Yatra politics: ఇది పాదయాత్రల సీజన్... రాహుల్ యాత్రకు మరో రెండు అదనం

ABN , First Publish Date - 2022-10-03T22:07:37+05:30 IST

ఒక్కో పొలిటికల్ సీజన్‌లో ఒక్కో తరహా ప్రచారానికి రాజకీయ పార్టీలు శ్రీకారం చుడుతుంటాయి. ఇప్పుడు పాదయాత్రల..

Yatra politics: ఇది పాదయాత్రల సీజన్... రాహుల్ యాత్రకు మరో రెండు అదనం

న్యూఢిల్లీ: ఒక్కో పొలిటికల్ సీజన్‌లో ఒక్కో తరహా ప్రచారానికి రాజకీయ పార్టీలు శ్రీకారం చుడుతుంటాయి. ఇప్పుడు పాదయాత్రల (Padayatras) సీజన్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'భారత్ జోడోయాత్ర' (Bharat jodo yatra)కు తాజాగా మరో రెండు యాత్రలు అదనం కావడంతో మునుముందు మరింత మంది ఇదే బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.


కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ 3,570 కిలోమీటర్ల మేర పాదయాత్రను రాహుల్ గాంధీ గత నెలలలో చేపట్టగా, అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకుని ఒడిశా, బీహార్‌లోనూ పాదయాత్రలు మొదలయ్యాయి. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్ (BJD) 'జన్ సంపర్క్ పాదయాత్ర'ను ఆదివారం భువనేశ్వర్‌ నుంచి ప్రారంభించింది. లింగరాజ్ ఆలయం నుంచి ఈ మాస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌ను నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. ఒడిశా సర్వతోముఖాభివృద్ధికి పార్టీ నేతలు, కార్యకర్తలు పునరంకితం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కాగా, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం గాంధీ జయంతి నాడే బీహార్‌లోని వెస్ట్‌ చంపరాన్ వద్ద నున్న గాంధీ ఆశ్రమం నుంచి 3,500 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.


రీఎంట్రీ కోసమేనా?

రాజకీయాల్లోకి పునఃప్రవేశం చేయాలని (రీఎంట్రీ) ప్రశాంత్ కిషోర్ ఆశిస్తున్నందునే ఈ పాదయాత్రకు ఆయన శ్రీకారం చుట్టారని పరిశీలకుల అంచనాగా ఉంది. ఈ యాత్రలో భాగంగా ప్రతి పంచాయతీ, బ్లాక్‌లలో పీకే, ఆయన మద్దతుదారులు పర్యటించి ప్రజలను నేరుగా కలుసుకోనున్నారు. వీరి యాత్ర పూర్తి చేయడానికి 12 నుంచి 15 మాసాలు పట్టే అవకాశాలు ఉన్నాయి. మహాత్మాగాంధీ 1917లో తొలి సత్యాగ్రహ ఉద్యమాన్ని భితిహార్వా గాంధీ ఆశ్రమం నుంచి ప్రారంభించగా, పీకే సైతం ఇక్కడి నుంచే తన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్ర మార్గంలో ఆయన, ఆయన మద్దతుదారులు ప్రజలను కలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.


రాహుల్ యాత్ర దేశ రాజకీయాలను మలుపు తిప్పుతుందా?

కాగా, రాహుల్ గాంధీ పాదయాత్ర తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ముగించుకుని కర్ణాటకలో జరుగుతోంది. ఆయన చేపట్టిన పాదయాత్ర ఆదివారంతో 25వ రోజుకు చేరుకుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రజలను నేరుగా కలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ జరుపుతున్న అతిపెద్ద పాదయాత్ర ఇదే కావడం విశేషం. ఈ పాదయాత్రతో దేశ రాజకీయాలు మలుపుతిరిగే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ అంచనాగా ఉంది. దేశ రాజకీయాల్లో ఇది ''ట్రాన్స్‌ఫర్మేషనల్  మూమెంట్'' అని, పార్టీ పునరుజ్జీవనానికి ఇదో కీలకమైన ముందడుగని ఆ పార్టీ నేతలు బలంగా చెబుతున్నారు.


