కలిసొచ్చిన DB పవర్ డీల్‌.. 4% లాభపడిన అదానీ పవర్..

ABN , First Publish Date - 2022-08-22T16:01:30+05:30 IST

DB పవర్ థర్మల్ పవర్ ఆస్తులను కొనుగోలు చేయడానికి అదానీ పవర్ అంగీకారం తెలిపింది.

కలిసొచ్చిన DB పవర్ డీల్‌.. 4% లాభపడిన అదానీ పవర్..

Adani Power Shares : DB పవర్(DB Power) థర్మల్ పవర్ ఆస్తులను కొనుగోలు చేయడానికి అదానీ పవర్(Adani Power) అంగీకారం తెలిపింది. దీంతో బలహీనమైన మార్కెట్‌లో సోమవారం ఇంట్రా-డేలో అదానీ పవర్ షేర్లు బీఎస్ఈ(BSE)లో 4 శాతం పెరిగి రూ.428.20కి చేరాయి. ఉదయం 09:32 గంటలకు అదానీ పవర్ 3 శాతం పెరిగి రూ.423.50 వద్ద ట్రేడవుతోంది. ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్‌(S&P BSE Sensex)లో 0.7 శాతం క్షీణించింది. 


దైనిక్‌ భాస్కర్‌ గ్రూప్‌నకు చెందిన డీబీ పవర్‌ను రూ.7,017 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు భారత కుబేరుడు గౌతమ్‌ అదానీ(Gowtham Adani)కి చెందిన అదానీ పవర్‌ శుక్రవారం ప్రకటించింది. ఈ డీల్‌ పూర్తిగా నగదు రూపంలో జరగనుంది. డీబీ పవర్‌కు చత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్‌ చంపా జిల్లా(Champa Dist) 600 మెగావాట్ల చొప్పున ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన రెండు థర్మల్‌ విద్యుత్‌ యూనిట్లున్నాయి. ఈ ప్లాంట్లు 923.5 మెగావాట్ల విద్యుత్‌ సరఫరాకు దీర్ఘకాలిక, మధ్యకాలిక పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్ల (PPA)తోపాటు కోల్‌ ఇండియా(Coal India) నుంచి బొగ్గు సరఫరా కాంట్రాక్టును కలిగి ఉన్నాయి.


ఈ ఏడాది అక్టోబరు 31కల్లా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లు, అవసరమైతే గడువును ఇరువర్గాల సమ్మతం ద్వారా పొడిగించుకోనున్నట్లు అదానీ పవర్‌ వెల్లడించింది. చత్తీస్‌గఢ్‌లో అదానీ పవర్‌ కార్యకలాపాల విస్తరణ, ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు ఈ డీల్‌ దోహదపడనుంది. 2006 అక్టోబరులో ఏర్పాటైన డీబీ పవర్‌.. గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) రూ.3,488 కోట్ల టర్నోవర్‌ సాధించింది. 2020-21లో టర్నోవర్‌ రూ.2,930 కోట్లు, 2019-20లో రూ.3,126 కోట్లుగా నమోదైంది. డీబీ పవర్‌ ప్రస్తుత రుణ భారం రూ.5,500 కోట్ల స్థాయిలో ఉంది.


Updated Date - 2022-08-22T16:01:30+05:30 IST