‘పరిషత్‌’ పోరు ముగిశాక విస్తరణ

ABN , First Publish Date - 2021-12-05T18:29:15+05:30 IST

రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేంద్రం పెద్దలు నిఘా పెట్టారు. మరో ఏడాదిన్నర కాలంలో ఎన్నికలు వస్తున్న తరుణంలో ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నారు. యడియూరప్పను మార్పు చేశాక పార్టీని మరింత

‘పరిషత్‌’ పోరు ముగిశాక విస్తరణ

- పలువురు మంత్రుల పనితీరుపై సర్వేలు

- విజయేంద్రకు మంత్రి గిరీ వరించేనా..? 


బెంగళూరు: రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేంద్రం పెద్దలు నిఘా పెట్టారు. మరో ఏడాదిన్నర కాలంలో ఎన్నికలు వస్తున్న తరుణంలో ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నారు. యడియూరప్పను మార్పు చేశాక పార్టీని మరింత పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రమంత్రుల పనితీరుపై రహస్య సర్వేలు జరిగినట్టు తెలుస్తోంది. మంత్రులుగా కొనసాగుతూ ఎటూ ఉపయోగం లేని కొందరిని తప్పించేందుకు ప్రణాళిక సిద్ధమైనట్టు సమాచారం. ఈనెల 10న పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి యడియూరప్ప సీఎం పదవికి దూరమయ్యాక పార్టీలో ఎటువంటి ప్రగతి కనిపించడం లేదని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో యడియూరప్ప కుమారుడు విజయేంద్రకు కేబినెట్‌లో చేర్చుకునే ఆలోచన ఉన్నట్టు సమాచారం. యడియూరప్ప ద్వారా ఓటు బ్యాంకును పటిష్టం చేసుకునేందుకు ఇదే సమయమని చివరిక్షణంలో ఏం చేసినా ప్రజలు విశ్వసించరని పార్టీ పెద్దల అభిప్రాయంగా ఉన్నట్టు సమాచారం. బసవరాజ్‌ బొమ్మై ముఖ్యమంత్రిగా నాలుగు నెలలు పూర్తి చేశారు. ఇప్పటికే మంత్రుల పనితీరుపై జరిపిన సర్వేలో 6-8 మందిపై వేటుపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యడియూరప్పకు బద్ధ శత్రువులాగా వ్యవహరించిన ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ పరిషత్‌ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మార్పులు ఉంటాయన్నారు. విస్తరణ ఖరారైందనే తీరులో వ్యాఖ్యానించారు. ఇక శనివారం దావణగెరెలో మాజీ సీఎం యడియూరప్ప కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆనెగోడలో మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే విస్తరణ జరుగుతుందని తనకు అనిపిస్తోందన్నారు. మిగిలిన వివరాలు సీఎం చెబుతారంటూ దాటవేశారు. యడియూరప్పకు ఇప్పటికే అధిష్ఠానం నుంచి స్పష్టమైన సంకేతాలు ఉంటాయని తెలుస్తోంది.

Updated Date - 2021-12-05T18:29:15+05:30 IST