వీటితో... జాగ్రత్త!

Published: Tue, 19 Jan 2021 15:33:07 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వీటితో... జాగ్రత్త!

‘‘కొవిడ్‌ ట్రీట్మెంట్‌తో గండం గట్టెక్కాడు. హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకొనే సమయానికి తిరిగి అనారోగ్యం తిరగబెట్టింది!’’... ఇలాంటి మాటలు కొవిడ్‌ నుంచి కోలుకున్న కొంతమంది గురించి వింటున్నాం! మెదడులో రక్తస్రావం జరగడం, లేదా రక్తం గడ్డ కట్టడం లాంటి ప్రాణాంతక పరిణామాలు కొవిడ్‌ తర్వాత కూడా వెంటాడుతున్నాయి! ఇందుకు కారణం.... కొవిడ్‌ చికిత్స సమయంలో అందించిన మందుల ప్రభావమా? అయితే కొవిడ్‌ను సమర్థంగా అంతం చేసిన మందులు ఆరోగ్యాన్ని కూడా అంతే కుదేలు చేస్తాయా? అసలు కారణం ఏమై ఉంటుంది? కొవిడ్‌ తదనంతర ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?


లంగ్స్‌లో బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌

కొవిడ్‌ సోకిన 55 ఏళ్ల గోవింద్‌ చికిత్సతో పూర్తిగా కోలుకున్నాడు. అయితే కొంత కాలానికి దగ్గు, ఆయాసం తిరగబెట్టాయి. తిరిగి ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే ఊపిరితిత్తులకు బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిందని తేలింది. పూర్వం లేని బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ కొత్తగా తలెత్తడానికి కారణం కొవిడ్‌ చికిత్స సమయంలో గోవింద్‌ తీసుకున్న స్టెరాయిడ్లే కారణం. 


మధుమేహం ఉన్న వ్యక్తికి కొవిడ్‌ సోకినప్పుడు అత్యథిక మోతాదులో స్టెరాయిడ్‌ డోసులు నాలుగైదు రోజుల పాటు ఇవ్వడం వల్ల, ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తే అవకాశాలు ఉంటాయి. ‘సూడోమొనాస్‌’ అనే ఈ ఇన్‌ఫెక్షన్‌తో ఊపిరితిత్తుల్లో రంధ్రం ఏర్పడుతుంది. ఇలా పాడైన ఊపిరితిత్తిని సర్జరీ చేసి తొలగించవలసి ఉంటుంది.


కొవిడ్‌ కేర్‌

కొవిడ్‌ వైరస్‌ శరీరంలోకి చొరబడినప్పుడు శరీరం స్పందించే తీరు వ్యక్తిని బట్టి, అప్పటికే వారికి ఉన్న ఇతరత్రా ఆరోగ్య సమస్యలను బట్టి కొవిడ్‌ చికిత్స మారుతూ ఉంటుంది. కొవిడ్‌ బాధితుల్లో తలెత్తే ఇన్‌ఫ్లమేషన్‌ తీవ్రతల్లో కూడా హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి. వైరస్‌ సోకిన తొలినాళ్లకూ, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమై ఆస్పత్రిపాలైన నాటికీ శరీరానికి జరిగే నష్టంలో కూడా తేడాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ అంశాలన్నింటి ఆధారంగా అవసరమైన అదనపు పరీక్షలు కూడా చేసి, చికిత్సను అంచనా వేయవలసి ఉంటుంది. కానీ కొంతమందికి అవసరం లేకపోయినా అత్యధిక స్టెరాయిడ్లు, రక్తం పలుచన చేసే బ్లడ్‌ థిన్నర్స్‌ ఇవ్వడం మూలంగా కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత ఆ మందుల తాలూకు దుష్ఫరిణామాలు ఎదుర్కోక తప్పడం లేదు. ఈ దుస్థితి నుంచి తప్పించుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే అప్రమత్తంగా వ్యవహరించాలని అంటున్నారు వైద్యులు. ఎలాంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకినా మొదటి వారం రోజుల్లో శరీరంలో వైరస్‌ అపరిమితంగా పెరిగిపోతూ ఉంటుంది. ఈ సమయంలో స్టెరాయిడ్స్‌ చికిత్స అందిస్తే వైరల్‌ రెప్లికేషన్‌ వేగం మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా ఇతరత్రా ప్రాణాంతక ఫంగల్‌ లేదా బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు తలెత్తే ప్రమాదం ఉంది. రక్తస్రావం జరగడం లేదా రక్తపు గడ్డలు ఏర్పడడం లాంటి సమస్యలూ కొత్తగా తలెత్తవచ్చు. కొవిడ్‌ చికిత్సలో జరుగుతున్న పొరపాటు ఇదే! అపరిమిత స్టెరాయిడ్స్‌ వల్ల అప్పటికి ఇన్‌ఫెక్షన్‌ తగ్గినట్టు కనిపించినా, తిరిగి తీవ్ర ఇన్‌ఫెక్షన్‌తో ఐసియులో చేరే పరిస్థితి తలెత్తుతుంది. కొవిడ్‌ నుంచి కోలుకున్న రెండు నెలల తర్వాత కూడా సమస్యలు బయటపడవచ్చు.


