజాగా నిర్ణయించిందని వార్తలు వచ్చాయి. ఈ చర్య వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఇవ్వడానికి ఇకపై బ్యాంకులు కూడా ముందుకు వచ్చే అవకాశం లేదు. ఈ పరిణామం జగన్‌ రెడ్డి ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించినట్టు ఉంది. అందుకే జగన్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర జరుగుతోందన్న ఆరోపణలకు తెరతీశారు.


రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడాన్ని నిలదీసే హక్కు కేంద్రానికి ఎక్కడిదని ప్రశ్నించే వరకూ వెళ్లారు. భవిష్యత్‌ ఆదాయాన్ని కుదువ పెట్టడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను కూడా తనఖా పెట్టి అప్పులు చేయడం ప్రస్తుత వివాదానికి కారణం. ఐదేళ్ల కాలపరిమితితో ఎన్నికైన ప్రభుత్వం భవిష్యత్‌ ఆదాయాన్ని కుదువపెట్టి అప్పుచేస్తే తదుపరి ప్రభుత్వాలు నడవడం కష్టమవుతుంది. అందుకే అలా కుదరదని రాజ్యాంగంలో నిబంధనలు పొందుపరిచారు. మితిమీరిన సంక్షేమంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుప్పకూలింది. అయినా మమ్మల్ని ప్రశ్నించడానికి కేంద్రానికి ఉన్న అధికారం ఏమిటి? అని జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. అధికారులు కూడా నిబంధనలను అతిక్రమించి దొడ్డిదారిన అప్పులు చేయడానికి ఉన్న మార్గాల అన్వేషణలో తలమునకలై ఉన్నారు. అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయ అధికారుల తనిఖీలో తప్పు జరిగిందని రుజువైతే అందుకు సంబంధిత అధికారులు మూల్యం చెల్లించవలసి వస్తుంది. వివిధ రాష్ర్టాలలో ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ప్రధాన వనరుగా ఉంటుంది. జగన్‌ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు కోసం ఈ ఆదాయాన్ని కూడా తనఖా పెట్టినందున వచ్చిన ఆదాయం వచ్చినట్టు బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లిపోతుంది. అలాంటప్పుడు జగన్‌ రెడ్డి ప్రభుత్వం మాత్రం మిగతా రెండు సంవత్సరాల తొమ్మిది నెలలు ఎలా నెట్టుకు రాగలదో? ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌ వంటి ఆదాయం తెచ్చి పెట్టే మహానగరం లేకుండా పోయిందని జగన్‌ రెడ్డి మద్దతుదారులు కొందరు వాపోతున్నారు.


రాజధాని అమరావతిని చేతులారా చంపేసుకుని ఇప్పుడు ఏడిస్తే ఏమి ప్రయోజనం? అభివృద్ధి, సంక్షేమాల మధ్య సమతుల్యం ఉండాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఏం జరగాలో ఇప్పుడు అదే జరిగింది. పెండింగ్‌ బిల్లులు చెల్లించడం కోసం హైకోర్టు జోక్యం చేసుకోవలసిన పరిస్థితి ఒకవైపున ఉండగా మరోవైపు జీతాలు సకాలంలో అందని కారణంగా ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు చెల్లించడమే ఘనకార్యంగా జగన్‌ ప్రభుత్వం ఫుల్‌పేజీ ప్రకటనలు ఇచ్చుకునే రోజు కూడా వస్తుందేమో! 


కూలదోయడమెందుకు...

