ఇంకా తెరుచుకోని విశ్వవిద్యాలయాలు... కుంటి సాకులు చెప్తున్న తాలిబన్లు...

ABN , First Publish Date - 2021-12-27T18:24:37+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో విశ్వవిద్యాలయాలను ఇంకా పునఃప్రారంభించలేదు

ఇంకా తెరుచుకోని విశ్వవిద్యాలయాలు... కుంటి సాకులు చెప్తున్న తాలిబన్లు...

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లో విశ్వవిద్యాలయాలను ఇంకా పునఃప్రారంభించలేదు. దీనికి కారణం ఆర్థిక సంక్షోభం అని తాలిబన్లు చెప్తున్నారు. ఆగస్టు 15న ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు బాలబాలికలు కలిసి చదువుకునే విధానంపై నిషేధం విధించారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినీ, విద్యార్థులు ఒకే తరగతి గదిలో చదువుకోవడాన్ని అనుమతించేది లేదని స్పష్టం చేశారు. 


తాలిబన్ ఉన్నత విద్యా శాఖ మంత్రి అబ్దుల్ బకీ హక్కానీ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, బాలికల కోసం ప్రత్యేకంగా తరగతులను నిర్వహించేందుకు తమకు అదనపు బడ్జెట్, మరింత సమయం అవసరమని చెప్పారు. అదనంగా లెక్చరర్లను కూడా నియమించుకోవలసి ఉందని తెలిపారు. 


తాలిబన్ సదాచార ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో మహిళలు రోడ్డు మార్గంలో 72 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ఒంటరిగా ప్రయాణించడానికి వీల్లేదని తెలిపింది. సన్నిహిత కుటుంబ పురుష బంధువు తోడుగా ఉంటేనే రోడ్డు మార్గంలో మహిళల ప్రయాణాలకు అనుమతించాలని ట్రావెల్ ఏజెన్సీలను ఆదేశించింది. టీవీల్లో మహిళలు నటించిన నాటకాలను ప్రసారం చేయరాదని ఆదేశించింది. టీవీ మహిళా ప్రజెంటర్లు తప్పనిసరిగా హెడ్‌స్కార్ఫ్ ధరించాలని తెలిపింది.


Updated Date - 2021-12-27T18:24:37+05:30 IST