వీటితో... జాగ్రత్త!

మెదడులో రక్తస్రావం

రమకు అధిక రక్తపోటు. చికిత్సతో కొవిడ్‌ సమర్థంగానే అదుపులోకి వచ్చినా కొద్ది రోజులకు కుడివైపు చేయి, కాలిలో బలహీనత తలెత్తింది. అంతుపట్టని ఆ కొత్త సమస్యతో రమ ఆస్పత్రికి చేరుకుని పరీక్షలు చేయించుకుంటే ఆమెకు ‘బ్రెయిన్‌ హెమరేజ్‌’ అని తేలింది. 


డీడైమర్‌, పీటీఐఎన్నార్‌, ఎపిటిటి లెవల్స్‌ అనే రక్తం గడ్డకట్టే తత్వాన్ని తెలిపే ప్రమాణాలను పరీక్షించుకుంటూ తగిన మోతాదులో యాంటీకాగ్యులెంట్‌ మందులు కొవిడ్‌ చికిత్సలో భాగంగా అందించాలి. అయితే రక్తం గడ్డకట్టే తత్వం (థ్రాంబోటిక్‌ ఫినామినన్‌ ఫ్యాక్టర్‌) ఉన్నవారికే మాత్రమే ఈ మందులు అవసరం. కానీ లేనివాళ్లకూ, అధిక రక్తపోటు కలిగినవాళ్లకూ ఈ మందులు కొనసాగించడం వల్ల రక్తస్రావ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.  కొవిడ్‌ చికిత్స సమయంలో లేదా ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత హఠాత్తుగా మెదడులో రక్తస్రావం జరగవచ్చు. దీన్నే ‘హెమరేజ్‌’ అంటారు. దీనికి ఎంత సత్వర చికిత్స అందించగలిగితే నష్టాన్ని అంత మెరుగ్గా నివారించుకోవచ్చు. ఇలా బ్రెయిన్‌ స్ర్టోక్‌ తలెత్తినవాళ్లలో శరీరంలో ఓ వైపు బలహీనత కనిపించడం, మాటల్లో తడబాటు, ఓ వైపు చేయి, కాలు బలహీనపడడం జరుగుతుంది. సర్జరీతో రక్తపు గడ్డను తొలగించడం లేదా కరిగించడం ద్వారా సమస్యను సరిదిద్దవచ్చు.


వీటితో... జాగ్రత్త!

ఊపిరితిత్తుల్లో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌!