ఆర్థిక వ్యవహారాలు ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి తెలియవు అనుకోవడానికి వీల్లేదు. ఎన్నో సూట్‌కేస్‌ కంపెనీలు ఏర్పాటుచేయించి వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకున్న చరిత్ర ఆయనది. జగన్‌ రెడ్డి వ్యాపారాలు లాభాలతో కళకళలాడుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రమే దివాలా దిశగా పరుగులు పెడుతోంది. ఈ పరిస్థితికి కారణాలు జగన్‌ రెడ్డితో పాటు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు అందరికీ తెలుసు. అయినా ఒక్కరు కూడా నోరు విప్పరు. మూలవిరాట్‌ అయిన జగన్‌ రెడ్డి ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం బటన్‌లు నొక్కిస్తూ పోతున్నారు. అందుకు అవసరమైన అప్పులు చేయడం అధికారుల బాధ్యతగా నిర్దేశించారు. అప్పుల తప్పులకు సంజాయిషీ ఇవ్వడమే తన ప్రధాన కర్తవ్యం అన్నట్టుగా రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఢిల్లీలో క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటుచేసుకోవలసి వచ్చింది! కేంద్ర ఆర్థికమంత్రిని ఎప్పటికప్పుడు కలుసుకుంటూ ఈ ఒక్కసారికీ తప్పు కాచి మమ్మల్ని ఒడ్డున పడేయండి అని వేడుకోవడమే ఆయనకు పనిగా మారింది. కేంద్ర ఆర్థికమంత్రి మాత్రం ఏం చేయగలరు? నిబంధనల ప్రకారమే కేంద్రప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వ అప్పుల బాగోతంపై అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం అధికారులతో తనిఖీకి ఆదేశించింది. ఈ తనిఖీలలో తప్పు జరిగినట్టు రుజువైతే జగన్‌ ప్రభుత్వానికి గడ్డు రోజులు తప్పవు. బటన్లు నొక్కడానికి ప్రభుత్వ ఖజానాలో డబ్బుండదు. అదే పరిస్థితి వస్తే జగన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరూ కుట్రలు చేసి కూలదోయాల్సిన అవసరం ఉండదు.


ఆర్థిక ఊబిలో కూరుకుపోయేకొద్దీ ప్రజల్లో వ్యతిరేకత పెరిగి ప్రభుత్వం పతనం అంచుకు చేరుతుంది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే విమర్శలకు కౌంటర్‌ ఇవ్వడంలో కొందరు మంత్రులు క్రియాశీలంగా ఉండటం లేదని మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఆగ్రహించినట్టు వార్తలు వచ్చాయి. మంత్రులు నిరాసక్తంగా మారడానికి కారణం లేకపోలేదు. అంతో ఇంతో రాజకీయ అనుభవం, సొంత వ్యక్తిత్వం ఉన్న మంత్రులు, శాసనసభ్యులకు ముఖ్యమంత్రి పోకడలు నచ్చడం లేదు. రాష్ర్టాభివృద్ధికి దోహదపడే చర్యలను తీసుకోకపోగా రాజకీయ కక్ష సాధింపులు, జనాకర్షక విధానాలపైనే మొత్తం దృష్టి కేంద్రీకరించడం అనర్థదాయకమని వారు వాపోతున్నారు. గతంలో పెదవి విప్పడానికి భయపడేవారు సైతం ఇప్పుడు అంతర్గత సంభాషణల్లో తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. జగన్‌ రెడ్డికి వ్యతిరేకంగా సమీకృతమయ్యే ఆలోచనలు చేయకపోయినా, ప్రజానాడిని గమనిస్తూ తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనతో చాలామంది ఉన్నారు. ప్రభుత్వంలో ముఖ్యులు అనుకునే మంత్రులు సైతం ఆత్మీయులు కలిస్తే తమ మనసులో ఉన్న ఆవేదన కక్కేస్తున్నారు. అయితే ప్రజాబలం జగన్‌కు ఉన్నంతవరకు ఆయనను ఎదిరించలేమన్న అభిప్రాయంతో వారు ఉన్నారు. అయినా తన ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్ర జరుగుతోందన్న సరికొత్త రాగాన్ని జగన్‌ అండ్‌ కో ఎందుకు ఆలపిస్తున్నారో తెలియాల్సి ఉంది.


రాష్ట్ర ఆర్థికపరిస్థితి అదుపు తప్పి సంక్షేమం పేరిట బటన్లు నొక్కి డబ్బు పంచే వెసులుబాటు పోతే ఏం జరుగుతుందో జగన్‌ రెడ్డికి తెలుసు. బహుశా అందుకే కాబోలు, నెపాన్ని కేంద్రంపై నెట్టడానికి ఇప్పటినుంచే స్కెచ్‌ వేస్తున్నట్టు ఉంది. నిధుల కొరతతో సంక్షేమ కార్యక్రమాల అమలు కుంటుపడితే కేంద్రంలోని బీజేపీ పెద్దలే అందుకు కారణమని ప్రజలను నమ్మించడానికి గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తున్నట్టుగా ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని వదిలేసి బీజేపీని లక్ష్యంగా జగన్‌ రెడ్డి ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఎవరికీ అయాచితంగా సహాయం చేయరు. ఇతరులంతా తమకు సహాయపడాలని మాత్రమే వారు కోరుకుంటారు. కేసుల బూచిని చూపించి జగన్‌ రెడ్డిని వాడుకుంటున్నారు. అలాగని ఆయనకు ప్రత్యేకంగా చేస్తున్న సహాయం కూడా ఏమీ లేదు. కొన్ని విషయాల్లో చూసీచూడనట్టు పోతున్నారు అంతే! కేసుల నుంచి బీజేపీ పెద్దలు తనను బయటపడేస్తారన్న నమ్మకం జగన్‌ రెడ్డిలో క్రమంగా క్షీణిస్తున్నదని చెబుతున్నారు. తనకు శిక్ష పడితే అధికారాన్ని భార్యకు అప్పగించాలని జగన్‌ రెడ్డి మానసికంగా ఎప్పుడో సిద్ధపడిపోయారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈలోపే ప్రజల్లో తన పలుకుబడి బలహీనపడకూడదని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే స్వయంకృతాపరాధం వల్ల ముంచుకొస్తున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రజల దృష్టిని మరలించడం కోసం తాజా ఎత్తుగడకు శ్రీకారం చుట్టి ఉంటారని భావించవచ్చు.


