‘ముందస్తు’ వ్యూహాలు!

Published: Sun, 19 Sep 2021 00:19:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ముందస్తు వ్యూహాలు!

తెలుగు రాష్ర్టాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణలో ఎన్నికలు జరగడానికి రెండేళ్లకు పైగా వ్యవధి ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో రెండున్నరేళ్లకు పైగా వ్యవధి ఉంది. అయినా రాజకీయపార్టీలు ఇప్పటి నుంచే కత్తులు దూసుకుంటున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఇంతకుముందు ఆరునెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఈ పర్యాయం కూడా అటువంటి ఆలోచన చేసే అవకాశం ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. రెండున్నరేళ్లకు పైగా వ్యవధి ఉన్నప్పటికీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని ఆయన మంత్రిమండలి సమావేశంలో సూచించడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. దీనికితోడు గత ఎన్నికల్లో తాను అధికారంలోకి రావడానికి తనదైన వ్యూహాలతో సహకరించిన ప్రశాంత్‌ కిశోర్‌ వచ్చే ఏడాది మార్చి తర్వాత మళ్లీ రంగంలోకి దిగుతారని జగన్‌రెడ్డి మంత్రులకు తెలియజేశారు. మరోవైపు ఆయనపై నమోదైన ఈడీ కేసులలో విచారణ వచ్చే ఏడాది పూర్తయి తీర్పు వెలువడే అవకాశం ఉండటంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనతో జగన్‌ ఉన్నారని అధికార పార్టీ నాయకులు సైతం అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ విషయానికి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంపై ప్రజల్లో వ్యతిరేకత చాప కింద నీరులా విస్తరిస్తోందని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్‌, బీజేపీ పోటీ పడుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు శ్రీకారం చుట్టగా, పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్‌ రెడ్డి దళిత, గిరిజన ఆత్మగౌరవ సభల పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ దూసుకెళుతున్నారు. రేవంత్‌రెడ్డి దూకుడు పెరగడం, ఆయన నిర్వహించే సభలకు జనం గణనీయంగా హాజరవుతుండడంతో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు అధికారంలోకి రావాలనుకుంటున్న భారతీయ జనతాపార్టీకి కూడ ఆయన టార్గెట్‌గా మారబోతున్నారు. రేవంత్‌రెడ్డిపై ఓటుకు నోటు కేసు విచారణ దశలో ఉంది. ఈ కేసులో ఆయనకు శిక్ష పడితే వచ్చే ఎన్నికల్లో తమ విజయావకాశాలు మెరుగుపడతాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అండ్‌ కో భావిస్తుండగా, రేవంత్‌ కారణంగా కాంగ్రెస్‌ పుంజుకున్నందున ఆయన అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచనతో బీజేపీ నేతలు ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీలో వారం రోజుల పాటు మకాం వేసిన కేసీఆర్‌, బీజేపీ పెద్దలను కలసి రేవంత్‌రెడ్డికి శిక్ష పడే విషయంలో సహకరించవలసిందిగా కోరినట్టు ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌, బీజేపీలకు రేవంత్‌రెడ్డి ఉమ్మడిశత్రువుగా ఉన్నందున ఓటుకు నోటు కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. తెలంగాణలో ప్రస్తుతానికి కాంగ్రెస్‌-–బీజేపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ టార్గెట్‌గా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు దూకుడు పెంచినప్పుడల్లా కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షాలను కలుస్తున్నారు. దీంతో ఆ రెండు పార్టీలూ ‘ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ’ అని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టడం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శుక్రవారం నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. అదే రోజు కాంగ్రెస్‌ పార్టీ కూడా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహించింది. అమిత్‌షా సభ కంటే తమ సభకే జనం ఎక్కువగా హాజరయ్యారని కాంగ్రెస్‌ నాయకులు సంబరపడుతున్నారు. రానున్న రోజులలో కాంగ్రెస్‌, బీజేపీలలో ఏది  బలపడుతుంది? ఏది  బలహీనపడుతుంది? అన్నది స్పష్టమవుతుంది. ఈ పరిణామాలను గమనిస్తున్న కేసీఆర్‌, పరిస్థితులన్నింటినీ బేరీజు వేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లే విషయంలో నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తనకు ప్రధాన ప్రత్యర్థిగా బలపడటం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సహజంగానే రుచించదు. అందునా తాను ద్వేషించే రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ బలపడడాన్ని ఆయన జీర్ణించుకోలేరు. అలా జరగకూడదని కోరుకుంటున్న కేసీఆర్‌ ఎటువంటి రాజకీయ ఎత్తుగడలను అనుసరించనున్నారు? అన్నది స్పష్టం  కావలసి ఉంది. గతంలో మాదిరి ఈ పర్యాయం కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే మాత్రం ఆయనకు ఢిల్లీలోని బీజేపీ పెద్దల సహకారం అవసరం. కేసీఆర్‌ ఆలోచనలను పసిగడుతున్న రేవంత్‌రెడ్డి కూడా తదనుగుణంగా వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. బహుజన్‌ సమాజ్‌ పార్టీ, షర్మిల నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌టీపీతో ఎన్నికల పొత్తుకోసం పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఏ మాత్రం ఉన్నా వచ్చే ఏడాది తాను తలపెట్టిన పాదయాత్రను రేవంత్‌రెడ్డి ముందుకు జరుపుకునే అవకాశం ఉంది. షెడ్యూల్‌ ప్రకారం అయితే 2023 చివరిలో శాసనసభకు ఎన్నికలు జరగవలసి ఉంది. అయినప్పటికీ వివిధ కారణాల వల్ల తెలంగాణలో రాజకీయ వాతావరణం ఇప్పటినుంచే వేడెక్కింది. తెలంగాణపై తన పట్టును నిలుపుకోవాలన్నా, ప్రజల్లో తన పట్ల నెలకొన్న వ్యతిరేకతను పటాపంచలు చేయాలన్నా కేసీఆర్‌కు ఇంకో ఏడాది మాత్రమే వ్యవధి ఉంది. హుజూరాబాద్‌ ఉపఎన్నిక కోసం పురుడు పోసుకున్నదే అయినప్పటికీ తాను ప్రారంభించిన ‘దళితబంధు’ పథకం పైనే కేసీఆర్‌ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ పథకం కేసీఆర్‌కు రాజకీయంగా నష్టం చేస్తుందని ప్రతిపక్షాలు బలంగా నమ్ముతున్నాయి. బహుజన్‌ సమాజ్‌ పార్టీకి రాష్ట్రంలో నాయకత్వం వహిస్తున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు దళితుల్లో, ముఖ్యంగా యువతలో మంచి పట్టు ఉంది. ఈ కారణంగా దళితబంధు పథకాన్ని అమలుచేసినా దళితుల ఓట్లు కేసీఆర్‌కు గంపగుత్తగా పడే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారం జరిగినా, ముందుగా జరిగినా తెలంగాణలో త్రిముఖ పోటీ అనివార్యంగా కనిపిస్తున్నది. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలితే మాత్రం తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారిపోవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మున్ముందు మరింత ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది. 


