*కౌలు*కునేదెప్పుడో!

ABN , First Publish Date - 2022-05-26T06:41:59+05:30 IST

వ్యవసాయం చేసేవారిలో 80 శాతం మంది వారు.

*కౌలు*కునేదెప్పుడో!

నేటికీ గుర్తింపు కార్డులకు నోచుకోని కౌలు రైతులు

ఖరీఫ్‌ ప్రణాళిక తయారైనా కార్డుల జారీలో ప్రభుత్వ నిర్లక్ష్యం

15 రోజుల్లో సాగునీరు విడుదలవుతున్నా పట్టించుకోని వైనం

ప్రభుత్వ రాయితీలకు దూరమవుతున్న కౌలుదారులు


ఉమ్మడి జిల్లాలో మొత్తం రైతులు : 6.23 లక్షల మంది

కౌలు రైతులు (అంచనా)  : 5 లక్షల మందికిపైనే

ప్రభుత్వం గుర్తించింది  : 1.31 లక్షల మంది 

ఇప్పటివరకూ సీసీఆర్సీ పొందినవారు : 83,368 మంది

 ప్రభుత్వం ఈ ఏడాది సీసీఆర్సీ  ఒక్కటీ ఇవ్వలేదు


వ్యవసాయం చేసేవారిలో 80 శాతం మంది వారు. సాగు విస్తీర్ణంలోనూ 85 శాతం వారిదే. అయినా వారిపై ప్రభుత్వానికి కరుణ లేదు. గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న ధ్యాస లేదు. పట్టించుకోవాలన్న ఆలోచన అధికారులకూ లేదు. ఇలా చిన్నచూపునకు గురవుతున్నది మరెవరో కాదు. కౌలు రైతులు. వీరికి ఎప్పటిలాగే ఈ ఏడాదీ కౌలు రైతు గుర్తింపు కార్డులు దక్కలేదు. అన్ని అంశాలపైనా నిత్యం సమావేశాలు పెట్టి చర్చించే ఉన్నతాధికారులు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న విషయాన్ని పట్టించుకోలేదు. మరో 15 రోజుల్లో సాగునీరు విడుదల అవుతున్నా, ఇంతవరకు ఒక్క కౌలు రైతుకూ గుర్తింపు కార్డు ఇవ్వలేదు. దీన్నిబట్టి రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తేటతెల్లమవుతోంది.  - గుడివాడ

 సీసీఆర్సీ లేకుండా రాయితీలు ఎలా?

ప్రభుత్వం ఇచ్చే ఏ రాయితీ పొందాలన్నా పంట సాగుహక్కు పత్రం (సీసీఆర్సీ) తప్పనిసరి. ఇప్పటికే ఖరీఫ్‌ ప్రణాళిక అమలులో భాగంగా పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. వీటితోపాటు ఎరువులు, పంట రుణాలు ఇలా ఏది కావాలన్నా కార్డులు ఉన్నవారే పొందగలరు. అంతటి ప్రాధాన్యం సంతరించుకున్న సీసీఆర్సీ జారీ ప్రక్రియ ఇంతవరకు గ్రామాల్లో మొదలు కాలేదు. మరో 15 రోజుల్లో సాగునీరు విడుదల చేస్తున్న తరుణంలో కౌలు కార్డులు లేకుండా ఈ ప్రభుత్వ రాయితీలు ఎలా పొందాలని కౌలుదారులు ప్రశ్నిస్తున్నారు. 

  గ్రామసభల్లో రైతుల గుర్తింపు

గత నెలలో నిర్వహించిన గ్రామసభల్లో ఎలాంటి భూమీలేని రైతులను గుర్తించారు. పొలం ఉండి కౌలు సాగుచేసే రైతులను కూడా గుర్తించారు. గతంలో కౌలు తీసుకున్న భూమిని యజమాని అంగీకారంతో మరో ఏడాది కౌలు పొడిగించుకున్న రైతులు ఉన్నారని తేలింది. ఎలాంటి షరతులూ లేకుండా గ్రామసభల్లో గుర్తించిన వీరందరికీ కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ వస్తోంది. 

  సన్నాహక సమావేశాల్లో కార్డుల జారీ ఊసేది!

ముందస్తు ఖరీఫ్‌కు రైతులను సమాయత్తం చేసేందుకు నీటి సలహా మండలి, వ్యవసాయ సలహామండలి సమావేశాలు నిర్వహించారు. సాగు నీటి విడుదల, ఖరీఫ్‌ ప్రణాళిక అమలు, ధాన్యం కొనుగోళ్లు, దిగుబడి లక్ష్యం తదితర అంశాలపై చర్చించారు. సాగుకు అత్యంత కీలకమైన కౌలు రైతులకు పంట సాగుహక్కు పత్రాలు అందించాలనే అంశాన్ని పట్టించుకోలేదు. 

  విభజిత జిల్లాలో 52 వేల కార్డుల జారీ లక్ష్యం 

భూ యజమాని, కౌలుదారు కుదుర్చుకున్న ఒప్పందాల ఆధారంగా కౌలు రైతుగుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. కార్డు ఇవ్వడానికి అభ్యంతరం లేదని భూ యజమాని, కౌలు రైతు ఇద్దరూ సంతకం చేస్తేనే ఇస్తారు. భూ యజమానులు కౌలుకు ఇస్తున్నామని సంతకం చేయడానికి ముందుకు రావడం లేదు. ఇద్దరినీ సమన్వయం చేసేలా వీఆర్వోలు, గ్రామ వలంటీర్లు బాధ్యత తీసుకోవాల్సి ఉంది. భూ యజమాని అందుబాటులో లేకపోతే ఆయన ధ్రువీకరించిన వ్యక్తి సంతకంతో కార్డులు అందించే విధంగా నిబంధనలు సరళీకరించారు. కార్డు జారీ చేసిన దగ్గర నుంచి 11 నెలలు మాత్రమే అమలులో ఉంటాయి. భూ యజమానులు సంతకం చేయడానికి ముందుకు రాకపోవడంతో తక్కువ సంఖ్యలో కౌలుగుర్తింపు కార్డులు జారీ అవుతున్నాయి. గతేడాది అత్యధిక శాతం మండలాల్లో కౌలు కార్డులు వెయ్యిలోపే పంపిణీ చేయగలిగారు. ప్రస్తుతం విభజిత కృష్ణా జిల్లాలో 52 వేల కార్డులు పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్ధారించుకుంది. 

కౌలు రైతుల కార్డుల జారీ ప్రారంభించాం 

కౌలు రైతు కార్డులు పంపిణీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హులైన అందిరికీ పంట సాగుహక్కు పత్రాలు చేసేందుకు రైతుభరోసా కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి. మండల వ్యవసాయ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. కౌలు రైతులు తమ వీఆర్వోను సంప్రదిస్తే కౌలు రైతు కార్డు ఎలా పొందాలో తెలుసుకోవచ్చు. ఇంతకు ముందే కార్డులు పొందిన వారు అవే భూములు కౌలు చేస్తుంటే రెన్యువల్‌ చేసుకోవాలి. భూ యజమానులు ఎలాంటి భయాలకు తావులేకుండా కౌలుదారులకు కార్డు ఇవ్వడానికి అవగాహనతో ముందుకు రావాలి. 

- ఎస్‌.మనోహరరావు, జిల్లా వ్యవసాయ అధికారి



Updated Date - 2022-05-26T06:41:59+05:30 IST