
కువైత్ సిటీ: కరోనా కారణంగా దాదాపు 18 నెలలు మూతపడ్డ భారతీయ పాఠశాలలు ఆదివారం తెరుచుకున్నాయి. కువైత్ ప్రభుత్వ నిబంధనలను అనుసరించి తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం విద్యార్థులు ముఖానికి మాస్కు, సామాజిక దూరం పాటిస్తూ తరగతి గదులకు హాజరయ్యారు. ఇక స్కూల్ బస్సులను 50 శాతం సామర్థ్యంతో మాత్రమే నడపాలనే నిబంధన ఉండడంతో చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలను సొంత వాహనాల్లో పాఠశాలలకు తీసుకెళ్లి దించిన దృశ్యాలు కనిపించాయి. పాఠశాల ప్రాంగణాల్లోకి ప్రవేశించడానికి ముందే పిల్లలకు టెంపరేచర్ చెకింగ్ నిర్వహించాయి స్కూల్ యాజమాన్యాలు. ఇలా పూర్తి పకడ్బందిగా పిల్లలను తరగతులకు అనుమతించాయి.
చాలా రోజుల తర్వాత తిరిగి ప్రత్యక్ష తరగతులకు హాజరవుతుండడంతో పిల్లలు చాలా ఉత్సాహంగా కనిపించారని కువైత్‌లోని భావన్స్లో ఉన్న ఇండియన్ ఎడ్యుకేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రేమ్‌కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం కొంతమంది పిల్లలకు మాత్రమే ప్రత్యక్ష తరగతులకు అవకాశం కల్పించామని, మిగతా వారు ఇంటి నుంచి ఆన్లైన్ ద్వారా క్లాసులు వింటున్నారని ఆయన పేర్కొన్నారు. అన్ని పాఠశాలలు విద్యార్థులకు ముఖానికి మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం వంటి కరోనా నిబంధనలను తప్పనిసరి అమలు చేశాయని ఈ సందర్భంగా ప్రేమ్‌కుమార్ చెప్పుకొచ్చారు. అలాగే విద్యార్థులు స్కూల్ ఆవరణాల్లోకి ప్రవేశించడానికి ముందే వారి శరీర ఉష్ణోగ్రతలను చెక్ చేసిన తర్వాతే తరగతి గదులకు అనుమతించడం జరిందన్నారు.
చాలా పాఠశాలలు ఇంటర్మీడియట్ తరగతులను అక్టోబర్ 3 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించాయి. ఇక 12 ఏళ్లకు పైబడిన విద్యార్థులు ఎవరైతే ప్రత్యక్ష తరగతులకు హాజరవుతున్నారో వారు తప్పనిసరిగా టీకా తీసుకోవాలి. లేదా విద్యార్థులు వీక్లీ పీసీఆర్ టెస్టు సర్టిఫికేట్ చూపించడం తప్పనిసరి అని ఆ దేశ ఆరోగ్యశాఖ అక్కడి స్కూల్ యాజమాన్యాలను ఆదేశించింది. కాగా, దాదాపు ఏడాదిన్నర తర్వాత తిరిగి పాఠశాలకు రావడంతో చాలా మంది విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.