60ఏళ్ల వయసులో ఈ జంటకు పెళ్లి.. 40ఏళ్ల క్రితమే ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. కానీ..

ABN , First Publish Date - 2022-01-20T21:17:54+05:30 IST

ఆ భార్యభర్తలకు ప్రస్తుతం 60ఏళ్లు. 40ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో వారికి ఓ కూతురు కూడా జన్మించింది. కూతురికి కూడా పెళ్లి చేసిన ఆ దంపతులు.. లేటు వయసులో మరోసారి సంప్రదాయబ

60ఏళ్ల వయసులో ఈ జంటకు పెళ్లి.. 40ఏళ్ల క్రితమే ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. కానీ..

ఇంటర్నెట్ డెస్క్: ఆ భార్యభర్తలకు ప్రస్తుతం 60ఏళ్లు. 40ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో వారికి ఓ కూతురు కూడా జన్మించింది. కూతురికి కూడా పెళ్లి చేసిన ఆ దంపతులు.. లేటు వయసులో మరోసారి సంప్రదాయబద్దంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి సుమారు 100 మంది అతిథులు హాజరయ్యారు. అయితే, వారి పెళ్లి స్థానికంగా చర్చనీయాంశం అయింది. అసలు పెళ్లైన 40ఏళ్లకు ఈ జంట మళ్లీ ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని వడ్లిపడా ప్రాంతానికి చెందిన బాబు, తలైపడా ప్రాంతానికి చెందిన కంటా 4 దశాబ్దాల క్రితం ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇళ్లలో చెప్పి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే.. ఇద్దరూ వేరు వేరు కులాలకు చెందిన వాళ్లు కావడంతో పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదురించి వాళ్లిద్దరూ ప్రేమవివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత బాన్స్వారా ప్రాంతంలో నివసిస్తున్న ఈ దంపతులు సీమా‌ అనే అమ్మాయికి జన్మనిచ్చారు. ఆమెను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. అనంతరం రాజు అనే వ్యక్తితో వివాహం జరిపించారు. 



అయితే.. పెళ్లి చేసుకుని 40ఏళ్లైనప్పటికీ తమ పెళ్లి సంప్రదాయబద్దంగా జరగలేదని బాబు, కంటా బాధపడుతూ ఉండేవారు. ఈ క్రమంలో వాళ్ల బాధను కూతురు, అల్లుడు అర్థం చేసుకున్నారు. లేటు వయసులో వారిద్దరికీ సంప్రదాయబద్దంగా పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో 60ఏళ్ల వయసులో దాదాపు వంద మంది అతిథుల సమక్షంలో ఈ వృద్ధ దంపతులు ఏడు అడుగులు వేసి సంప్రదాయబద్దంగా మరోసారి వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి కంటా పుట్టింటి తరఫు వాళ్లు కూడా హాజరయ్యారు. కాగా.. ఈ వృద్ధుల పెళ్లి అంశం స్థానికంగా చర్చనీయాంశం అయింది.




Updated Date - 2022-01-20T21:17:54+05:30 IST