రూపాయికి రూ.800

ABN , First Publish Date - 2020-09-29T06:52:57+05:30 IST

రెండున్నర దశాబ్దాల క్రితం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఐపీఓలో పెట్టుబడిగా పెట్టిన ప్రతి రూపాయి.. 800 రెట్లకు పైగా ప్రతిఫలాన్ని పంచిందని ఆ కంపెనీ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ అన్నారు...

రూపాయికి రూ.800

  • గడిచిన రెండున్నర దశాబ్దాల్లో 
  • అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ పంచిన ప్రతిఫలం
  • జేపీ మోర్గాన్‌ సదస్సులో గౌతమ్‌ అదానీ 

న్యూఢిల్లీ: రెండున్నర దశాబ్దాల క్రితం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఐపీఓలో పెట్టుబడిగా పెట్టిన ప్రతి రూపాయి.. 800 రెట్లకు పైగా ప్రతిఫలాన్ని పంచిందని ఆ కంపెనీ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ అన్నారు. ఈ మౌలిక రంగ దిగ్గజమిప్పుడు పలు వ్యాపార వేదికలను అనుసంధానించే వేదికగా ఎదిగిందన్నారు. సోమవారం జరిగిన జేపీ మోర్గాన్‌ ఇండియా సదస్సులో ఆయన ప్రసంగించారు. అదానీ గ్రూప్‌నకు చెందిన ఆరు కంపెనీలు స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యాయని, వేలాది ఉద్యోగాలు కల్పించామని, షేర్‌హోల్డర్ల విలువను అసాధారణ స్థాయికి పెంచామని అయన అన్నారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 1994లో తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు వచ్చింది. 58 ఏళ్ల గౌతమ్‌ అదానీ.. కాలేజీ విద్యాభ్యాసాన్ని మధ్యలోనే వదిలేసి తొలుత కమోడిటీ ట్రేడింగ్‌తో తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత కాలంలో అదానీ గ్రూప్‌ ఏర్పాటుతో పలు వ్యాపారాల్లోకి ప్రవేశించారు. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ఇంధన రంగ వ్యాపారాల్లో ఉన్న అదానీ గ్రూప్‌ ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద నౌకాశ్రయ నిర్వహణదారు. అంతేకాదు, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్‌గానూ ఎదిగింది. ఇంధనం, మైనింగ్‌, గ్యాస్‌, పునరుత్పాదక ఇంధన శక్తి, రక్షణ, వ్యవసాయ కమోడిటీ వ్యాపారాలనూ నిర్వహిస్తోంది. 


2050 కల్లా భారత్‌ @ నంబర్‌ 2

భారత ఆర్థిక మూలాలు ఇప్పటికీ పటిష్ఠంగా ఉన్నాయని, 2050 నాటికి భారత్‌ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని గౌతమ్‌ అదానీ ధీమా వ్యక్తం చేశారు. వ్యాపారావకాశాల విషయంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌ మెరుగ్గా ఉందన్నారు. ‘‘1990లో  ప్రపంచ జీడీపీ 38 లక్షల కోట్ల డాలర్లు. 30 ఏళ్ల తర్వాత ప్రస్తుతం 90 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. వచ్చే 30 ఏళ్లలో 170 లక్షల కోట్ల డాలర్లకు పెరగనుంది. ఆ సమయానికి భారత్‌ రెండో అతిపెద్ద ఎకానమీగా ఎదగనుంద’’ని అదానీ పేర్కొన్నారు.


Updated Date - 2020-09-29T06:52:57+05:30 IST