ప్రజా వ్యతిరేకతే ప్రాతిపదిక!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వద్దాం. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ అందుకు తగిన ప్రాతిపదిక ఉందా? అన్న సందేహం తలెత్తుతోంది. ప్రజల్లో తన ప్రతిష్ఠ మసకబారుతోందని ప్రశాంత్‌ కిశోర్‌ టీం ద్వారా నిర్వహించనున్న సర్వేలో వెల్లడైతే మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనను జగన్‌రెడ్డి నిజంగానే చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మధ్యతరగతి ప్రజల్లో జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొందన్న విషయాన్ని అధికారపార్టీ వారు సైతం అంగీకరిస్తున్నారు. ప్రభుత్వం చేతిలో ఉంటే ఏమైనా చేయవచ్చునన్న మనస్తత్వం కలిగిన వ్యక్తి జగన్మోహన్‌ రెడ్డి. అధికారంలో ఉన్నప్పటికీ చట్టాలు, నిబంధనలకు లోబడి నడుచుకోవాలన్న ఆలోచనే ఆయనకు గిట్టదు. తండ్రి రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జగన్‌రెడ్డి సొంత మీడియాను నెలకొల్పిన విషయం విదితమే. తన చానల్‌ను ప్రారంభించిన కొత్తలో ఆయన తన సిబ్బందితో మాట్లాడినప్పుడు ‘మీరు టీవీ ప్రోగ్రాముల కోసం ఎక్కడ షూటింగ్‌ చేసుకోవాలనుకున్నా నిరభ్యంతరంగా చేసుకోండి. అది జైలైనా పర్వాలేదు. మనకు అనుమతులు అక్కర్లేదు. ప్రభుత్వమే మనది. అధికారంలో ఉన్న మనకు అడ్డేముంటుంది!’ అని చెప్పారట. దీన్నిబట్టి అధికారంలో ఉన్నప్పటికీ నిబంధనలు పాటించి అనుమతులు పొందాలన్న ధ్యాస ఆయనకు లేదని అర్థం చేసుకోవాలి. ఈ కారణంగానే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన తనకు అడ్డేముంటుందని భావిస్తున్నారు. ఫలితంగా న్యాయస్థానంతో పదే పదే చివాట్లు తింటున్నారు. ప్రభుత్వపరంగా తీసుకునే నిర్ణయాలను కూడా ఇష్టానుసారం తీసుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రికి అయినా, ప్రధానమంత్రికి అయినా పరిమితులు ఉంటాయంటే జగన్‌రెడ్డి అంగీకరించేలా లేరు. ఈ కారణంగానే కంపెనీలను, వ్యాపారాలను, ప్రైవేటు ఆస్తులను చెరబడుతున్నారు. విశాఖపట్నంలో చేతులు మారిన ఆస్తుల వెనుక జరిగిన చీకటిదందాలను కథలు కథలుగా చెబుతున్నారు. ఎవరైనా అన్ని ఆస్తులను ఏం చేసుకుంటారంటే సమాధానం ఎవరు చెప్పాలి? రాజశేఖర్‌ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తమకు తిరుగులేదని భావించడం వల్లనే జగన్‌రెడ్డి ఇప్పుడు అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆయన పాలనలో జరుగుతున్న చీకటిదందాలపై భవిష్యత్తులో కచ్చితంగా విచారణ జరుగుతుంది. అప్పుడు పరిస్థితి ఏమిటి? ఈ ఆలోచనే ఉంటే ఇప్పుడు తప్పులు చేయరు కదా! నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టుగా జగన్‌రెడ్డి వ్యవహరించడం వల్లే ఆయన ప్రభుత్వంపై రెండేళ్లకే వ్యతిరేకత నెలకొంది. గత ఎన్నికల్లో ఆయనను గుడ్డిగా సమర్థించిన వారు సైతం ఇప్పుడు జగన్‌ పాలన ఇలా ఉందేంటి? అని విమర్శలు చేస్తున్నారు. కొన్నివర్గాల ప్రజల్లో తనకు తిరుగు ఉండదని ఆయన అనుకుంటున్నారు కానీ ఇప్పుడు వారంతా గత ఎన్నికల సమయంలో వలె బలంగా నిలబడే పరిస్థితి లేదు. అధికారపార్టీ శాసనసభ్యులు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. ఈ కారణంగా అధికార పార్టీలో అసహనం పెరిగిపోతోంది. జోగి రమేష్‌ నాయకత్వంలో శుక్రవారం ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపైకి దండయాత్ర చేయడం ఇందుకు నిదర్శనం. