మరోసారి విలన్‌గా మాధవన్

Jun 7 2021 @ 15:52PM

‘రన్‌’, ‘సండైక్కోళి’, ‘పైయా’ వంటి భారీ విజయాలను చిత్రసీమకు అందించిన దర్శకుడు లింగుస్వామి. ఈ చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అంజాన్‌’, ‘సండైక్కోళి2’ వంటి చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద పూర్తిగా నిరాశపరిచాయి. దీంతో ఆయన కోలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఇప్పుడాయన రామ్‌ హీరోగా ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను ఎంతో కీలకంగా దర్శకుడు లింగుస్వామి తీర్చిదిద్దారని తెలుస్తోంది. ఈ పాత్రకు కోలీవుడ్‌ హీరో ఆర్‌. మాధవన్‌ను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై మాధవన్‌తో లింగుస్వామి సంప్రదింపులు జరిపినట్టుగా కోలీవుడ్‌లో కూడా టాక్ నడుస్తోంది. 


రొమాంటిక్ హీరోగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేసుకున్న మాధవన్‌కు యాక్షన్‌ హీరోగా గుర్తింపు ఇచ్చిన దర్శకుడు లింగుస్వామి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రన్‌’ చిత్రం ఘనవిజయంతో మాధవన్‌కు కమర్షియల్‌ హీరోగా స్టేటస్‌ దక్కింది. ఆ తర్వాత లింగుస్వామి తెరకెక్కించిన ‘వేట్టై’ చిత్రంలోని రెండు పాత్రల్లో ఒక పాత్రలో మాధవన్‌ నటించారు. ఇపుడు తెలుగులో రామ్‌ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రంలో మాధవన్‌ను విలన్‌ పాత్రలో ఎంపిక చేసేందుకు దర్శకుడు లింగుస్వామి ఓ నిర్ణయానికి వచ్చి, ఆయనతో సంప్రదింపులు జరిపారనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇదే నిజమైతే హీరో మాధవన్‌... టాలీవుడ్‌లో మరోసారి ప్రతి నాయకుడిగా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నట్లే. అంతకుముందు నాగచైతన్య ‘సవ్యసాచి’ చిత్రంలో మాధవన్ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.