Kadapa నుంచి మళ్లీ ఎగరనున్న విమానాలు.. గుడ్ న్యూస్ ఏమిటంటే..

ABN , First Publish Date - 2022-03-07T12:27:46+05:30 IST

డప ఎయిర్‌పోర్టు నుంచి మళ్లీ విమానాలు ఎగరనున్నాయి. ఇండిగో సంస్థ ఈ నెల 27 నుంచి

Kadapa నుంచి మళ్లీ ఎగరనున్న విమానాలు.. గుడ్ న్యూస్ ఏమిటంటే..

  • ఈ నెల 27 నుంచి విమాన సర్వీసుల పునరుద్ధరణ 
  • విశాఖ, బెంగళూరుకు సైతం..

కడప : కడప ఎయిర్‌పోర్టు నుంచి మళ్లీ విమానాలు ఎగరనున్నాయి. ఇండిగో సంస్థ ఈ నెల 27 నుంచి విమానాలు నడిపేందుకు సిద్ధమవుతోంది. కడప నుంచి హైదరాబాద్‌, విజయవాడ, చెన్నైతో పాటు తొలిసారిగా విశాఖపట్నం, బెంగళూరుకు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. గతంలో ఉడాన్‌ పథకంలో భాగంగా ట్రూజెట్‌ సంస్థ కడప నుంచి విమానాలను నడిపేది. అయితే పథకం గడువు ముగియడంతో హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ సర్వీసులు నిలిచిపోయాయి. కొద్ది రోజుల పాటు కడప హైదరాబాద్‌, కడప బెల్గాంలకు సర్వీసు నడిపింది. చివరి సారిగా గత ఏడాది నవంబర్‌ 11న కడప నుంచి బెల్గాంకు సర్వీసు నడిపింది. తర్వాత సాంకేతిక కారణాల వల్ల నిలిపేసింది. అప్పటి నుంచి విమానాల రాకపోకలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఇండిగోతో, ఏపీ ఎయిర్‌పోర్టు డెవలప్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌తో ఇప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ నెల 27 నుంచి విమాన రాకపోకలు మొదలు కానున్నాయి.


తొలిసారిగా విశాఖపట్నానికి..

కడప ఎయిర్‌పోర్టు నుంచి 2015లో విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. తొలిసారిగా కడప - బెంగళూరు మధ్య కొనాళ్ల పాటు సర్వీసు నడిపి తరువాత నిలిపేశారు. అయితే ట్రూజెట్‌ రాకతో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. బెంగళూరు, విశాఖపట్నంకు విమాన సర్వీసుల కోసం జిల్లా వాసుల డిమాండ్‌ ఎక్కువగా వచ్చింది. ఈ నేపథ్యంలో ఏడేళ్లకు మళ్లీ కడప నుంచి బెంగళూరుకు సర్వీసు మొదలు కాగా విశాఖపట్నానికి తొలిసారిగా సర్వీసు అందుబాటులోకి వచ్చింది.


విమాన ప్రయాణానికి ఆదరణ

ఉడాన్‌ పథకంలో భాగంగా విమాన టికెట్ల ధరలు అందుబాటులో ఉండడంతో క్రమేపీ జిల్లా వాసులు విమానయానంపై ఆసక్తి పెంచుకున్నారు. హైదరాబాద్‌, చెన్నై, విజయవాడలకు వెళ్లాలంటే బస్సులో అయితే 6 నుంచి 8 గంటలు. సొంత వాహనంలో అయితే 5 నుంచి 6 గంటలు పట్టేది. అయితే విమానయానం ఆ పట్టణాలకు గంటలోపే ఉండడంతో ప్రయాణ సమయం కలిసి వస్తుండడంతో జిల్లా వాసులు విమాన ప్రయాణానికి బాగా అలవాటు పడ్డారు. 2018లో కడప ఎయిర్‌పోర్టు నుంచి 68,472 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 2019లో 1,08,405 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. అయితే కొవిడ్‌ కారణంగా 2020- 2021లో కొన్ని విమానాలు మాత్రమే తిరిగాయి. దీంతో 2020లో 51,257 ప్రయాణించగా, 2021లో 29,823 మంది ప్రయాణించారు. కాగా.. కడప ఎయిర్‌పోర్టులో ఈ నెల 27వ తేదీ నుంచి ఇండిగో విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఎయిర్‌పోర్టు మేనేజర్‌ శివప్రసాద్‌ ఆంధ్రజ్యోతికి వెల్లడించారు. ఈ అవకాశాన్ని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


విమానాలు వెళ్లే ఊర్లు..

కడప - హైదరాబాద్‌  : ప్రతి రోజు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి 

కడప - విజయవాడ - కడప : సోమ, బుధ, శుక్ర, ఆదివారాలు

చెన్నై - కడప - చెన్నై : సోమ, బుధ, శుక్ర, ఆదివారాలు 

బెంగళూరు- కడప- బెంగళూరు : మంగళ, గురు, శనివారాలు 

కడప - విశాఖపట్నం - కడప : మంగళ, గురు, శనివారాలు.

Updated Date - 2022-03-07T12:27:46+05:30 IST