Congressకు టాటా చెప్పిన Hardik చూపు BJP వైపేనా?

ABN , First Publish Date - 2022-05-18T19:00:43+05:30 IST

ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో హార్దిక్ చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. హార్దిక్‌తో పాటు బీజేపీపై యుద్ధం ప్రకటించిన ఓబీసీ ఉద్యమ నేత అల్పేష్ ఠాకూర్.. అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు కూడా..

Congressకు టాటా చెప్పిన Hardik చూపు BJP వైపేనా?

అహ్మదాబాద్: 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో Bharatiya janata party ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఛాలెంజ్ చేసిన నేత హార్దిక్ పటేల్. ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పటికీ చావుతప్పి కన్నులొట్టపడ్డంత పనైంది. దానికి ప్రధాన కారణం.. గుజరాత్‌లో కొనసాగిన పాటీదార్ ఉద్యమం. గుజరాత్‌లో రాజకీయంగా ఎక్కువ ప్రభావం ఉన్న పాటీదార్ వర్గానికి నేత అయిన హర్దిక్ పటేల్.. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించారు. అదే సమయంలో తన మద్దతు కాంగ్రెస్‌కు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో గెలవలేకపోయింది కానీ.. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి మోదీ దేశ ప్రధాని అయ్యాక జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు (2017) కావడంతో బీజేపీ మెజారిటీపై చాలా అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను తలకిందులు చేసి స్వల్ప మెజారిటీతో బీజేపీ గట్టెక్కింది.


ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో హార్దిక్ చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. హార్దిక్‌తో పాటు బీజేపీపై యుద్ధం ప్రకటించిన ఓబీసీ ఉద్యమ నేత అల్పేష్ ఠాకూర్.. అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు కూడా. హార్దిక్ రాకడే ఆలస్యం అంటూ ఎన్నో ఊహగానాలు వచ్చాయి. వాటికి అనుగుణంగానే 2019 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మూడేళ్లు గడిచి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలలు ఉందనగా పార్టీకి రాజీనామా చేశారు.


అయితే హార్దిక్ చూపెటువైపు మొగ్గుతోందని ఇప్పటికే విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయముందుకే బీజేపీలోకి వెళ్లడానికి హార్దిక్‌కు లైన్ క్లియర్ అయిందని, తొందరలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కమలం తీర్థం పుచ్చుకుంటారని అన్నారు. ఇందుకు సంకేతాలు కూడా బలంగానే ఉన్నాయి. బీజేపీని ఆరేళ్లుగా తీవ్రంగా విమర్శిస్తూ వచ్చిన హార్దిక్.. కొద్ది రోజుల క్రితం బీజేపీ నేతలను పొగిడారు. అదే సమయంలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు పోటీ నిలబడేంద రాజకీయ పార్టీలు లేవు. ఆప్ లాంటి పార్టీలు రాష్ట్రంలో ఎదగడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఇప్పట్లో ఆ రెండు జాతీయ పార్టీలను ఎదుర్కొనేంత స్థాయిలో లేవు. కాంగ్రెస్‌ను కాదనుకున్న హార్దిక్.. ఏదైనా రాజకీయ వేదిక ఎంచుకోవాలనుకుంటే బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని అంటున్నారు.

Updated Date - 2022-05-18T19:00:43+05:30 IST