మే చివరిలోగా చెల్లిస్తాం

ABN , First Publish Date - 2021-04-23T10:33:56+05:30 IST

పవన, సౌర విద్యుత్‌ సంస్థల బకాయిలను మే చివరిలోగా చెల్లిస్తామని విద్యుత్‌ పంపిణీ సంస్థలు హైకోర్టుకు వివరించాయి. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న

మే చివరిలోగా చెల్లిస్తాం

విద్యుత్‌ బకాయిలపై హైకోర్టుకు వివరించిన ఏజీ


 అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): పవన, సౌర విద్యుత్‌ సంస్థల బకాయిలను మే చివరిలోగా చెల్లిస్తామని విద్యుత్‌ పంపిణీ సంస్థలు హైకోర్టుకు వివరించాయి. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏలపై యూనిట్‌ టారిఫ్‌ ధరలను ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) సమీక్షించేందుకు వీలు కల్పిస్తూ 2019లో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు ధర్మాసనం ముందు అప్పీల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాల పై గురువారం మరోసారి విచారణ జరిగింది. కొన్ని సంస్థలకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని ధర్మాసనానికి అడ్వకేట్‌ జనరల్‌  ఎస్‌.శ్రీరామ్‌ తెలిపారు.


2020 డిసెంబరు వరకు ఉన్న బకాయిలను ఇప్పటికే చెల్లించామన్నారు. దీనిపై పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు బసవ ప్రభుపాటిల్‌, సంజయ్‌ సేన్‌, సంజన్‌ పూవయ్య స్పందిస్తూ... కొంతమేర బకాయిలు అందాయన్నారు. సింగిల్‌ జడ్జి ఆదేశాల మేరకు  చెల్లించాల్సిన బకాయిలలో కూడా కొంత మొత్తం మినహాయించారని,  ఏ కారణంతో సొమ్మును మినహాయించారో సమాచారం ఇవ్వలేదని తెలిపారు.  ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి. ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణను జూన్‌ 28కి వాయిదా వేసింది.

Updated Date - 2021-04-23T10:33:56+05:30 IST