అధికార అరాచకం!

ABN , First Publish Date - 2021-01-31T06:25:55+05:30 IST

‘‘ఆంధ్రప్రదేశ్‌లో గత 20 నెలలుగా రాజ్యాంగం దిశా నిర్దేశం చేసిన అన్ని సూత్రాలకు అనుగుణంగానే పరిపాలన సాగుతున్నది!’’... గణతంత్ర దినోత్సవం సందర్భంగా...

అధికార అరాచకం!

‘‘ఆంధ్రప్రదేశ్‌లో గత 20 నెలలుగా రాజ్యాంగం దిశా నిర్దేశం చేసిన అన్ని సూత్రాలకు అనుగుణంగానే పరిపాలన సాగుతున్నది!’’... గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అన్న మాటలు ఇవి. ‘‘రాష్ట్ర పరిస్థితులు మాకు (కోర్టులు) తెలుసు. న్యాయదేవత కళ్లకు గంతలు కట్టి ఉంటాయి కాబట్టి... న్యాయమూర్తులకు, న్యాయస్థానాలకు కళ్లు కనిపించవని అనుకోవద్దు!’’... తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్య ఇది. ఈ రెండింటిలో ఎవరు చెప్పింది నిజం అనుకోవాలి? హైకోర్టు అభిప్రాయాన్ని తప్పుబట్టలేం. అలాగని మాన్య ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తప్పు మాట్లాడతారని ఎలా అనుకుంటాం! అదేంటోగానీ ఆంధ్రప్రదేశ్‌లో ఒక వర్గం ప్రజలకు జగన్‌ ఏమి చేసినా ముచ్చటగానే ఉంటోంది. మరోవైపు న్యాయస్థానాలు మాత్రం తప్పుబడుతూనే ఉంటున్నాయి. న్యాయమూర్తులపై ఫిర్యాదు చేసినా, బదిలీ చేయించినా న్యాయం మారిపోదు కదా! పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్‌కు, ప్రభుత్వానికీ మధ్య సాగిన పోరాటం దేనికి సంకేతం? చివరకు సుప్రీంకోర్టు కల్పించుకుని విస్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో వివాదం ముగిసి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అయినా సుప్రీంకోర్టు తీర్పు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఉందని జగన్‌ మద్దతుదారులు నస పెడుతూనే ఉన్నారు.


