కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2020-07-05T12:05:21+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. తాజాగా శనివారం ఒక్కరోజే 23 కేసులు

కరోనా విజృంభణ

అమాంతం పెరుగుతున్న కేసులు

తాజాగా 23 మందిలో వైరస్‌ నిర్ధారణ

మొత్తం కేసులు 349కి చేరిక

వేపాడ మండలంలో మొదటి కేసు

కొవిడ్‌ ఆస్పత్రి నుంచి 23 మంది డిశ్చార్జ్‌


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)/ రింగురోడ్డు, జూలై 4: జిల్లాలో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. తాజాగా శనివారం ఒక్కరోజే 23 కేసులు నమోదయ్యాయి. వీటిలో విజయనగరం నుంచే 10 వచ్చాయి. పట్టణంలో వేగంగా కొవిడ్‌ వైరస్‌ విస్తరిస్తున్నది. రోజురోజుకూ కంటైన్మెంట్‌ జోన్లు కూడా పెరుగుతున్నాయి. జిల్లా వాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం బాధితుల సంఖ్య 349కి చేరింది. తాజా కేసుల్లో 10 విజయనగరం పట్టణంలోనివి కాగా జియ్యమ్మవలస మండలంలో మూడు, నెల్లిమర్ల, సాలూరుల్లో మూడు చొప్పున కేసులు నమోదయ్యాయి. గుర్ల, డెంకాడ, మక్కువ, పార్వతీపురంలో రెండు చొప్పున వచ్చాయి. బొబ్బిలి మండలంలో ఒక కేసు నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 54 కంటైన్మెంట్‌ జోన్లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు కొవిడ్‌ ఆస్పతి నుంచి డిశ్చార్జ్‌ అయినవారు 127 మంది  ఉండగా ప్రస్తుతం 220 మంది చికిత్స పొందుతున్నారు.


జిల్లాలో రెండు మరణాలు సంభవించాయి. పెరుగుతున్న కేసులు జిల్లా ప్రజలను కలవర పెడుతున్నాయి. లాక్‌డౌన్‌ మినహాయింపుల తర్వాత భౌతిక దూరాన్ని పెద్దగా పాటించడం లేదు. మార్కెట్‌లకు తండోపతండాలుగా జనం వస్తున్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో కూడా గతంలో ఉన్నంత పటిష్టంగా చర్యలు లేవు. ఇదిలా ఉండగా జిల్లాలో కొవిడ్‌ వైరస్‌ నిర్ధారణ పరీక్షల రిపోర్టులు ఆలస్యంగా వస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ట్రూనాట్‌ టెస్టులు నిర్వహించే కేంద్రాలను పెంచింది. పార్వతీపురంలోని ఏరియా ఆసుపత్రి, ఎస్‌.కోట సీహెచ్‌సీ, సాలూరు సీహెచ్‌సీ, విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రి, వీఆర్‌డీఎల్‌లో ట్రూనాట్‌ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాలకు నెల్లిమర్ల కొవిడ్‌ ఆసుపత్రి దూరంగా ఉండడంతో పార్వతీపురం డివిజన్‌లో మరో కొవిడ్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు. గరుగుబిల్లి మండలం పార్వతీపరం సమీపంలోని ఉద్యాన కళాశాలను కొవిడ్‌ ఆసుపత్రిగా ప్రకటించి ఏర్పాట్లు చేస్తున్నారు. 


శృంగవరపుకోట రూరల్‌ : మండలంలోని ఓ గ్రామంలో టిఫిన్‌సెంటర్‌ నిర్వాహకుడికి కరోనా ప్రబలింది. దీంతో అక్కడకు వెళ్లిన వారంతా కలవర పడుతున్నారు. విషయం తెలిసిన వెంటనే వ్యాపారులు దుకానాలను స్వచ్ఛందంగా మూసేశారు. కాగా పాజిటివ్‌ వచ్చినట్లు ఉదయం తెలిసినా సాయంత్రం వరకు అతన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లలేదు. 


కొత్తవలస : మండలంలోని ఓ గ్రామ పోస్టుమాస్టర్‌కు కరోనా ప్రబలింది. ఆయన సొంతూరు జామి మండలం. మూడు రోజులుగా ఆయన ఉపాధి వేతనదారులకు కూలి డబ్బులు ఇచ్చారు. దీంతో ఎక్కువ మందికి వైరస్‌ సోకుతుందేమోనన్న టెన్షన్‌ స్థానికంగా నెలకొంది. 


సీతానగరం : మండలంలో ఓ గ్రామానికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారి నీలిమ  తెలిపారు. ఆమె గత నెల 29న హైదరాబాద్‌ నుంచి స్వగ్రామం వచ్చినట్లు ధ్రువీకరించారు.


 కరోనా కలకలం ?

మండలంలో మొదటి కరోనా కేసు నమోదైంది. ఓ గ్రామానికి చెందిన యువకుడిలో వైరస్‌ నిర్ధారణ అయింది. ఈయన విశాఖలోని ఓ క్యాంటీన్‌లో పని చేస్తుండగా అనారోగ్యానికి గురై ఎస్‌.కోట ఆస్పత్రిలో కరోనా టెస్టులు చేయించుకున్నాడు. ఆ తర్వాత కూడా చాలా మందితో మాట్లాడాడు. దీంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. మండలంలో కూడా మొదటి కేసు కావడంతో అందరిలో టెన్షన్‌ మొదలైంది. 


మిమ్స్‌ నుంచి 23 మంది డిశ్చార్జ్‌

జిల్లా కొవిడ్‌ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ కోలుకుని 23 మంది బాధితులు శనివారం డిశ్చార్జ్‌ అయ్యారు. వీరికి మిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘురామ్‌, కొవిడ్‌ ప్రత్యేక అధికారి డాక్టర్‌సుబ్రహ్మణ్య హరికిషన్‌ వీడ్కోలు పలికారు. పండ్లుతో పాటు ప్రభుత్వం మంజూరు చేసిన సాయం ఒక్కొక్కరికీ రూ.2000 అందజేశారు. 

Updated Date - 2020-07-05T12:05:21+05:30 IST