అధునాతనం పర్యావరణ హితం

ABN , First Publish Date - 2021-05-10T06:33:58+05:30 IST

సూర్యాపేట జిల్లా కేంద్రంగా అంతర్జాతీయ డిజైన్‌తో అధునాతన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటి వరకు 80శాతం పనులు పూర్తికాగా, పర్యావరణహితంగా దీన్ని నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈమార్కెట్‌ నిర్మాణం ఎప్పుడో పూర్తికావా ల్సి ఉండగా, బడ్జెట్‌ అంచనా వ్యయం పెరగడంతోపాటు కరోనా కారణంగా జాప్యమైంది.

అధునాతనం పర్యావరణ హితం
ఇంటి గ్రేటెడ్‌ మార్కెట్‌ ఎదుట కూరగాయల విక్రయం

గాలి, వెలుతురు పుష్కలం

పగలు లైట్లు, ఫ్యాన్లు అవసరం లేదు

సూర్యాపేటలో సకల సౌకర్యాలతో నిర్మాణం


(ఆంధ్రజ్యోతి,సూర్యాపేట): సూర్యాపేట జిల్లా కేంద్రంగా అంతర్జాతీయ డిజైన్‌తో అధునాతన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటి వరకు 80శాతం పనులు పూర్తికాగా, పర్యావరణహితంగా దీన్ని నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈమార్కెట్‌ నిర్మాణం ఎప్పుడో పూర్తికావా ల్సి ఉండగా, బడ్జెట్‌ అంచనా వ్యయం పెరగడంతోపాటు కరోనా కారణంగా జాప్యమైంది. గాలి, వెలుతురు పుష్కలంగా వచ్చేలా, పగలు లైట్లు, ఫ్యాన్లు అవసరం లేకుండా దీన్ని నిర్మిస్తుండటం విశేషం. ఫలితం గా విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. ఈ మార్కెట్‌ నిర్వహణకు సాధారణానికి మూడో వంతు విద్యుత్‌ సరిపోతుంది. రాత్రి వేళ మాత్రమే లైట్లు అవసరమవుతాయి.


అంతర్జాతీయ డిజైన్‌తో..

పగలు గాలి, వెలుతురు పుష్కలంగా వచ్చేలా అంతర్జాతీయ డిజైన్‌తో సూర్యాపేట మార్కెట్‌ను నిర్మిస్తున్నారు. ఇండియన్‌ గ్రీన్‌బిల్డింగ్‌ కాంగ్రెస్‌ మెంబర్‌ చిరంజీవిరావు దీన్ని డిజైన్‌ చేశారు. పాత వ్యవసాయ మార్కెట్‌ 22 ఎకరాలు ఉండగా, 11 ఎకరాల్లో ఈ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను నిర్మిస్తున్నారు. 1.35లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేస్తున్నారు. పిల్లర్ల మధ్య 8 మీటర్ల దూరం ఉంటుండటంతో గాలి, వెలుతురు నిరాకటంకంగా వస్తుంది. జీప్లస్‌ వన్‌ తరహాలో భవనాన్ని నిర్మిస్తుండగా, ప్రభుత్వం అందుకు రూ.25కోట్లు కేటాయించింది. ప్రతి గదికి గాలి, వెలుతురు వచ్చేలా పెద్ద కిటికీలు అమరుస్తున్నారు. కొన్ని చోట్ల ఏడు అడుగుల వెడల్పు, పొడవుతో కిటికీలు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని వైపుల నుంచి సూర్యరశ్మి, గాలి వచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి అంతస్తు నిర్మాణం పూర్తయింది. విద్యుత్‌, ఫ్లోరింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌, మొదటి అంతస్తు కలిపి 164 దుకాణాలు నిర్మిస్తారు. 1.40లక్ష చదరపు అడుగులతో నిర్మాణాలుంటాయి. దుకాణాలను కూరగాయలు, పండ్లు, పూలు, చికెన్‌, కిరాణం, ఇతర నిత్యావసర వస్తువుల విక్రయానికి కేటాయిస్తారు. జిల్లా కేంద్రంలో రోడ్ల వెడల్పు సందర్భంగా పూర్తిగా దుకాణాలు కోల్పోయిన బాధితులకు ఈ మార్కెట్‌లో దుకాణాలు కేటాయిస్తారు. తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునేలా మార్కెట్‌ను డిజైన్‌ చేశారు. 


