అధికార పార్టీలో అంతర్యుద్ధం!

ABN , First Publish Date - 2022-06-30T05:21:20+05:30 IST

జిల్లా పరిధిలోని ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో 50 శాతం మందికి ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి నెలకొంది.

అధికార పార్టీలో  అంతర్యుద్ధం!

అసమ్మతితో అంటకాగుతున్న వైసీపీ

నేతల మధ్య ముదురుతున్న విభేదాలు

వర్గాలుగా చీలిన ద్వితీయ శ్రేణి నాయకత్వం


సొంత పార్టీకి చెందిన నాయకులే నన్ను బలహీన పరచడానికి కుట్ర పన్నుతున్నారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యక్తం చేసిన ఆవేదన ఆ పార్టీ అగ్రనేతల మధ్య పోరుకు అద్దం పడుతోంది. 

నగర మేయర్‌ స్రవంతి ఇప్పటివరకు కార్పొరేషన పరిధిలోని నగర నియోజకవర్గంలో పర్యటించిన సందర్భాలు లేవు. డిప్యూటీ మేయర్లు రూరల్‌ నియోజకవర్గంలో రాజకీయ పరంగా తిరుగాడిన సన్నివేశాలూ లేవు. ఇది పార్టీలో ముదిరిన ఆదిపత్య పోరుకు నిదర్శనంగా నిలుస్తోంది. 

జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వాలు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టాయి. ఇది పార్టీలో ముదిరిన వైషమ్యాలను ఎత్తి చూపుతోంది. ఈ పరిణామాలన్నీ జిల్లా వైసీపీ అసమ్మతితో అంటకాగుతోందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 


నెల్లూరు, జూన 29 (ఆంధ్రజ్యోతి) :  జిల్లా పరిధిలోని ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో 50 శాతం మందికి ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి నెలకొంది. ఏడాది కిత్రం వరకు సిటీ ఎమ్మెల్యే అనిల్‌, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు అత్యంత ఆప్తులుగా మెలిగారు. ఒకేమాట, ఒకేబాటగా సాగారు. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య ఆదిపత్యపోరు మొదయ్యింది. దీనికి రకరకాల కారణాలు ప్రచారంలో ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలను కొందరంటే, అధికారుల బదిలీలే కారణమని మరి కొందరు చెబుతున్నారు. కారణాలు ఏవైనా ప్రస్తుతం వీరిద్దరి మధ్య నిశబ్ద యుద్ధం నడుస్తోందనడంలో సందేహం లేదు. ఒకరినొకరు బలహీన పరుచుకోవడానికి పావులు కదుపుతున్నారనే వాదనలు ఉన్నాయి. రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి మంగళవారం చేసిన మాటలు దీనికి బలం చేకూర్చుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ఆనం విజయకుమార్‌రెడ్డి రూరల్‌ నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి వర్గం భావిస్తోంది. విజయకుమార్‌రెడ్డికి ఆయన అన్న ఆనం రామనారాయణరెడ్డి, అనిల్‌ కుమార్‌ల మద్దతు ఉందని అభిప్రాయపడుతోంది. మంగళవారం రూరల్‌ ఎమ్మెల్యే మాటల్లో సైతం అదే భావం వ్యక్తమయ్యింది. ఇక అనిల్‌కు, ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్థనరెడ్డిల మధ్య చాపకింద నీరులా ఆదిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి, నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డికి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.


ద్వితీయ శ్రేణి తిరుగుబాటు


ఇక మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేల గెలుపునకు కీలకంగా పనిచేసిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పుడు అదే ఎమ్మెల్యేలపై తిరుగుబాటు ప్రకటించారు. నెల్లూరు సిటీలో అనిల్‌కు అన్నింటా అండగా ఉన్న ఆయన బాబాయ్‌, సిటీ డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌కు మధ్య దూరం పెరిగింది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య దెబ్బతిన్న సంబంధాల గురించే సిటీలో పెద్ద చర్చ నడుస్తోంది. నుడా చైర్మన ముక్కాల ద్వారకానాధ్‌, వైవీ. రామిరెడ్డి వంటి ముఖ్యమైన నేతలు  అనిల్‌కు దూరమయ్యారు. 

కందుకూరు నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డికి, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు వర్గానికి మధ్య పొసగడం లేదు. కొద్దిరోజుల క్రితం జరిగిన నియోజకవర్గ వైసీపీ ప్లీనరీలోనే అసమ్మతి గళం విప్పాలని ప్రయత్నించారు. అయితే ఈ విషయాన్ని ముందే పసిగట్టిన నేతలు తెలివిగా ఆ అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నారు. 

ఉదయగిరి నియోజకవర్గంలో పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల జరిగిన నియోజకవర్గ ప్లీనరీకి  పలువురు ముఖ్య నాయకులు హాజరు కాలేదు. సొంత పార్టీ మనుషులై ఉండి కూడా ప్రతి పనికి లంచం ఇచ్చుకోవాల్సి వస్తోందనే ఆగ్రహం ద్వితీయ శ్రేణి నాయకుల్లో వ్యక్తం అవుతోంది. 

