అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌ ఎఫెక్ట్‌...!

ABN , First Publish Date - 2022-08-12T05:30:00+05:30 IST

అడ్మినిస్ర్టేటివ్‌ గ్రౌండ్స్‌ అంటే ఒకప్పుడు వారి అవసరాలను బట్టి ఉద్యో గుల నియామకం, బదిలీలు జరిగేవి

అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌ ఎఫెక్ట్‌...!

కోర్టు చెబితే వినాలా..?

నచ్చినట్లుగా వార్డెన్ల బదిలీలు 

కోర్టు మెట్లెక్కిన బీసీ వసతిగృహ మహిళా వార్డెన

బదిలీల్లో వాడిన 10్ఠ10పై హైకోర్టు మొట్టికాయ

కోర్టు ఉత్తర్వులను అమలు చేయని అధికారులు 

అనంతపురం ప్రెస్‌క్లబ్‌ : అడ్మినిస్ర్టేటివ్‌ గ్రౌండ్స్‌ అంటే ఒకప్పుడు వారి అవసరాలను బట్టి ఉద్యో గుల నియామకం, బదిలీలు జరిగేవి. అయితే ప్రస్తుతం సంక్షేమశాఖల్లో ఈ అడ్మినిస్ర్టేటివ్‌ గ్రౌండ్స్‌ అంటే తమకు అనుకూలమైన వారికి అందలం. ఇబ్బందిగా ఉంటే వేరొక ప్రాంతానికి బదిలీ అన్న చందంగా తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా సంక్షేమశాఖల వార్డెన్ల బదిలీల్లో ఈ అడ్మినిస్ర్టేటివ్‌ గ్రౌండ్స్‌ కింద ఉమ్మడి జిల్లా సంక్షేమశాఖ అధికారులు చేసిన రచ్చ అంతాఇంతా కాదు. సంక్షేమ అధికారులు తమకిష్టమొచ్చిన, మెచ్చిన వార్డెన్లను అనుకూలమైన చోటకు బదిలీలు చేయడం. ఆప్షనలు ఇచ్చుకున్న వారికి ఆ ప్రాంతానికి కాకుండా వేరొక ప్రాంతానికి బదిలీలు చేయడం. అసలు ఎలాంటి అర్హతలు లేని వారిని పైస్థాయి పోస్టుల్లో కూర్చోబెట్టి విమర్శల పాలయ్యారనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే... ఎవరు నోరు మెదిపినా అడ్మినిస్ర్టేటివ్‌ గ్రౌండ్స్‌ పేరుతో అందరి నోళ్లు మూయించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నా యి. ఈ నేపథ్యంలోనే ఓ మహిళా వార్డెన అన్ని విధాలా తాను అర్హురాలినైనా తాను కోరుకున్న చోటకు బదిలీ చేయడంలో 10్ఠ10  బూచి చూపుతూ తనను వేరొక ప్రాంతానికి బదిలీ చేశారని హైకోర్టు మెట్లెక్కింది. దీంతో ఆమె మొరను ఆలకించిన కోర్టు అన్ని అర్హతలున్నా ఆ మహిళా వార్డెనను ఆమె కోరుకున్న వసతిగృహానికి బదిలీ చేయాలంటూ జిల్లా కలెక్టర్‌, బీసీ సంక్షేమశాఖ అధికారులకు మొట్టికాయ వేసింది. కానీ ఉత్తర్వులు నేటికీ అమలు కాకపోవడంతో కోర్టు చెబితే మేము వినాలా అన్న రీతిలో అధికారుల తీరు ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


అనంతకు బదిలీ చేయాలంటూ హైకోర్టు ఆదేశం...