ఎందుకీ కక్ష?

ఈ విషయం అలా ఉంచితే రాష్ర్టాభివృద్ధికి దోహదపడే విషయాల్లో కూడా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి పెడసరంగా ఉంటున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినప్పటికీ చెప్పుకోదగ్గ ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ప్రతిపాదన దశలో ఉన్నవి కూడా ముఖం చాటేశాయి. పేదలకు నిర్మిస్తున్న ఇళ్లను మించిన అభివృద్ధి ఏముంటుందనీ, సంక్షేమాన్ని మించిన అభివృద్ధి ఏముంటుందనీ ఆత్మవంచన చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా రాజకీయ కక్షతో పాటు ఒక సామాజికవర్గంపై ఏర్పరచుకున్న ద్వేషంతో తెలుగు రాష్ర్టాలలోనే ప్రైవేటు రంగంలో అతిపెద్ద పరిశ్రమగా పేరొంది ఏటా 2,400 కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్న అమరరాజా బ్యాటరీస్‌ ఫ్యాక్టరీని తరిమేయడానికి కాలుష్యమనే భూతాన్ని తెర మీదకు తెచ్చారు. ఎన్టీఆర్‌ చొరవతో అమెరికాలో ఉంటున్న గల్లా రామచంద్రనాయుడు తన సొంత జిల్లాపై మమకారంతో తిరుపతికి సమీపంలో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటుచేశారు.


ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యాపారాలు ఉన్న పలువురు తమ రిజిస్టర్డ్‌ కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నప్పటికీ రామచంద్రనాయుడు మాత్రం పుట్టిన గడ్డ మీద మమకారంతో చిత్తూరులోనే తన రిజిస్టర్డ్‌ కార్యాలయాన్ని పెట్టుకున్నారు. దీనివల్ల కంపెనీ చెల్లించే పన్నుల్లో సంబంధిత రాష్ర్టానికి వాటా లభిస్తుంది. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కుటుంబానికి చెందిన భారతి సిమెంట్‌ వగైరా కంపెనీల రిజిస్టర్డ్‌ కార్యాలయాలు ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. రాజకీయాలను మతంతో ముడిపెట్టకూడదు అని అంటారు. జగన్‌ రెడ్డి మాత్రం రాజకీయాలకు, వ్యాపారాలకు కూడా లంకె పెట్టారు. ఈ కారణంగానే తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్‌పై కక్షతో అమరరాజా సంస్థను వేధించి వేధించి తరలిపోయేలా చేస్తున్నారు. దీంతో రాజకీయాల్లో.. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో ఉండేవారు సొంత రాష్ర్టాల్లో వ్యాపారాలు చేయకూడదు. పరిశ్రమలు నెలకొల్పకూడదు. జాతీయ పార్టీల్లో ఉండేవారు, దేశంలోనే వ్యాపారాలు చేయకూడదని భావించాల్సిన పరిస్థితి వచ్చింది.


