ఆదివాసీ కాఫీ రైతుల కోసం ప్రత్యేక కార్యాచరణ

ABN , First Publish Date - 2022-05-26T06:32:27+05:30 IST

ఆదివాసీ కాఫీ రైతులకు గరిష్ఠ ధరలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు.

ఆదివాసీ కాఫీ రైతుల కోసం ప్రత్యేక కార్యాచరణ
ఎకో పల్పింగ్‌ యూనిట్‌ వద్ద రికార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

- గరిష్ఠ ధరలు అందించేందుకు చర్యలు

- చింతపల్లిలో ఐటీడీఏ నిధులతో గోదాము నిర్మాణం

- జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

చింతపల్లి, మే 25: ఆదివాసీ కాఫీ రైతులకు గరిష్ఠ ధరలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. బుధవారం చింతపల్లిలో పర్యటించిన ఆయన స్థానిక ఎకో పల్పింగ్‌ యూనిట్‌ను సందర్శించారు. బోర్డు సభ్యులతో కాఫీ సేకరణ, పల్పింగ్‌, మార్కెటింగ్‌ను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ది విశాఖ చింతపల్లి గిరిజన కాఫీ ఉత్పత్తిదారుల మ్యాక్స్‌ సొసైటీ ద్వారా సుమారు 3,500 మంది రైతుల నుంచి గత ఏడాది 1087 మెట్రిక్‌ టన్నుల కాఫీని సేకరించి మార్కెటింగ్‌ చేశారన్నారు. తొలివిడతగా కిలో పండ్లకు రూ.32 ధర చెల్లించారని, గింజలను మార్కెటింగ్‌ చేసి బోనస్‌గా రూ.8లు రైతులకు అందజేశారన్నారు. ఈ ఏడాది మ్యాక్స్‌ సొసైటీ ద్వారా గింజలను మార్కెటింగ్‌ చేసుకున్న రైతులకు కిలో పండ్లకు రూ.40 ధర అందించినట్టు తెలిపారు. రానున్న రోజుల్లోనూ కాఫీ రైతులకు గరిష్ఠ ధరలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పారు. చింతపల్లి మాదిరిగా జీకేవీధి, జి.మాడుగులలోనూ ఎకో పల్పింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. చింతపల్లిలో కాఫీ గింజలను నిల్వ చేసేందుకు గోదాములేదని, ఈ మేరకు వెయ్యి మెట్రిక్‌ టన్నుల కాఫీ గింజలను నిల్వ చేసే విధంగా గోదాము నిర్మాణానికి ఐటీడీఏ నిధులను మంజూరు చేసిందని తెలిపారు. మ్యాక్స్‌ సొసైటీ ద్వారా ఆదివాసీ కాఫీ రైతులకు గరిష్ఠ ధరలు అందించడం వల్ల దళారులను నియంత్రించవచ్చునన్నారు. ఒకవేళ ఆదివాసీ రైతులు ప్రైవేటు వర్తకులకు కాఫీ గింజలను విక్రయించాల్సి వచ్చినా మ్యాక్స్‌ సొసైటీ నిర్ణయించిన ధరకే కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుందన్నారు. అత్యధిక సంఖ్యలో ఆదివాసీ రైతులు మ్యాక్స్‌ సొసైటీ ద్వారా కాఫీ గింజలను మార్కెటింగ్‌ చేసుకునేందుకు అవగాహన కల్పిస్తామన్నారు. జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి మండలాల్లో ఎంత మంది కాఫీ రైతులు ఉన్నారు?, ఎన్ని ఎకరాల్లో సాగుచేస్తున్నారు?, ఎంత దిగుబడి వస్తుందనే సమగ్ర సమాచారాన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఈ ఏడాది అక్టోబరులోగా నమోదు చేయిస్తామని చెప్పారు. కాఫీ రైతులను రిజిస్ట్రేషన్‌ చేయడం వల్ల ఎంత దిగుబడులు వస్తాయనే సమాచారం తెలుస్తుందన్నారు. రైతులు మ్యాక్స్‌ సేవలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

పటిష్టంగా స్వచ్ఛ సంకల్పం

గ్రామాల్లో స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో స్వచ్ఛ సంకల్పంపై ఆయన మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శిలు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీల పరిధిలో స్వచ్ఛ సంకల్పం అమలుతీరుపై అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీవో పీఎస్‌ కుమార్‌, ఎంపీపీ వంతల బాబూరావు, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, ఎంపీడీవో లాలం సీతయ్య, తహసీల్దార్‌ గోపాలకృష్ణ, ఈవోఆర్‌డీ శ్రీనివాసరావు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-26T06:32:27+05:30 IST