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నరసరావుపేటలో కోడెల వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డిని దూషించినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ ఈ దండయాత్ర జరిగింది. అయ్యన్నపాత్రుడు తిడితే చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సి వస్తే గతంలో మంత్రులు, కొంత మంది ఎమ్మెల్యేలు చంద్రబాబును, లోకేశ్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినందుకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కూడా క్షమాపణ చెప్పాలి కదా! అయ్యన్నపాత్రుడు వాడిన భాష అభ్యంతరకరమైనదే! సందేహం లేదు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో లుచ్చాలు, వెధవలు వగైరా పదాలు సర్వసాధారణం అయ్యాయి. మంత్రి కొడాలి నానితో పాటు ఇదే జోగి రమేష్‌ గతంలో చంద్రబాబును ఇంతకంటే తీవ్ర పదజాలంతో దూషించారు. అప్పుడు క్షమాపణల కోసం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఇంటిపైకి దండయాత్ర చేయవచ్చునన్న ఆలోచన తెలుగుదేశం వాళ్లకు రాలేదు. నిజానికి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కొద్దినెలల క్రితం వరకు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అధికారపక్షాన్ని ప్రతిఘటించే సాహసం చేయలేకపోయారు. అయితే ఇటీవలి కాలంలో మాత్రం కార్యకర్తలతో పాటు నాయకులు కూడా బయటకు వస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఏర్పడిన విషయం రూఢీ కావడంతో తాము బయటకు రాగలుగుతున్నామని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో నెలకొంటున్న ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా జోగి రమేష్‌ వంటి వారితో దౌర్జన్యాలను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తే ఆయనకే నష్టం. అధికారం ఉంది కదా అని ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి ఇంటిపై దాడికి తెగబడితే రేపు ప్రజాభిప్రాయం మారి, ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏమిటి అని జగన్‌ అండ్‌ కో ఆలోచించుకోవాలి కదా! అయ్యన్నపాత్రుడు అన్న మాటలకు క్షమాపణ చెప్పకపోతే చంద్రబాబును, లోకేశ్‌ను రాష్ట్రంలో తిరగనివ్వబోమని జోగి రమేష్‌ హెచ్చరించగా, అయ్యన్న రెండు రోజుల్లో సారీ చెప్పకపోతే జరగబోయే పరిణామాలకు తమ బాధ్యత ఉండదని మంత్రి అవంతి శ్రీనివాస్‌ సెలవిచ్చారు. అంటే ఏం చేస్తారు? కొడతారా? చంద్రబాబును, లోకేశ్‌ను కొట్టండి. ఆ ముచ్చట కూడా తీర్చుకోండి. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మహదానందపడిపోతారు కదా! అయితే తాము కూడా తక్కువ తినలేదని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు శుక్రవారం రుజువు చేసుకున్నారు. వాళ్లు కూడా ప్రతిదాడి చేశారు. దాడులు, ప్రతిదాడులతో రాష్ర్టాన్ని రావణకాష్ఠం చేయాలనుకుంటే అధికారంలో ఉన్నవారికే నష్టం. పోలీసులు తమ చెప్పుచేతల్లో ఉన్నారని భావించి ఎవరిపైన అయినా దాడి చేస్తామంటే ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోక తప్పదు. దండయాత్రకు నాయకత్వం వహించిన జోగి రమేష్‌పై తెలుగుదేశం పార్టీ తగిన ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోకపోవచ్చు. భవిష్యత్తులో ప్రభుత్వం మారితే జోగి రమేష్‌ జైలుకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడదా? అప్పుడు జగన్‌రెడ్డి ఆయనను కాపాడగలరా?