వార్డెన్ల బదిలీల్లో ఉమ్మడి అనంత జిల్లా అధికారులు వేసిన అడ్మినిస్ర్టేటివ్‌ గ్రౌండ్స్‌, 10్ఠ10 ఎత్తులు బెడిసి కొట్టాయనే చెప్పాలి. కొందరు వార్డెన్లు ఆ అధికారుల మాటకు ఎదురుచెప్పలేక వేసిన చోటకు బదిలీపై వెళ్లడం, మరికొందరు తిరుగుబాటు చేసినా బదిలీ చోటకు వెళ్లక పోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలతో మిన్నకుండి పోయారు. అయితే ఈ విషయంలో ముదిగుబ్బలో విధులు నిర్వహిస్తున్న బీసీ వసతిగృహ వార్డెన సులోచన ఒకడుగు ముందుకేసి తనకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించింది. బదిలీల సమయంలో ఆమెకు సీనియార్టీ తదితర అంశాల్లో అర్హతలుండి.. అనంత జిల్లా కేంద్రంలోని నెం-1 బీసీ బాలికల వసతిగృహానికి ఆప్షన ఇచ్చుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో శ్రీసత్యసాయి జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారులు కలెక్టర్‌ ఆదేశాల మేరకు 10్ఠ10 రేషియో ప్రకారం అనంతకు వెళ్తే... అనంత నుంచి శ్రీసత్యసాయి జిల్లాకు ఒక వార్డెన రావాలనే నిబంధన విధించారు. ఆ సమయంలో అనంత నుంచి శ్రీసత్యసాయి జిల్లాకు ఎవరూ రాకపోవడంతో... వార్డెన సులోచను శ్రీసత్యసాయి జిల్లాలోని కొత్తచెరువు వసతి గృహానికి బదిలీ చేశారు. ఈ విషయంలో ఆ మహిళా వార్డెన ఆ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించగా... ఆయన నుంచి కూడా  10్ఠ10 రేషియో సమాధానమే వచ్చినట్లు సమాచారం. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. ఆ మహిళా వార్డెన మొర ఆలకించిన హైకోర్టు బదిలీ జీవో నిబంధనల మేరకు బదిలీలు చేయాలిగానీ...  10్ఠ10 రేషియో అనేది స్థానికంగా అడ్మినిస్ర్టేటివ్‌ గ్రౌండ్స్‌ కింద ఉపయోగించుకోవాలి. అయితే అన్ని అర్హతలున్న ఆ వార్డెనను అనంతకు కాకుండా వేరొక చోటకు ఎలా బదిలీ చేస్తారని ఆ ఉత్తర్వుల్లో ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జీవో నిబంధనల మేరకు ఆ మహిళా వార్డెనను అనంత జిల్లాలోని నెం-1 బీసీ బాలికల వసతిగృహానికి బదిలీ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 

 

హైకోర్టు ఉత్తర్వులు వచ్చినా...

ముదిగుబ్బ మహిళా వార్డెన సులోచను ఆమె కోరుకున్న అనంత జిల్లాకు బదిలీ చేయాలంటూ జూలై 26వ తేదీన హైకోర్టు అనంత జిల్లా కలెక్టర్‌తో పాటు బీసీ సంక్షేమశాఖ అదికారులకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉత్తర్వులు అంది దాదాపు పక్షం రోజులు గడుస్తున్నా జిల్లా కలెక్టర్‌ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బీసీ సంక్షేమశాఖ అధికారులు సైతం మిన్నకుండిపోయినట్లు సమాచారం. శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌ నుంచి ఆదేశాలు రావాలంటూ అనంత జిల్లా అధికారులు చెబుతుండటం,  హైకోర్టు ఉత్తర్వులు వచ్చినప్పటికీ శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌ అడ్మినిస్ర్టేటివ్‌ గ్రౌండ్స్‌నే చూపుతుండటం పలు విమర్శలకు తావిస్తోంది.  దీంతో ఆ మహిళా వార్డెన  తనకు న్యాయం చేయాలంటూ రెండు జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాలు, బీసీ సంక్షేమశాఖల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నట్లు సమాచారం.


కలెక్టర్‌ వద్ద ఫైలు ఉందని చెబుతున్నారు..

బదిలీల్లో అన్ని అర్హతలున్నప్పటికీ  10్ఠ10  రేషియోను చూపి నేను కోరుకున్న ప్లేస్‌కి కాకుండా కొత్తచెరువుకు బదిలీ చేశారు. ఇదేంటని అడిగితే నువ్వు అనంతకు వెళ్తే... అక్కడి నుంచి ఇక్కడకు వచ్చే వార్డెనలు ఎవరూ లేరని.. అందుకే అడ్మినిస్ర్టేటివ్‌ గ్రౌండ్స్‌ కింద బదిలీ చేశామని చెప్పారు. ఇదే విషయంపై కలెక్టర్‌ను సంప్రదించగా ఆయనా అదే అన్నారు. దీంతో కోర్టును ఆశ్రయించా. కోర్టు  నాకు ఫేవర్‌గా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను బీసీ సంక్షేమశాఖ అధికారులకు ఇచ్చినా ఇంకా కలెక్టర్‌ వద్ద ఫైలు ఉందని అంటున్నారు. మరోసారి కలెక్టరేట్‌ వర్గాలను ఆశ్రయించగా... శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌ నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు.. ఆయన ఆదేశాలిస్తే ఆ మేరకు అనంతలో పోస్టింగ్‌ ఇవ్వడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని అనంత జిల్లా అధికారులు చెబుతున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆరోగ్యరీత్యా నా సమస్యను విన్న వించాను. అయినప్పటికీ కోర్టు ఉత్తర్వులిచ్చినా న్యాయం జరగకపోతే నా సమస్య ఎవరు పరిష్కరిస్తారో అర్థం కావడం లేదు. 

- సులోచన, బీసీ వసతిగృహ వార్డెన

Updated Date - 2022-08-12T05:30:00+05:30 IST