న్యాయస్థానాలు చట్టాలు, రాజ్యాంగానికి లోబడి మాత్రమే తీర్పులు ఇస్తాయనీ, ‘ప్రజాభిప్రాయం’తో వాటికి సంబంధం లేదన్న చిన్న లాజిక్‌ను జగన్‌ మద్దతుదారులు ఎందుకోగానీ మిస్‌ అవుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు తమకు అర్థం అవుతూనే ఉన్నాయని సుప్రీంకోర్టు సైతం తాజాగా వ్యాఖ్యానించడంతో జగన్‌ రెడ్డి గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్న మాటలు నిజం కావని భావించవలసి ఉంటుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ వాస్తవానికి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ముందుకు విచారణకు రావాలి. అయితే ఆయన తమకు ఇష్టం లేని ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినందున, రాష్ట్ర ప్రభుత్వం ‘నాట్‌ బిఫోర్‌’ సౌలభ్యాన్ని ఉపయోగించుకుంది. అయినా ఈ పిటిషన్‌ను విచారించిన మరో బెంచ్‌ ప్రభుత్వంతో పాటు పిటిషన్లు వేసిన ఉద్యోగ సంఘాలకు కూడా తలంటు పోసింది. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల విషయంలో ఎందుకింత రాద్ధాంతం జరుగుతున్నదో? అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. మార్చి 31వ తేదీన తాను పదవీ విరమణ చేయవలసి ఉన్నందున, ఆ లోపుగా కనీసం పంచాయతీ ఎన్నికలనైనా జరపాలన్న పట్టుదలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వచ్చారు. ఆయన హయాంలో ఏ ఎన్నికలూ జరగకూడదని రాష్ట్ర ప్రభుత్వం అంతే పంతానికి పోయింది. దీంతో వివాదం హైకోర్టుకు చేరడం, ఎన్నికల నిర్వహణకు హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఎన్నికల కమిషనర్‌ జారీ చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు సాఫీగా జరగడానికి సహకరించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం భీష్మించుకుని కూర్చుంది. తనకు మద్దతుగా ఉద్యోగ సంఘాల నాయకులను ఉసిగొల్పింది. అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్‌లు సైతం నిబంధనలు, చట్టాలు తెలిసీ ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలను ధిక్కరించారు. దీంతో రాజ్యాంగ వ్యవస్థలైన హైకోర్టు, ఎన్నికల కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించినట్లు అయింది. కరోనా వ్యాక్సిన్‌ తమకు ఇచ్చిన తర్వాత మాత్రమే ఎన్నికలకు సహకరిస్తామనీ, కాదూకూడదు అంటే సమ్మె చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు రెచ్చిపోయారు. ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ను తిట్టిపోశారు. ఒకవైపు ఉద్యోగులు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ ధోరణి అవలంబించడంతో తొలుత జారీ చేసిన షెడ్యూలును ఎన్నికల కమిషన్‌ సవరించుకోవలసి వచ్చింది. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు రావడం, సుప్రీంకోర్టు సైతం ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వానికి దిగిరాక తప్పలేదు. తమ అభిమతానికి విరుద్ధంగా ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టును తిడితే పరిణామాలు వేరేగా ఉంటాయి కనుక ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ను ఏ స్థాయిలో తిట్టాలో ఆ స్థాయిలో తిడుతున్నారు. రెండు వ్యవస్థల మధ్య మొదలైన పంతాలు, పట్టింపుల సందర్భంగా ఐఏఎస్‌ అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు వ్యవహరించిన తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉంది. చట్టాలు, రాజ్యాంగం నిర్దేశించిన మౌలికసూత్రాలకు విరుద్ధంగా రాష్ట్రంలో అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు వ్యవహరించారు. ఈ కారణంగానే సుప్రీంకోర్టు ఎవరెవరికి చివాట్లు పెట్టాలో వారందరికీ చివాట్లు పెట్టింది. ఎన్నికల కమిషన్‌పై నిందలు వేయడం ఏమిటని కూడా కన్నెర్రజేసింది. దీంతో అధికారులు, ఉద్యోగుల నాయకులకు తత్వం బోధపడి దారిలోకి వచ్చారు. ఫలితంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. చట్టప్రకారం వ్యవహరించవలసిన ఐఏఎస్‌ అధికారులు ఆ విషయం మరిచిపోయి ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా మాత్రమే వ్యవహరించడంతో ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు.


అధికారులకు తెలియదా?