పోలీస్‌.. మరీ ఇంతలా..!?

ఏదిఏమైనా శుక్రవారంనాటి దండయాత్ర సందర్భంగా పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు ఆ శాఖపై అసహ్యం పుట్టేలా చేసింది. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నివాసం వైపు పురుగు కూడా రాకుండా భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసు అధికారులు మాజీ ముఖ్యమంత్రి, జడ్‌ కేటగిరీ భద్రతతో ఉన్న చంద్రబాబుపైకి దండయాత్రకు బయలుదేరిన జోగి రమేష్‌ తదితరులను ఎందుకు నిలువరించలేకపోయారు? పోలీసు అధికారులు ఇందుకు సిగ్గుపడాలి. అయితే ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అన్నీ వదిలేశారు. డీజీపీ గౌతం సవాంగ్‌ ఇంత నిస్సహాయుడిగా మారిపోవడం ఆశ్చర్యంగా ఉంది. తెలుగుదేశం వాళ్లు ప్రతిఘటించి ఉండకపోతే చంద్రబాబుపై దాడి జరిగేదేమో! ఇదే జరిగితే పోలీసు శాఖకే కాదు రాష్ర్టానికి సైతం అది మచ్చ కాదా? పోలీసు వ్యవస్థ కుప్పకూలిపోతే అధికారపార్టీ వాళ్లకు మాత్రం రక్షణ ఉంటుందా? రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా అమలు కానప్పుడు ఎవరికైనా తాలిబన్ల పాలనే గుర్తుకొస్తుంది. రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్లు సంయమనం పాటించడం అవసరం. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో జగన్‌రెడ్డిని చూసి తెలుసుకోవాలని అధికార పార్టీ ఎమ్మెల్యే రోజా ప్రభృతులు అంటున్నారు కానీ ఆంతరంగిక సంభాషణల్లో రాజశేఖర రెడ్డి లక్షణాల్లో ఒక్కటి కూడా జగన్‌ రెడ్డికి రాలేదని వైసీపీ వాళ్లు వ్యాఖ్యానిస్తున్న విషయం వారికి వినిపించడం లేదా? మొత్తమ్మీద అధికారపార్టీలో అసహనం హద్దులు దాటుతోంది. ఇలాగే దండయాత్రలు చేసుకుంటూ పోతే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురైన పరాభవాన్ని మించిన పరాభవం వైసీపీకి ఎదురుకాకుండా ఉంటుందా? ప్రజలిచ్చిన అధికారాన్ని ఎంతలా దుర్వినియోగం చేయవచ్చునో ఇప్పుడు ప్రత్యక్షంగా చూపిస్తున్నందున రేపు మరొకరు అదేవిధంగా చేయకుండా ఉంటారా? ఈ కక్షలూ కార్పణ్యాలకు రాష్ట్రం బలి కావలసిందేనా? రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం కాదా! ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని ప్రశాంత్‌ కిశోర్‌ బృందం నిర్ధారిస్తే జగన్‌రెడ్డి దిద్దుబాటు చర్యలు తీసుకున్నా ఫలితం ఉండకపోవచ్చు. అధికారపార్టీ ధోరణి ఇదేవిధంగా ఉంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లినా జగన్‌ ప్రభుత్వాన్ని ఎవరూ కాపాడలేరు. అధికారానికి పరిమితులు ఉంటాయని జగన్‌ అండ్‌ కో గుర్తించాలి. అప్పులు చేసి ప్రజలకు పంచిపెడుతున్నందున తమకు తిరుగులేదని జగన్‌ అండ్‌ కో భావిస్తే అంతకంటే పిచ్చితనం మరొకటి ఉండదు. జోగి రమేష్‌ నిర్వహించిన దండయాత్రతో తెలుగుదేశం పార్టీ నెత్తిన పాలుపోశారు. అయినా మేం మారేది లేదు.. దౌర్జన్యాలే మా విధానం అని వైసీపీ నేతలు భావిస్తే అది వారి ఇష్టం. ప్రజాభిప్రాయం ఎప్పుడూ నిలకడగా ఉండదు. తస్మాత్‌ జాగ్రత్త!