50 ఏళ్ల లక్ష్మికి మధుమేహం ఉంది. దాంతో ఆమెకు కొవిడ్‌ తేలికగా సోకడంతో ఆస్పత్రికి పరుగుపెట్టి చికిత్స తీసుకుంది. స్టెరాయిడ్‌ ఇంజెక్షన్ల దెబ్బకు కొవిడ్‌ తోక ముడిచి పారిపోవడంతో లక్ష్మి ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకుంది. క్రమేపీ కొవిడ్‌ నుంచి కోలుకుని మునుపటిలా జీవితం కొనసాగిస్తున్న సమయంలో ఉన్నట్టుండి చలిజ్వరం, తెమడతో కూడిన దగ్గు మొదలయ్యాయి. దాంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకుంటే ఊపిరితిత్తులకు ప్రాణాంతక ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిందని తేలింది. 


మధుమేహం కలిగిన వ్యక్తులకు కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిన సమయంలో అధిక మొత్తాలో కార్టికోస్టెరాయిడ్‌ మందులు అందిస్తూ ఉంటారు. అయితే వీటిని శరీర బరువు ఆధారంగా పరిమాణాన్ని లెక్కించి (ఒక కిలో శరీర బరువుకు ఒక మిల్టీగ్రాము స్టెరాయిడ్‌) అందించాలి. దీన్ని ‘పల్స్‌ కార్టికోస్టెరాయిడ్‌ థెరపీ’ అంటారు. ఇలా క్రమపద్ధతితో కూడిన స్టెరాయిడ్‌ చికిత్సతో దుష్ప్రభావాలు లేని ఫలితాన్ని పొందవచ్చు. కానీ కొన్నిచోట్ల కొవిడ్‌ సోకిన మొదటి రెండు మూడు రోజుల్లో 500 నుంచి 1000 మిల్లీగ్రాముల స్టెరాయిడ్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలా అపరిమితంగా స్టెరాయిడ్స్‌, దీర్ఘకాలం పాటు ఇవ్వడం వల్ల, మధుమేహం ఉన్న లక్ష్మి లాంటి వారు కొవిడ్‌ తదనంతరం ‘మ్యూకార్‌మైకోసిస్‌’ అనే ప్రాణాంతక ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కొవిడ్‌ నుంచి కోలుకున్న ఒకటి లేదా రెండు నెలల వ్యవధిలో బయల్పడే ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ మోర్టాలిటీ రేటు 90%.


కాబట్టి ఈ ఇన్‌ఫెక్షన్‌ను ప్రారంభంలోనే గుర్తించడం కోసం బ్రాంఖోస్కోపీ చేసి ఊపిరితిత్తులను శుభ్రపరచి, నమూనాను పరీక్ష చేయవలసి ఉంటుంది. లేదా కళ్లెను పరీక్షించినా ఫంగస్‌ కనిపిస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ ఉందని తేలితే అది సోకిన శరీర భాగాన్ని ఆ మేరకు వెంటనే తొలగిస్తే, ఇతర శరీరావయవాలకు పాకి ప్రాణాంతకంగా మారే పరిస్థితి నుంచి తప్పించవచ్చు. కాబట్టి కొవిడ్‌ సమయంలో ఫంగస్‌ను నిర్థారించే పరీక్షలు జరపడం అవసరం. 


ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ ముక్కు, ఊపిరితిత్తుల్లో తలెత్తుతుంది. ముక్కులో ఏర్పడితే.. అడ్డంకి ఉన్నట్టనిపించడం, ఊపిరితిత్తుల్లో ఏర్పడినప్పుడు రంధ్రం లేదా ప్యాచ్‌ ఏర్పడడం జరుగుతుంది. కొవిడ్‌ చికిత్స ముగిసి ఇంటికి వెళ్లిపోయిన పది రోజుల తర్వాత విపరీతమైన చలిజ్వరం రావడం, దగ్గినప్పుడు తెమడతో పాటు తెల్లని దారాల్లాంటి ఆకారాలు కనిపించడం లాంటి లక్షణాల్ని గమనించాలి. కంటిచూపు కూడా తగ్గుతుంది. దవడలో ఫంగస్‌ పెరిగితే ఆ ప్రదేశంలో నొప్పి ఉంటుంది. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను కలవాలి.