ఎన్నికల కమిషన్‌ ఎంత శక్తివంతమైందో ఈ దేశ ప్రజలకు మొదటిసారిగా తెలియజేసిన కేంద్ర ఎన్నికల కమిషనర్‌ టి.ఎన్‌.శేషన్‌ను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోకుండా ఉండలేం. శేషన్‌ చండశాసనుడిగా వ్యవహరించడంతో జగన్‌్‌ని  మించిన బలమైన నాయకులు ఎందరో అప్పట్లో తలవంచక తప్పలేదు. ఆ తర్వాత దశలో ఎన్నికల కమిషన్‌ను బలహీనం చేయడం కోసం కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ముగ్గురు కమిషనర్లను నియమించే వీలు కల్పిస్తూ కేంద్రప్రభుత్వం చట్టసవరణ చేసింది. జగన్‌ రెడ్డి మాత్రమే తమకు సుప్రీం అన్నట్టుగా వ్యవహరించిన ఐఏఎస్‌ అధికారులకు ఇవన్నీ తెలియవనుకోవాలా? అదే నిజమైతే, రమేశ్‌ కుమార్‌ ఐఏఎస్‌ ఎలా అయ్యారు? అన్న సందేహం ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డికి వచ్చినట్టుగానే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలను ధిక్కరించిన అధికారుల విషయంలో కూడా మనకు కలుగుతుంది. రాష్ట్రంలో అధికారులు ఎందుకింతలా దిగజారిపోయారో తెలియదు. సర్వీస్‌ రిజిస్టర్‌లో పడే మరకలను ముఖ్యమంత్రి తుడిచేయలేరన్న వాస్తవం కూడా వారికి ఎందుకు గుర్తుకురావడం లేదో! చేసుకున్నవాడికి చేసుకున్నంత అంటారు. ఐఏఎస్‌ అధికారులు తమ విపరీత పోకడలకు ఇవ్వాళ కాకపోయినా రేపు అయినా మూల్యం చెల్లించుకోకతప్పదు. ఇక ఉద్యోగసంఘాల నాయకుల విషయానికి వద్దాం! ఒకప్పుడు ప్రభుత్వాలను గడగడలాడించిన ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ప్రభుత్వ తొత్తులుగా మారిపోయాయి. ఉద్యోగుల కనీస డిమాండ్లను సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే సాహసం చేయలేకపోతున్నాయి. రాజకీయ నాయకులను మించిపోయి మరీ కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నికల కమిషనర్‌ను తిట్టిపోశారు. కరోనా వ్యాక్సిన్‌ గురించి గొంతు చించుకున్నవాళ్లు ఇప్పుడా ఊసే ఎత్తడం లేదంటే వారి వెనుక ఎవరున్నారో ప్రత్యేకంగా చెప్పాలా? అయినా వ్యాక్సిన్‌ తీసుకోవడానికి సగం మంది హెల్త్‌ వర్కర్లు కూడా ముందుకు రావడం లేదని మీడియా ఒకవైపు ఘోషిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వంగానీ, ఉద్యోగుల నాయకులుగానీ కరోనా జపం ఎందుకు చేశారో తెలియదు. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి దివాణంలో భృత్యులుగా కొందరు అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు మారిపోవడం విచారకరం.


ఈ ‘పంచాయతీ’తో వచ్చేదేమిటి?

