నుపుర్ శర్మ వ్యాఖ్యల వివాదం.. భారత్‌పై దాడులు తప్పవంటూ ఇస్లామిక్ స్టేట్ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-06-16T22:49:42+05:30 IST

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల వివాదంపై ఇప్పుడు కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ISIS) కూడా

నుపుర్ శర్మ వ్యాఖ్యల వివాదం.. భారత్‌పై దాడులు తప్పవంటూ ఇస్లామిక్ స్టేట్ హెచ్చరిక

న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల వివాదంపై ఇప్పుడు కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ISIS) కూడా స్పందించింది. భారత్‌‌పై దాడులు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. ఐఎస్‌కేపీ దాని మౌత్‌పీస్ అయిన ఏఐఏజైమ్ ఫౌండేషన్ (AIAzaim Foundation) ఓ న్యూస్ బులెటిన్ సర్వీస్‌ను ప్రారంభించింది. దాని తొలి న్యూస్ బులెటిన్ భారత్‌లో దైవదూషణపైనే దృష్టి సారించడం గమనార్హం. 


స్వతంత్ర న్యూస్ హ్యాండిల్ అయిన ఖొరాసన్ డైరీ ట్విట్టర్ ప్రకారం.. న్యూస్ బులెటిన్ తొలి వీడియోలో బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ, ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్‌తో కూల్చిన ముస్లింల ఇళ్ల గురించి ప్రస్తావించింది. అలాగే, భారతీయులైన ఐఎస్‌కేపీ ఆత్మాహుతి బాంబర్లు గత ప్రకటనలను చూపించింది. అందులో వారు మాట్లాడుతూ.. భారత్‌లో ఎక్కడ వీలైతే అక్కడ దాడులు చేస్తామని హెచ్చరించారు. మహ్మద్ ప్రవక్తను అవమానించినందుకు గాను హిందువులను లక్ష్యంగా చేసుకుని ప్రతీకారం తీర్చుకుంటామని ఐఎస్‌కేపీ హెచ్చరించింది.  


మరో ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా ఇన్ సబ్‌కాంటినెంట్ (AQIS) కూడా భారత్‌ను హెచ్చరించింది. మహ్మద్ ప్రవక్త గౌరవాన్ని కాపాడేందుకు ఢిల్లీ, ముంబై, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని పేర్కొంటూ ఈ నెల 6న ఓ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ, బాంబే, యూపీ, గుజరాత్‌లోని కాషాయ ఉగ్రవాదులు తమ అంతం కోసం వేచి చూస్తుండాలని అందులో పేర్కొంది. మానవత్వానికి గర్వకారణమైన ముహమ్మద్ ప్రవక్తను అవమానించిన నేరస్థులకు క్షమాభిక్ష,  క్షమాపణ ఉండవని, శాంతి, భద్రత వారిని రక్షించదు పేర్కొన్న ఆల్‌ ఖైదా.. ఖండన పదాలతో ఈ విషయం ముగిసిపోదని ఆ బెదిరింపు లేఖలో తేల్చి చెప్పింది.  

Updated Date - 2022-06-16T22:49:42+05:30 IST