అమరరాజా బ్యాటరీస్‌ తరలిపోతే రాష్ర్టానికి కలిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుందని ఆలోచించకుండా జగన్‌ చర్యలను కొన్ని అద్దెమైకులు, కిరాయిగొంతుకలు అడ్డగోలుగా సమర్థిస్తున్నాయి. ప్రభుత్వాన్ని తప్పుబట్టడానికి ప్రయత్నించే వారిపై కులపరంగా విమర్శలు చేసే నీచసంస్కృతికి తెరతీశారు. అమరరాజా బ్యాటరీస్‌లో పనిచేస్తున్న వేల మంది కార్మికులలో బీసీలే అత్యధికంగా ఉన్నారు. ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా ఆ సంస్థ కాలుష్యాన్ని వెదజల్లుతోందా? అందువల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందా? కంపెనీల నుంచి వెలువడే సీసం వల్ల తమ ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని, నీరు కలుషితం అయిందని 35 ఏళ్లలో ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. చికిత్స కోసం ఒక్కరు కూడా ఆస్పత్రిలో చేరిందీ లేదు. పశువులు చనిపోయాయని వైసీపీ కార్యకర్త చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని తేలింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి కూడా నిన్నమొన్నటి వరకు అంతా బాగానే కనిపించింది. జగన్‌ రెడ్డి మనసెరిగిన అధికారులకు ఇప్పుడు అక్కడ కాలుష్యకాసారం కనిపిస్తోంది. వివిధ రాష్ర్టాలకు చెందిన కాలుష్య నియంత్రణ అధికారులు సైతం ఆక్షేపించడానికి ఏమీ లేదని చెబుతున్నప్పటికీ జగన్‌ రెడ్డి ప్రభుత్వం మాత్రం తృప్తి చెందడం లేదు. తాము అమలుచేస్తున్న ప్రమాణాలు సరిపోవని ప్రభుత్వం చెబుతున్నదే నిజమైతే ప్రపంచంలో ఏ ఒక్క బ్యాటరీ పరిశ్రమ కూడా మనుగడ కొనసాగించలేదని అమర‌రాజా యాజమాన్యం చెబుతోంది. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి గానీ, ఎమ్మెల్యేలు గానీ ఈ సంస్థపై ఇప్పటివరకూ ఫిర్యాదు చేయలేదు. అయినా పై స్థాయి నుంచి వస్తున్న ఒత్తిళ్లతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రాష్ర్టానికి చేటుచేస్తున్నారు. సంస్థను ప్రారంభించిన కొత్తలో బ్యాటరీల రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన జాన్సన్‌ కంట్రోల్స్‌ అనే సంస్థ సాంకేతిక సహకారం అందించింది. అదే జాన్సన్‌ కంపెనీ చైర్మన్‌ ఇటీవల అమరరాజా బ్యాటరీస్‌ను సందర్శించి అక్కడ ఏర్పాటుచేసిన సాంకేతిక నైపుణ్యాన్ని ప్రశంసించడమే కాకుండా ‘ఒకప్పుడు మేం సహకారం అందించాం, ఇప్పుడు అమరరాజా నుంచే మేం నైపుణ్యాన్ని స్వీకరించాల్సి ఉంది’ అని కూడా వ్యాఖ్యానించారు.


అమరరాజా ఫ్యాక్టరీ విస్తరణకు దివంగత రాజశేఖర్‌ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూమి కేటాయించి సహకరించారు. ఇప్పుడు ఇంత కాలానికి ఆయన కుమారుడైన జగన్‌ రెడ్డికి అక్కడ అంతులేని కాలుష్యం కనిపిస్తోంది. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులకు, సంస్థ ఉద్యోగులకు అంతా సవ్యంగానే కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి మాత్రమే మరో రకంగా కనిపించడం జగన్‌ రెడ్డి వికృత మనస్తత్వానికి నిదర్శనం. రాష్ర్టాల ఆర్థిక అభివృద్ధికి దోహదపడే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించకపోగా వేధించడం ఏమిటి? జగన్‌ రెడ్డిపై గుడ్డి అభిమానంతో కులకోణం చూస్తున్న వారికి ఒక సలహా. తెలుగువాడైన జి.వి. కృష్ణారెడ్డి పోటీ బిడ్డింగ్‌లో సాధించుకుని నిర్మించిన ముంబై విమానాశ్రయాన్ని అదానీ గ్రూపు సొంతం చేసుకోవడానికి ప్రభుత్వ ఏజెన్సీలను ప్రయోగించడాన్ని ‘ఆంధ్రజ్యోతి’ మాత్రమే విమర్శించింది. అమరరాజా విషయంలో జగన్‌ రెడ్డి వైఖరిని సమర్థించే వారికి రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి, తెలుగు ఖ్యాతి గురించి పట్టదని భావించాల్సి ఉంటుంది. జగన్‌ రెడ్డిపై ఈగ వాలకుండా చూడడం కోసం వారికి చెల్లింపులు జరుగుతుండవచ్చు. అంతమాత్రాన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏమి కావాలి? అమరరాజా సంస్థ తరలిపోతే ‘ఆంధ్రజ్యోతి’ సంస్థకు వచ్చే నష్టం ఏమీ లేదు. నష్టం జరిగేది అమరరాజాలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకే. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదాయాన్ని కోల్పోతుంది. రాష్ట్ర ప్రతిష్ఠ మసకబారుతుంది. మాకు ఆదాయం పెరగకపోయినా పర్వాలేదు, అప్పులు పుడితే చాలు అని భావించే వారి పాలనలో ఏ రాష్ట్రం అయినా ఎలా బాగుపడుతుంది? కొందరికి విషయం తెలియదు. తెలిసినా కొందరు నోరు విప్పరు. మరికొందరు పైశాచికంగా మారిపోయారు. ఒక సామాజికవర్గంపై ద్వేషంతో రాష్ర్టానికే ద్రోహం చేస్తున్న వారిని ఏమనాలి? ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది నాయకులు ఇటీవల హైదరాబాద్‌లో నన్ను కలిశారు. ఈ సందర్భంగా వారిలో కొందరు మాట్లాడుతూ, ‘మేం ఆంధ్రప్రదేశ్‌ వాళ్లం అని తెలిసి హైదరాబాద్‌కు చెందిన వాళ్లు జాలిగా చూస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. నిన్నగాక మొన్న తెలంగాణ మంత్రి హరీశ్‌రావు కూడా ఆంధ్రాలో జరుగుతున్న పరిణామాల వల్లే హైదరాబాద్‌ మరింతగా దూసుకుపోతోందని ఎగతాళి చేశారు. ఇది జగన్‌ రెడ్డి పాలనకు కితాబని భావించే నీలిమూక, నీలిమీడియా ఉన్నంతవరకు రాష్ర్టానికి మోక్షం ఉండదు. అమరరాజా సంస్థ ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదని కాలుష్య నియంత్రణ మండలి అధికారి వ్యాఖ్యానించడం రాష్ట్రంలో పరిస్థితి ఎంతలా దారితప్పిందో చెబుతోంది.