నిజానికి పంచాయతీ ఎన్నికలు, ఆ మాటకొస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు అధికారంలో ఉన్న పార్టీకే అనుకూలంగా ఉంటాయి. పంచాయతీ ఎన్నికలైతే పార్టీరహితంగా జరుగుతాయి. స్థానికసంస్థల్లో జెండా ఎగురవేస్తే సాధారణ ఎన్నికల్లో అధికార పార్టీకి మేలుకంటే కీడే ఎక్కువ జరుగుతుంది. స్థానిక ప్రజాప్రతినిధుల ప్రవర్తనా ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది. అన్ని రాజకీయపార్టీలకు ఈ విషయం తెలుసు. తెలంగాణలో జరిగిన స్థానిక ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాలను తెలంగాణ రాష్ట్రసమితి గెలుచుకుంది. అయినా దుబ్బాకలో, గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికలకంటే ముందు స్థానిక సంస్థలన్నీ తెలుగుదేశం పార్టీ చేతిలోనే ఉన్నాయి. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఈ సూక్ష్మం తెలిసి కూడా స్థానిక ఎన్నికల్లో పైచేయి కోసం రాజకీయ పార్టీలు వెంపర్లాడుతూనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో రెండు వ్యవస్థల మధ్య మొదలైన ఇగో సమస్య కారణంగానే వివాదం కాస్తా రాద్ధాంతంగా మారింది. అధికారంలో ఉన్న పార్టీ స్థానిక ఎన్నికలలో అధికారాన్ని దుర్వినియోగం చేయడం కూడా కొత్త కాదు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికార దుర్వినియోగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. గ్రామాల్లో సామరస్య వాతావరణాన్ని నెలకొల్పడంతోపాటు వాటి సర్వతోముఖాభివృద్ధికై ఏకగ్రీవ పంచాయతీలకు గత పాలకులు ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఏకంగా 90 శాతం పంచాయతీలు ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం అధికార దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పోలీసు అధికారులు సైతం ఏకగ్రీవాల కోసం జోక్యం చేసుకోవడం వింతగా ఉంది. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, పత్రికలకు ప్రకటనలు జారీ చేయాలన్నా ఎన్నికల కమిషన్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. జగన్‌ ప్రభుత్వం ఈ నిబంధనను కూడా అతిక్రమించింది. ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాల పేరిట ఫుల్‌పేజీ ప్రకటన జారీ చేసింది. ఇందుకు సంబంధిత అధికారి మూల్యం చెల్లించుకోవలసి రావొచ్చు. రమేశ్‌ కుమార్‌ అనే ఒక వ్యక్తిపై కోపంతో జగన్‌ ప్రభుత్వం ప్రతిష్ఠకుపోతూ నియమనిబంధనలను ఉల్లంఘించడం సమర్థనీయం కాదు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడా రమేశ్‌ కుమార్‌ హయాంలో ఎన్నికలు జరగడం ఇష్టం లేదన్న ఏకైక కారణంగా అధికార పార్టీ అనాగరికంగా, అరాచకంగా ప్రవర్తించడం రోతగా ఉంది. మరో రెండు నెలల తర్వాత రమేశ్‌ కుమార్‌ పదవీ విరమణ చేస్తారు. అప్పుడు ఆయన ఒక సాధారణమైన వ్యక్తి మాత్రమే! అలాంటి వ్యక్తితో వీధి పోరాటానికి తలపడటం ఏమిటి? జగన్‌ రెడ్డి మరో మూడేళ్లు అధికారంలో ఉంటారు. అయినా వ్యక్తిగతంగా అహం దెబ్బ తింటోందని భావిస్తూ వ్యవస్థలతో ఘర్షణకు తెరలేపడం ద్వారా జగన్‌ రెడ్డి సమాజానికి ఏ సందేశం పంపాలనుకుంటున్నారు? ‘రాష్ట్రంలో ఏం జరుగుతోందో మాకు తెలియదనుకోవద్దు’ అని హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించే అవకాశం కల్పించడం వల్ల ముఖ్యమంత్రికి ఏం ప్రయోజనం కలుగుతుందో తెలియదు. హైకోర్టు కొంత దూకుడుగా వ్యవహరిస్తోందని మొన్నటివరకు ఒక వర్గం ప్రజలతోపాటు సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడిన మాట వాస్తవం. అయితే, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన పరిణామాల పుణ్యమా అని సుప్రీంకోర్టుకు సైతం రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసిపోయింది. సంక్షేమ పథకాల కారణంగా ప్రజలలో తనకే ఆదరణ ఉందని జగన్‌ రెడ్డి నమ్ముతూ ఉండవచ్చు గానీ, ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇమేజ్‌, విశ్వసనీయత కూడా ముఖ్యం. ఈ రెండూ కోల్పోయిన ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే! ఢిల్లీలో కేంద్రప్రభుత్వ పెద్దలు తనకు అండగా ఉన్నారన్న భరోసాతో విర్రవీగడం వల్ల జగన్‌తోపాటు రాష్ట్రం కూడా నష్టపోతుంది. ఎన్నికల కమిషనర్‌ను రాష్ట్ర మంత్రులు తిడుతున్న తిట్లు, చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి శోభనివ్వవు. తాము గొప్పగా పాలిస్తున్నామని చెప్పుకుంటున్న ఢిల్లీ పెద్దలు ఇలాంటి పెడ ధోరణులను ఎలా అనుమతిస్తున్నారో అంతకంటే అర్థంకాని విషయం. తమకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని గత కాంగ్రెస్‌ పాలకులవలె బీజేపీ పెద్దలు కూడా భావిస్తున్నట్లుగా ఉంది. కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉన్నాయని చెబుతూ జగన్‌ ప్రభుత్వం పోతున్న ఈ వికృత పోకడలు ఎంతకాలమో తెలియదు. గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులి అవుతుంది అన్నట్టుగా సాత్వికుడుగా పేరున్న ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ను అదేపనిగా రెచ్చగొట్టి, అవమానించిన ఫలితంగా ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ పరువు పోగొట్టుకున్నారు. రమేశ్‌ కుమార్‌ బాటలోనే రేపు మరికొంతమంది అధికారులు ముందుకు రావొచ్చు. ఆ తర్వాత ప్రజల వంతు! భయపెట్టి పాలించాలనుకోవడం రాజనీతిజ్ఞుడి లక్షణం కాదు. ఫ్యాక్షనిస్టులు మాత్రమే అలా వ్యవహరిస్తారు.


