Aeroflot: రెండు నెలల తర్వాత భారత్, రష్యా మధ్య విమాన సర్వీసులు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-06T14:42:26+05:30 IST

రష్యా ప్రభుత్వం నడుపుతున్న ఏరోఫ్లాట్ (Aeroflot) నేటి(శుక్రవారం) నుంచి భారత్‌కు విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించనుంది.

Aeroflot: రెండు నెలల తర్వాత భారత్, రష్యా మధ్య విమాన సర్వీసులు ప్రారంభం

ఇంటర్నెట్ డెస్క్: రష్యా ప్రభుత్వం నడుపుతున్న ఏరోఫ్లాట్ (Aeroflot) నేటి(శుక్రవారం) నుంచి భారత్‌కు విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించనుంది. ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో మార్చి 8వ తేదీ నుంచి ఏరోఫ్లాట్ భారత్‌తో పాటు యూఎస్, యూకే, యూరోప్ దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. అయితే, రెండు నెలల విరామం తర్వాత ఇవాళ్టి నుంచి ఏరోఫ్లాట్ ఇండియాకు విమానాలు నడపునున్నట్లు ప్రకటించింది. "మే 6, 2022 నుండి ఏరోఫ్లాట్ తన సొంత ఎయిర్‌బస్ 333 విమానాలను ప్రతి సోమ, శుక్రవారాల్లో ఢిల్లీ నుండి మాస్కోకి నడుపుతుంది. మొత్తం 293 మంది ప్రయాణికులతో మూడు క్లాసులుగా(బిజినెస్, ప్రీమియం ఎకానమీ, ఎకానమీ) ఈ రెండు సర్వీసులు పని చేస్తాయి" అని ఎయిర్‌లైన్స్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.


రష్యా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇరు దేశాల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా చాలా రోజులు అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. పరిస్థితులు అదుపులోకి వస్తున్న సమయంలో ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా మరోసారి విమానాలు నిలిచిపోయాయి. దీంతో భారత్, రష్యా ప్రయాణికులకు ఇక్కట్లు తప్పలేదు. రెండు నెలల తర్వాత ఏరోఫ్లాట్ తిరిగి విమాన సర్వీసులు ప్రారంభించడంతో ప్రయాణికులకు భారీ ఉపశమనం లభించినట్లైంది.  

Read more