వీటితో... జాగ్రత్త!

పిక్కల్లో నొప్పితో...

40 ఏళ్ల రమేష్‌ కొవిడ్‌ నుంచి కోలుకుని రెండు నెలలు. కొంతకాలంగా నడుస్తున్నా, విశ్రాంతిలో ఉన్నా కాలి పిక్కలో సలపరం ఇబ్బంది పెడుతోంది. పెరుగుతున్న నొప్పి గురించి పరీక్షలు చేయించుకుంటే పిక్కలోని రక్తనాళంలో రక్తం గడ్డ ఏర్పడిందని తేలింది. అదే ‘థ్రాంబోసిస్‌’. ఈ కొత్త సమస్యకు కొవిడ్‌ చికిత్సలో భాగంగా తీసుకున్న యాంటీకాగ్యులెంట్‌ మందుల ప్రభావమే కారణం!!


కొందరు రక్తం తేలికగా గడ్డకట్టే శరీర తత్వం కలిగి ఉంటారు. ఇలాంటివారికి కొవిడ్‌ సోకిన ప్రారంభంలో రక్తం గడ్డ కట్టే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వీరికి కొవిడ్‌ చికిత్సలో భాగంగా యాంటీకాగ్యులెంట్స్‌ తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ తత్వాన్ని పరీక్షలతో కనిపెట్టి యాంటీకాగ్యులెంట్స్‌ మొదలుపెట్టాలి. అలాకాకుండా కొవిడ్‌ సోకిన ప్రతి ఒక్కరికీ ఈ మందులు మొదలుపెడితే కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత దుష్ప్రభావాలు బయల్పడడం మొదలవుతుంది. మరీ ముఖ్యంగా అధిక రక్తపోటు, ఉన్నవాళ్లకు ఈ మందులు చేటు చేసే ప్రమాదం ఉంది. వీటి మూలంగా కాళ్ల పిక్కల దగ్గరి రక్తనాళాలు పూడుకుపోవడం లేదా ఊపిరితిత్తులకు రక్తం ప్రవహించే పల్మనరీ ఆర్టరీలో రక్తపు గడ్డలు ఏర్పడడం జరుగుతుంది. అధిక రక్తపోటు కలిగిన వ్యక్తులు ఈ మందులను కొవిడ్‌ చికిత్స సమయంలో, తదనంతర చికిత్సలో భాగంగా తీసుకోవడం వల్ల మెదడులో రక్తస్రావం (హెమరేజ్‌) జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. కొందరు కొవిడ్‌ బాఽధితుల్లో వ్యాధి ప్రారంభదశలో ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో యాంటీకాగ్యులెంట్స్‌ ఇవ్వడం వల్ల రక్తస్రావ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.


వీటితో... జాగ్రత్త!

కార్డియాక్‌ ఇన్‌ఫ్లమేషన్‌

కొవిడ్‌ తీవ్రతతో సంబంధం లేకుండా కొవిడ్‌ బాధితులందరిలో ఎంతో కొంత గుండె ప్రభావితం అయి ఉంటుంది. కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్న రెండు నెలల తర్వాత కూడా, ప్రతి వంద మందిలో 60 మందికి 50% గుండె ఇన్‌ఫ్లమేషన్‌ ఉంటుందని పరిశోధనల్లో తేలింది. వీరికి భవిష్యత్తులో గుండెపోటు సమస్య పొంచి ఉండే వీలుంది. కాబట్టి కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్న ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు గుండె సంబంధిత పరీక్షలు చేయించుకుంటూ అప్రమత్తంగా ఉండడం అవసరం. 


వీటితో... జాగ్రత్త!

డాక్టర్‌ హరికిషన్‌ గోనుగుంట్ల

సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్‌,

యశోద హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.