నీతిమాలిన చర్య ఏది, ఎవరిది?

ఈ విషయం అలా ఉంచితే, గతవారం నేను రాసిన కొత్త పలుకును పాక్షికంగా ఖండిస్తూ వైఎస్‌ షర్మిల ఒక ప్రకటన జారీ చేశారని జగన్‌ మీడియాలో ప్రచురించారు. ఒక కుటుంబానికి సంబంధించి వార్తలు రాయడం నీతిమాలిన చర్య అని కూడా ఆక్షేపించారు. నిజానికి నేను చెప్పిన అనేక అంశాలను షర్మిల ఖండించలేదు. ఎవరో తయారుచేసిన ప్రకటనపై షర్మిల అయిష్టంగా సంతకం చేసినట్టుగా ఆ ప్రకటనను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. శ్రీమతి విజయలక్ష్మి బెంగళూరులో ఉన్న షర్మిల వద్దకు హుటాహుటిన ఎందుకు వెళ్లారు? పులివెందుల నుంచి ఎవరెవరు బెంగళూరు వెళ్లారు? అక్కడ ఏం జరిగింది? ఏ పరిస్థితులలో ఆ ప్రకటనపై షర్మిల సంతకం చేసిందీ నాకు తెలియదనుకుంటున్నారా? అయినా, కుటుంబ వ్యవహారాల గురించి రాయడం నీతిమాలిన చర్య అన్న పక్షంలో ఒకప్పుడు రామోజీరావుతో విభేదించిన ఆయన చిన్న కుమారుడు దివంగత సుమన్‌తో ఇంటర్వ్యూ చేసి రామోజీరావును తిట్టించిన జగన్మోహన్‌ రెడ్డి కూడా నీతిమాలిన చర్యకు పాల్పడినట్టే కదా! జగన్‌ ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయనది ప్రైవేటు కుటుంబం కాదు. షర్మిల కూడా వైసీపీ తరఫున ప్రచారం చేశారు. ప్రజా జీవితంలో ఉన్నవారి మధ్య విభేదాలు ఏర్పడితే అది వార్త కాకుండా పోదు. రామోజీరావు ప్రజాజీవితంలో లేకపోయినా ఆయన కుటుంబాన్ని బజారుకు ఈడ్చిన వాళ్లు నీతి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే! అయినా నేను రాసినవి అసత్యాలని అటు శ్రీమతి విజయలక్ష్మి గానీ, ఇటు షర్మిల గానీ బైబిల్‌ పట్టుకుని చెప్పగలరా? అలా చెప్పిన రోజు నేను బహిరంగంగా క్షమాపణ చెబుతాను. అన్నట్టు రాష్ర్టానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి ఇతరులతో పాటు నేను కూడా కారణమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి శుక్రవారంనాడు ఢిల్లీలో నోరు పారేసుకున్నారు. గత ప్రభుత్వం హోదా సాధించలేకపోయిందని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నప్పటికీ మీరేం చేస్తున్నారో చెప్పకుండా నా బోటివాళ్లపై పడి ఏడవడం ఎందుకు? ‘‘మాకు అధికారం ఇస్తే హోదా సాధిస్తాం’’ అని నమ్మబలికే కదా మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వ పెద్దల వద్ద ఆ ఊసు ఎత్తడానికి సైతం భయపడుతున్నారు ఎందుకు? మీడియా వారివల్ల హోదా రాకుండా పోయింది నిజమైతే.. మీకు అధికారంతో పాటు మీడియా కూడా ఉంది కదా? అయినా పాదాభివందనాలు ఎందుకు? విజయసాయి రెడ్డి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు. సంబంధం లేనివారిని కూడా కుల ద్వేషంతో వివాదంలోకి లాగే ప్రయత్నం చేసే బదులు తనను తాను అదుపులో ఉంచుకుంటే ఆయనకే మంచిది!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2021-01-31T06:25:55+05:30 IST