ఆదివారం వస్తే.. అంతా రోడ్డుపైనే  

జిల్లా కేంద్రంలో చికెన్‌, మటన్‌, చేపల దుకాణాలు ప్రత్యేకంగా లేవు. కుడకుడ రోడ్డులో ఆదివారం పెద్దసంఖ్యలో రోడ్డుపైనే గొర్రెలు, మేకలు కోసి మాంసాన్ని విక్రయిస్తున్నారు. అక్కడి వాతావరణం అపరిశుభ్రంగా ఉంటోంది. ప్రతి గొర్రె, మేకకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నా పశువుల డాక్టర్‌, శానిటరీ సిబ్బందికి కూడా కష్టమైన పనే. అదే ఒకే దగ్గర అన్ని విక్రయాలు ఉంటే నాణ్యమైన మాంసం కూడా ప్రజలకు అందుతుంది. ఈ ఏడాది దసరా నాటికి ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను పూర్తి చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా ఉండే భవనాలకు రేటింగ్‌ ఇస్తుంది. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌కు ప్లాటినం రేటింగ్‌ వస్తే కేంద్ర ప్రభుత్వం రూ.5కోట్లు గ్రాంటుగా మంజూరు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వస్తే మరిన్ని ఆధునీకరణ పనులు చేపట్టవచ్చు. అంతేకాక 12 కంప్రెషర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపారు. దీంతో పాటు జర్మనీ దేశం నుంచి 9,200 చదరపు అడుగులతో సెంటర్‌ పోర్షన్‌కు 10ఎంఎం షీట్‌ను అమర్చనున్నారు. దీంతో ఉష్ణోగ్రత కేవలం 26 డిగ్రీలు మాత్రమే స్థిరంగా ఉంటుంది. ఇంటి గ్రేటెడ్‌ మార్కెట్‌ మరో రెండు నెలలో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.


మార్కెట్‌ పూర్తయితే ఎంతో సౌలభ్యం

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం పూర్తయితే వినియోగదారులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. నాణ్యమైన, పరిశుభ్రమైన కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం లభిస్తాయి. అంతేగాక ప్రస్తుతం చాలా మంది తోపుడు బండ్ల వ్యాపారులు ఇబ్బందులు లేకుండా విక్రయాలు చేసుకోవచ్చు. దీంతో రోడ్లపై తోపుడు బండ్లు కనుమరుగై రోడ్డు విశాలంగా మారి ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పుతాయి.


పాత వ్యవసాయ మార్కెట్‌లోనే కూరగాయల మార్కెట్‌

ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్‌రోడ్డులో ఉన్న కూరగాయల మార్కెట్‌ను పాత వ్యవసాయ మార్కెట్‌లోకి మార్చారు. అంతకుముందు 20అడుగుల రోడ్డులో నే కొంతమంది కుండలు, గుడ్లు, కూరగాయల వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆ రోడ్డు మరింత ఇరుకుగా మారింది. ఈ రోడ్డుపైనే కూరగాయల విక్రయాలు సాగుతుండగా, వర్షాకాలం లో రోడ్డు మొత్తం బురదమయంగా మారుతుంది. ఆ సమయంలో వినియోగదారులు కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అంతేగాక కూరగాయల మార్కెట్‌ రోడ్డు 20అడుగుల వెడల్పు మాత్రమే ఉండటంతో తరుచూ ట్రాఫిక్‌ జాం అయ్యేది. సూర్యాపేట జనాభా లక్ష 20వేలకు చేరినా సరైన మార్కెట్‌ లేని పరిస్థితుల్లో ఈ ఇంటిగ్రేటేడ్‌ మార్కెట్‌తో ప్రయోజనం చేకూరనుంది.


దేశంలోనే ఆధునాతన మోడల్‌ మార్కెట్‌ : మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి 

దేశంలోనే ప్రభుత్వ భవనాల్లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ ఓ మోడల్‌గా నిలుస్తుంది. పనులను సాధ్యమైనంత తొందరలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. పట్టణ ప్రజలకు పరిశుభ్ర వాతావరణంలో కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం ఒకే దగ్గర అందించాలన్నదే ఈ మార్కెట్‌ లక్ష్యం. రోడ్ల వెడల్పు సందర్భంగా పూర్తిగా దుకాణాలు కోల్పోయిన వారికి ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లో దుకాణాలు కేటాయిస్తాం.


Updated Date - 2021-05-10T06:33:58+05:30 IST