దేశం వీడినా తొలగని తాలిబన్ల భయం: భారత్ వచ్చిన కుటుంబం కుటుంబం ఆవేదన!

ABN , First Publish Date - 2021-08-25T12:00:43+05:30 IST

అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక...

దేశం వీడినా తొలగని తాలిబన్ల భయం: భారత్ వచ్చిన కుటుంబం కుటుంబం ఆవేదన!

న్యూఢిల్లీ: అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు యావత్ ప్రపంచాన్నీ నివ్వెరపోయేలా చేస్తున్నాయి. తాలిబన్ల పేరెత్తితేనే వణికిపోతున్న అఫ్ఘాన్ పౌరులు... తమ ప్రాణాలు నిలబెట్టుకునేందుకు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇదేవిధంగా భారత్ వచ్చిన ఒక అఫ్ఘాన్ కుటుంబం మీడియా ముందు తమ ఆవేదనను వెళ్లగక్కింది. 40 ఏళ్ల మెహ్మత్ ఖాన్ తన భార్య, ఇద్దరు కుమార్తెలను తీసుకుని కాబుల్ నుంచి భారత్ వచ్చేశారు. 


ప్రస్తుతం పరిచయస్తుల ఇంటిలో తల దాచుకుంటున్నారు. అయితే అఫ్ఘానిస్తాన్ నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు వణికిపోతున్నారు. కోల్‌కతాలోని హౌరాలో ఉంటున్న ఈ కుటుంబం నాటి భయంకర దృశ్యాలను మరచిపోలేకపోతోంది. తన భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలను తీసుకుని తాలిబన్ల కంటపడకుండా భారత్ వచ్చిన వైనాన్నిమెహ్మత్ ఖాన్ వివరించారు. గతవారం తాము కాబుల్‌లోని భారత రాయబార కార్యాలయం అందించిన సాయంతో భారత్ చేరుకున్నాం. కాబుల్‌లో తాలిబన్లు తమ ఇంటిని ధ్వంసం చేశారని, దీంతో ఇక అక్కడ ఉండలేక కట్టుబట్టలతో తమ దగ్గరున్న రూ. 10 వేలతో కోల్‌కతా చేరుకున్నామన్నారు. కాబుల్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అక్కడి పరిస్థితులను మా పిల్లలు ఇంకా మరిచిపోలేకపోతున్నారు. అవి గుర్తుకువచ్చి రోజూ రాత్రుళ్లు ఏడుస్తున్నారు. తాము భారత్ వచ్చాక కాస్త ఊపిరి పీల్చుకున్నామని, అయితే ఇక్కడ కూడా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తాలిబన్లకు చెందిన మనుషులు తమను వెంటాడుతున్నారని, దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు. అయినా పోలీసులు తమను పట్టించుకోవడం లేదని మెహ్మత్ ఖాన్ వాపోయారు. తాము తిరిగి అఫ్ఘానిస్తాన్ వెళ్లబోమని మెహ్మత్ ఖాన్ చెప్పారు.

Updated Date - 2021-08-25T12:00:43+05:30 IST