ఆత్మకూరు నియోజకవర్గంలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఉప ఎన్నికల సందర్భంగా ఈ విషయం బట్టబయలు అయ్యింది. ఆత్మకూరు మున్సిపాలిటీ, అనంతసాగరం, ఏఎ్‌స.పేట, చేజర్ల, సంగం మండలాల్లో వర్గపోరు తీవ్రంగా ఉంది. 

కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి ఆయన ముఖ్య అనుచరుని ఏక నాయకత్వం కింద పార్టీ పటిష్టంగా ఉన్నట్లు కనిపిస్తున్నా క్షేత్రస్థాయి నాయకుల్లో అసంతృప్తి తీవ్రస్థాయిలో ఉంది. నియోజకవర్గంలో కేవలం ఆరేడుగురు మాత్రమే సంపాదించుకొంటున్నారనే అక్కసు కేడర్‌లో తీవ్రంగా వ్యక్తం అవుతోంది.

 కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో అసమ్మతి గళాలు బయటకు వినిపించలేదు కానీ లోలోన క్యాడర్‌ రగిలిపోతోందని సమాచారం. ఇది ఎప్పటికైనా భగ్గుమనే సూచనలూ లేకపోలేదు. గడచిన మూడేళ్ల అధికారంలో జిల్లాలో చేసిన అభివృద్ధి ఏం లేకపోగా, సొంత పార్టీలోనే ఒకరిపై ఒకరు రాళ్లేసుకొవడం గమనార్హం.  


నేడు జిల్లా ప్లీనరీ


నెల్లూరు (జడ్పీ) : వైసీపీ జిల్లా ప్లీనరీ గురువారం నగరంలోని వీపీఆర్‌ కన్వెన్షన హాలులో జరగనుంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన  ఉదయం 10గంటలకు జరిగే ప్లీనరీకి మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. 


కావలి ప్లీనరీకి ఆదాల డుమ్మా


కావలి : నియోజకవర్గ వైసీపీ ప్లీనరీకి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి డుమ్మా కొట్టారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆర్‌ఎస్సార్‌ కల్యాణ మండపంలో ప్లీనరీకి ముఖ్య అతిథులలో ఒకరైన ఎంపీ ఆదాల గైర్హాజరు కావడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. గత ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థిగా ఆదాల ప్రబాకర్‌రెడ్డిలు పోటీ చేశారు. అయితే ఎన్నికల ప్రచారంలోనే వీరిద్దరు ఒకరినొకరు సహకరించుకోలేదనే ప్రచారం ఉంది. ఎన్నికల తర్వాత కూడా వీరిద్దరు అంటీముట్టినట్లు వ్యవహరిస్తున్నారు. కావలిలో జరిగే పార్టీ కార్యక్రమాలలో ఇద్దరూ కలిసి పాల్గొన్న దాఖలాలు లేవు. అయితే, వైసీపీ ప్లీనరీకి ఎంపీ ఆదాల వస్తారని భావించి ఆ మేరకు స్వాగతం పలుకుతూ బ్యానర్లు, ప్లెక్సీలు కూడా కట్టారు. అయితే, తన ముఖ్య అనుచరుడైన కొండ్రెడ్డి రంగారెడ్డిని పంపి ఆయన  రాకపోవటం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది.



ఎమ్మెల్యే ప్రసన్న ఎదుటే

నాయకుల వాగ్వాదాం!


బుచ్చిలోని అధికార పార్టీలో నాయకుల మధ్య వివాదాలు భగ్గుమంటున్నాయి. బుధవారం నగర పంచాయతీ కార్యాలయంలో సాక్షాత్తు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఎదుటే ఓ నాయకుడు మరో నాయకుడిపై వివాదానికి దిగారు. వివాదానికి దిగిన వ్యక్తి ఓ కౌన్సిలర్‌ భర్త. ‘‘‘మమ్మల్ని పిలవకుండా మా వార్డులో ఇళ్ల స్థలాలకు లబ్ధిదారుల ఎంపికను మీరెలా చేస్తారు?. మాకూ చేతొచ్చు.. రా తేల్చుకుందాం’ బూతుల మాట్లాడుతూ వాగ్వాదానికి దిగారు. ఇంతలో ఎమ్మెల్యే ప్రసన్ననే కలగజేసుకుని వారిలో ఒక నాయకుడిని పిలిచి మాట్లాడటంతో వివాదం సర్దుమణిగింది. 4నెలల క్రితం బుచ్చి వైసీపీలో భగ్గుమన్న విబేధాలు చల్లారినట్టు కనిపించినా బుధవారం పట్టాల పంపిణీ సందర్భంగా భగ్గుమంది. పట్టాల పంపిణీకి 10రోజుల ముందు నాయకులందరూ కూర్చుని అర్హత కలిగిన వారి జాబితా తయారు చేయాలని, అనర్హులను గుర్తించి తొలగించాలని ఎమ్మెల్యే ప్రసన్న సూచించినట్టు సమాచారం. అయితే బుధవారం పట్టాలు పొందిన వారిలో సగం మంది అనర్హులేననే విమర్శలు అధికార పార్టీలోని నాయకుల వ్యాఖ్యానించడం గమనార్హం.

- బుచ్చిరెడ్డిపాళెం


Updated Date - 2022-06-30T05:21:20+05:30 IST