ఆ అధికారి ఐఏఎస్‌కు ఎలా ఎంపికయ్యారో దేవుడికే తెలియాలి. ఇలాంటి మనోవికారాలు అధికారుల్లో వ్యాపించడం, ఒక రాజకీయపార్టీకి భక్తులుగా మారిపోవడం అత్యంత విషాదం. వాళ్లూ వీళ్లూ అని కాదు, కొందరు అధికారులు, మరికొందరు జర్నలిస్టులు, ఇతర వర్గాలలోని మరికొంతమంది జగన్‌ రెడ్డికి మూఢభక్తులుగా మారిపోయి సామూహిక హిస్టీరియా వచ్చిన వారిలా ప్రవర్తిస్తున్నారు. పరిశ్రమలను కూడా రాజకీయకోణంలో చూస్తూ వేధింపులకు పాల్పడే సంస్కృతిని ప్రోత్సహించడం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా? భవిష్యత్తులో అధికార మార్పిడి జరిగితే జగన్‌ రెడ్డికి చెందిన భారతి సిమెంట్‌ పరిస్థితి ఏమిటి? కాలుష్యం పేరిట ఈ సంస్థను మూసివేయించవచ్చు కదా? అమరరాజాను తామే పొమ్మంటున్నామని గొప్పగా చెప్పుకోవడం కాదు, ఈ రెండేళ్లలో కొత్తగా ఏ పరిశ్రమ తెచ్చారో చెబితే చప్పట్లు కొడదాం! ఒకవైపు ఆర్థిక అరాచకం, మరోవైపు పాలకుల ఆలోచనలు కూడా అరాచకంగా ఉండటంవల్ల రాష్ర్టానికి తీరని నష్టం జరగబోతోంది. ఇప్పుడు పిచ్చికూతలు కూస్తూ, పిచ్చిరాతలు రాసేవారు అప్పుడు ఎంత వగచినా ప్రయోజనం ఉండదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ను చూస్తుంటే ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు సృష్టించిన విధ్వంసం గుర్తుకొస్తోంది. ఘనచరిత్ర కలిగిన ఆఫ్ఘనిస్థాన్‌లో చారిత్రక వైభవానికి చిహ్నాలుగా ఉన్న కళాఖండాలను, నిర్మాణాలను ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందేవారు. భయంతో కొంతమంది, ఉన్మాదంతో మరి కొంతమంది తాలిబన్లకు జై కొట్టారు. ఇప్పుడు అదొక శిథిల రాజ్యం. ఆంధ్రప్రదేశ్‌ కూడా అలాగే మిగలాలనుకుంటే మీ ఇష్టం!


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2021-08-08T05:47:47+05:30 IST