యాత్రా రాజకీయాలు కొత్తేమీ కాదు...

భారత రాజకీయాల్లో పాదయాత్రలనేవి కొత్తేమీ కాదు. గతంలోనూ పలు పాదయాత్రలు సాగాయి. కొన్ని ఆశించిన ఫలితాలను అందించగా, మరికొన్ని సాదాసీదాగా నిలిచాయి. 1983లో మాజీ ప్రధానమంత్రి, జనతా పార్టీ నేత చంద్రశేఖర్ కన్యాకుమారి నుంచి 'భారత్ యాత్ర' చేపట్టారు. జనవరి 6న చేపట్టిన పాదయాత్ర ఆరు నెలల తర్వాత ఢిల్లీకి చేరుకోవడంతో ముగిసింది. గ్రామగ్రామాన చంద్రశేఖర్ పర్యటించి ప్రజలతో సత్సంబంధాలు సాగించారు. ఆయన యాత్ర చాలా పెద్ద సక్సెస్ అని పరిశీలకులు అభిప్రాయపడినప్పటికీ, ఆ తరుణంలోనే అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు గురికావడంతో 1984 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పాదయాత్ర ప్రభావం పెద్దగా చూపలేదు. కాంగ్రెస్ పార్టీ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.


కాగా, 1985లో అప్పటి ప్రధాని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ ముంబైలో జరిగిన ఏఐసీసీ ప్లీనరీ సెషన్‌లో ''సందేశ్ యాత్ర''ను ప్రకటించారు. ఆయన పిలుపును అందుకుని ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవా దళ్ దేశవ్యాప్త పర్యటన చేపట్టింది. ప్రదేశ్ కాంగ్రెస్ క మిటీలు (పీసీసీలు), పార్టీ నేతలు ఏకకాలంలో ముంబై, కశ్మీర్, కన్యాకుమార్, ఈశాన్య ప్రాంతాల నుంచి పాదయాత్రలు చేపట్టారు. నాలుగు నెలల పాటు సాగిన ఈ పాదయాత్ర ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో ముగిసింది.


అడ్వాణి రథయాత్రతో ఊపందుకున్న రామాలయ ఉద్యమం

కాగా, 1990లో బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అడ్వాణి చేపట్టిన రథయాత్రతో అయోధ్యలో రామాలయ ఉద్యమం ఒక్కసారిగా ఊపందుకుంది. సెప్టెంబర్ 1990లో యాత్ర ప్రారంభమై 10,000 కిలోమీటర్లు పర్యటించి యూపీలోని అయోధ్యకు అక్టోబర్ 30న చేరుకోవడంతో ముగిసింది. నార్త్ బీహార్‌లోని సమస్టిపూర్‌ వద్ద యాత్ర ఆగినప్పుడు అడ్వానీ అరెస్టయ్యారు. భారతీయ జనతా పార్టీ ఆశించిన ఎన్నికల, సైద్ధాంతిక ఆశయాలకు అడ్వానీ రథయాత్ర ఊతంగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ చెబుతుంటారు. ఆ తర్వాత కూడా పలు యాత్రలను రాజకీయ పార్టీలు చేపట్టాయి. అప్పటి బీజేపీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి సారథ్యంలో 1991లో ఏక్తా యాత్ర, కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2003 ఏప్రిల్‌లో చేపట్టిన 1,400 కిలోమీటర్ల పాదయాత్ర, 2004లో అడ్వాణీ చేపట్టిన భారత్ ఉదయ్ యాత్ర, 2017లో వైఎస్‌ఆర్‌సీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన యాత్ర ఈ కోవలోనే చెప్పుకోవచ్చు.


ఏతావాతా, ప్రస్తుతం నడుస్తున్న పాదయాత్రలతో ఆయా పార్టీలు, నేతలు ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయా లేదా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. కానీ, పాదయాత్రల సీజన్ మళ్లీ తెరపైకి వచ్చిందని మాత్రం నిశ్చయంగా చెప్పగలం.

Updated Date - 2022-10-03T22:07:37+05:30 IST