ఒకేలా స్వీకరించాలి!

ఇక జగన్‌, విజయసాయిరెడ్డిల బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. ఈ చర్య జగన్‌కు, విజయసాయికి ఊరట ఇచ్చి ఉంటుంది. న్యాయస్థానాల్లో తీర్పులు వ్యతిరేకంగా వచ్చినప్పుడు వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్‌ చేస్తున్నాడని నిందించే నీలిమూక రఘురాజు పిటిషన్‌ను కోర్టు కొట్టివేశాక మాత్రం మౌనాన్ని ఆశ్రయించింది. వారి అభిప్రాయం ప్రకారం జగన్‌ అండ్‌ కో వ్యవస్థలను మేనేజ్‌ చేశారని అనుకోవచ్చు కదా! నిజానికి న్యాయపరమైన అంశాలలో కనీస అవగాహన ఉన్నవారు ఎవరైనా రఘురాజు పిటిషన్‌ ఆధారంగా జగన్‌రెడ్డి, విజయసాయి బెయిలు రద్దు అవుతుందని భావించరు. బెయిలు రద్దు కావాలంటే కేసు నమోదు చేసిన సీబీఐ కానీ, ఈ కేసులలో సాక్షులుగా ఉన్నవారు కానీ పిటిషన్‌ దాఖలుచేయాల్సి ఉంటుంది. బెయిలు రద్దు చేయాలని సీబీఐ కోరలేదు. నిర్ణయాన్ని న్యాయస్థానం విచక్షణకే వదిలివేసింది. నిందితులు తమను బెదిరిస్తున్నారని సాక్షులు కూడా న్యాయస్థానానికి ఫిర్యాదు చేయలేదు. ఈ పరిస్థితులలో ఇంతకంటే భిన్నమైన తీర్పు ఎలా వస్తుంది? న్యాయస్థానాలకు దురుద్దేశాలు ఆపాదించడానికి అలవాటుపడిన నీలిమూక సమాజంలో ఒకవర్గం ప్రజల మెదళ్లను కూడా కలుషితం చేసింది. ఫలితంగా న్యాయస్థానాల్లో తీర్పులు వ్యతిరేకంగా వచ్చినప్పుడు తప్పు చేశామని అంగీకరించకుండా న్యాయమూర్తులను శంకించడం ఫ్యాషన్‌ అయింది. ఏ న్యాయస్థానం అయినా మెరిట్‌ లేనప్పుడు అనుకూలంగా తీర్పులు ఇవ్వలేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది మాత్రమే న్యాయస్థానాలు పరిశీలిస్తాయి. న్యాయ వ్యవస్థపై కూడా కొన్ని విమర్శలు, ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అంశాలు ఇమిడిఉన్న సందర్భాలలో న్యాయమూర్తులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారనడానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. అవినీతి, అక్రమాలకు సంబంధించిన కేసులలో న్యాయస్థానాలు ఈ మధ్య మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇదొక శుభపరిణామం. జగన్‌ రెడ్డి బెయిలు రద్దు చేయకపోవడాన్ని స్వాగతించినట్టుగానే ఈడీ కేసులలో జగన్‌కు శిక్ష పడినా అదేవిధంగా స్వాగతించాలి. ఈ సంస్కృతిని నీలిమూకతో పాటు నీలిమీడియా కూడా అలవరుచుకోవడం అవసరం!

ఆర్కే

ముందస్తు వ్యూహాలు!

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.