ఆగమాగం

ABN , First Publish Date - 2021-07-27T05:47:24+05:30 IST

మొన్నటి వరదల కారణంగా నీటిలో నిండా మునిగిపోయిన స్థానిక జీఎన్‌ఆర్‌ కాలనీ ఆగమాగమైపోయింది. అక్కడ ఏ ఒక్కరిని కదలించినా కన్నీరే కనిపిస్తోంది.

ఆగమాగం
జిల్లా కేంద్రంలోని జీఎన్‌ఆర్‌ కాలనీలో దుస్థితి

జీఎన్‌ఆర్‌ కాలనీలో దుర్భర పరిస్థితులు
పునరుద్ధరణ కాని కరెంటు, తాగునీటి సౌకర్యాలు
సొంత డబ్బులతో ఇళ్లు శుభ్రం చేసుకుంటున్న జనం
గుండె చెదిరిన గుండెగావ్‌
సహాయక చర్యలపై బాధితుల అసంతృప్తి
ఇంకా పునరావాస కేంద్రంలోనే ఆశ్రయం

నిర్మల్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : మొన్నటి వరదల కారణంగా నీటిలో నిండా మునిగిపోయిన స్థానిక జీఎన్‌ఆర్‌ కాలనీ ఆగమాగమైపోయింది. అక్కడ ఏ ఒక్కరిని కదలించినా కన్నీరే కనిపిస్తోంది. వరద సమయంలో తాము అనుభవించిన పరిస్థితిని అలాగే కోల్పోయిన ఆస్థులు, ఇంటిలో పేరుకుపోయిన బురద లాంటి దుస్థితితో ఆ కాలనీ వాసులంతా కలవరపడుతున్నారు. ఏ ఒక్కరిని కదలించినా గుండె ద్రవించుకుపోయే స్థితి కనిపిస్తోంది. ఈ కాలనీని స్వర్ణవాగు నీరు ముంచెత్తి ఐదురోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు సహాయక, పునరావాస చర్యలు పూర్తి కాలేదు. దాదాపు 45కు పైగా ఇళ్లు నీట మునిగి బురదమయమైపోయాయి. ఈ ఇళ్ల నుంచి నీరంతా ఇంకిపోయినప్పటికీ ఒక్కో ఇంట్లో ఐదారు అడుగుల వరకు బురద నిండిపోయింది. మొదటి రెండురోజులు ఈ బురదను తొలగించేందుకు మున్సిపల్‌ సిబ్బంది సహాయపడ్డప్పటికీ ఆ తరువాత ఇళ్ల యజమానులే బురదను తొలగించుకున్నారు. అలాగే బురద, చెత్తచెదారం పేరుకుపోవడంతో కాలనీ అంతా దుర్గంధమయమైపోయింది. దాదాపు 200 మందికి పైగా స్థానికులు క్షతగాత్రులయ్యారు. ఈ వరద తాకిడితో ఇళ్లలోని ఫర్నీచర్‌, నిత్యావసర సరుకులనీ కూడా తడిసిముద్దైపోయి పనికి రాకుండా అయ్యాయి. ఈ నష్టం విలువ రూ.2.70 కోట్లకు పైగా ఉంటుందని స్వయంగా అధికారులే వెల్లడిస్తున్నారు. కాగా కాలనీలో గత ఐదురోజుల నుంచి కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయిది. ఈ కాలనీలో కరెంటు పునరుద్దరణకు మరో ఇరవై రోజులకు పైగా పట్టవచ్చని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. దీంతో పాటు తాగునీటి సౌకర్యం కూడా అందుబాటులో లేకుండాపోయింది. ప్రస్తుతం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ట్యాంకర్లతో తాత్కాలికంగా తాగునీరును అందిస్తున్నారు. ఇక్కడి ఇళ్లలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు మోటార్లు పెట్టి నీటిని వినియోగిస్తున్నారు.  ఇదిలా ఉండగా భైంసా మండలంలోని గుండెగావ్‌ క్షతగాత్రులంతా ఇప్పటికీ భైంసా పట్టణంలోని ఎస్సీ హాస్టల్‌ భవనంలో ఆశ్రయం పొందుతున్నారు. దాదాపు 200 మందికి పైగా బాధితులు ప్రస్తుతం ఇక్కడే తాత్కాలికంగా ఉంటు న్నారు. పల్సీకర్‌ రంగారావు ప్రాజెక్ట్‌ బ్యాక్‌వాటర్‌ కారణంగా ప్రతీయేటా గుండెగావ్‌ గ్రామం నీట మునుగుతున్న సంగతి తెలిసిందే. మళ్లీ ఈ సారి కూడా ఆ గ్రామాన్ని వరదనీరు ముంచేసింది. అధికారులు యధావిధిగా భైంసా పట్టణంలో భాధితులందరికీ తాత్కాలిక పునరావాసం కల్పించి చేతులు దులుపుకున్నారు. ఈ గ్రామస్థుల సమస్యను యేళ్ల నుంచి పరిష్కరించకుండా అటు పాలకులు, ఇటు అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తుండడంతోనే ఈ సమస్య తీవ్రమవుతోంది. కాగా పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వారందరికీ పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కాలనీ తేరుకోవడం ఇప్పట్లో కష్టమేకాగా జీఎన్‌ఆర్‌ కాలనీ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు లేవంటున్నారు. ఇప్పటికే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ ఈ కాలనీ సందర్శించి పునరావాస సహాయక చర్యలను పరిశీలించారు. అయితే తాత్కాలికంగా సౌకర్యాలు సమకూర్చే ప్రయత్నాలు చేసినప్పటికీ నిండా నీటమునిగిన కారణంగా ఈ కాలనీని కష్టాలు వీడే పరిస్థితి కనిపించడం లేదు. నీటమునిగిన కారణంగా కాలనీ ప్రజలంతా అదే రోజూ తమ ఇళ్లను విడిచివెళ్లారు. తరువాత ఇళ్లలో పేరుకుపోయిన బురద, చెత్తచెదారం కారణంగా ప్రస్తుతం ఆ ఇళ్లలో నివసించే పరిస్థితులు లేవు. ప్రస్తుతం వీరంతా తమ ఇళ్లలో పేరుకుపోయిన బురద, చెత్త చెదారాన్ని తొలగించేందు కోసం తంటాలు పడుతున్నారు. ఇండ్లలోని ఫర్నీచర్‌, నిత్యావసర వస్తువులు, ఇతర సామాగ్రి అంతా వరదనీటి ధాటికి తడిసిపోయి చెల్లాచెదురయ్యాయి. ఏ ఒక్క వస్తువు కూడా పనికిరాని దుస్థితిలో ఉన్నాయి. అలాగే ఇక్కడి విద్యుత్‌ స్తంభాలు, కరెంటు తీగలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు పూర్తిగా నేలకొరిగిన కారణంగా విద్యుత్‌ సరఫరా పునరుద్దరణ ఇప్పట్లో సాధ్యమయ్యేట్లు కనిపించడం లేదు. అలాగే తాగునీటి సరఫరాకు కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. కాలనీ అంతా ఎటుచూసినా చెల్లా చెదురుకావడమే కాకుండా అందరిలో స్మశానవైరాగ్యమే కనిపిస్తోంది. దయనీయ స్థితిలో గుండెగావ్‌ఇదిలా ఉండగా భైంసా మండలంలోని గుండెగావ్‌ దుస్థితి మరింత దయనీయంగా మారింది. ఇక్కడి బాధితులందరికీ భైంసా పట్టణంలోని ఎస్సీ హాస్టల్‌లో పునరావాసం కల్పిస్తున్నారు. దాదాపు ఐదురోజుల నుంచి వీరంతా ఇక్కడే ఆశ్రయం పొందుతూ బిక్కుబిక్కుమంటూ గడు
పుతున్నారు. ఈ పునరావాస కేంద్రంలో ఆశించిన మేరకు సౌకర్యాలు లేని కారణంగా బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. గత పదేళ్ల నుంచి తమకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించాలంటూ ఈ గ్రామస్థులంతా డిమాండ్‌ చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల చుట్టూ తమ సమస్యను పరిష్కరించాలని వీరంతా తిరుగుతున్నప్పటికీ వీరిగోడు అరణ్యరోదనగానే మారుతోంది. దాదాపు 200 కుటుంబాలు ముంపు సమస్యతో ప్రతియేటా తల్లడిల్లిపోతున్నాయి. ప్రభుత్వం గుండెగావ్‌ గ్రామ సమస్యను పరిష్కరించకుండా జాప్యం చేస్తుండడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. సహాయక చర్యలపై తొలగని అసంతృప్తిఇటు పట్టణంలోని జీఎన్‌ఆర్‌ కాలనీతో పాటు ఇతర కాలనీల్లోనూ అలాగే గుండెగావ్‌ ముంపు బాధితులకు అందుతున్న సహాయక చర్యలపైనా అసంతృప్తి వ్యక్తమవుతోందంటున్నారు. బాధితులకు కంటి తడుపు చర్యగా సహాయాన్ని అందిస్తూ చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. జీఎన్‌ఆర్‌ కాలనీతో పాటు గుండెగావ్‌ గ్రామ బాధితులకు అధికారులు 25 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని ఉచితంగా అందించినప్పటికీ ఇతర నిత్యావసర సరుకులను మాత్రం పంపిణీ చేయకపోవడం పట్ల వ్యతిరేకత నెలకొంటోంది. జీఎన్‌ఆర్‌ కాలనీలో సర్వం కోల్పోయిన వారిని ఆర్థికంగా ఆదుకునే చర్యలు ఇప్పటికీ మొదలుకాకపోవడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి. జీఎన్‌ఆర్‌ కాలనీ వాసులు సర్వం కోల్పోయి తాత్కాలికంగా తమ బందువుల వద్ద ఆశ్రయం పొందుతున్నారు. ఎన్నో ఆశలతో అప్పులు చేసి కట్టుకున్న తమ ఇళ్లన్నీ బురదపాలు కావడం పట్ల వారంతా తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. ప్రభుత్వం తమను వెంటనే ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు.

Updated Date - 2021-07-27T05:47:24+05:30 IST