HYD : మళ్లీ మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల్లో Parking దందా..

ABN , First Publish Date - 2021-11-20T18:50:46+05:30 IST

మాల్స్‌, మల్టీప్లెక్స్‌, ఇతర వాణిజ్య సముదాయాల్లో పాత నిబంధనలే వర్తిస్తాయి.

HYD : మళ్లీ మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల్లో Parking దందా..

  • పలు మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల్లో వసూళ్లు
  • జీఓ సాకుగా చూపి.. జబర్దస్తీగా.. 
  • జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదులు
  • క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించని అధికారులు
  • ఫిర్యాదులపైనా స్పందన అంతంతే


స్టాండ్‌ ఎలోన్‌ థియేటర్ల(సింగిల్‌ స్ర్కీన్‌)లో  ద్విచక్ర వాహనాలకు రూ.20, నాలుగు చక్రాల వాహనాలకు రూ.30 చొప్పున పార్కింగ్‌ రుసుము వసూలు చేయవచ్చు. మాల్స్‌, మల్టీప్లెక్స్‌, ఇతర వాణిజ్య సముదాయాల్లో పాత నిబంధనలే వర్తిస్తాయి.- జూలై 20(2021)న పురపాలక శాఖ ఉత్తర్వులు (జీఓ-121) గ్రేటర్‌లోని కొన్ని మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు పార్కింగ్‌ రుసుము వసూలు చేస్తున్నాయి. పలు స్టాండ్‌ ఎలోన్‌ థియేటర్లలోనూ నిర్ణీత మొత్తం కంటే ఎక్కువగా పార్కింగ్‌ ఫీ తీసుకుంటున్నారు. దీనిపై జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌(ఈవీడీఎం) సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌ (సీఈసీ) ట్విట్టర్‌ ఖాతాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయినా సంబంధిత యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ట్విట్టర్‌లో వచ్చే ఫిర్యాదుల విషయంలో పూర్తి వివరాలతో లెటర్‌ ఇవ్వండి.. లేదా మీ నెంబర్‌ ఇస్తే మా సిబ్బంది వచ్చి వివరాలు సేకరిస్తారని సమాధానం చెబుతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలు బహిర్గతం చేయడం లేదు. థియేటర్లు, మాల్స్‌లో తనిఖీలు నిర్వహించని అధికార యంత్రాంగం.. ఫిర్యాదులపైనా సరిగా స్పందించక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


స్టాండ్‌ ఎలోన్‌ థియేటర్లలో మాత్రమే..

అక్రమ పార్కింగ్‌ దందాకు చెక్‌ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం మూడున్నరేళ్ల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత పార్కింగ్‌కు అవకాశం కల్పి స్తూ.. విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల్లో పార్కింగ్‌ రుసుము వసూలు చేయవద్దని మార్చి 20, 2018న పురపాలక శాఖ ఉత్తర్వులు (జీఓ-63) జారీ చేసింది. ఉచిత పార్కింగ్‌ నిబంధనలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మాల్స్‌, మల్టీప్లెక్సుల్లో మొదటి 30 నిమిషాలు కొనుగోళ్లతో సంబంధం లేకుండా ఉచిత పార్కింగ్‌కు అవకాశముంటుంది. 30 నిమిషాల నుంచి గంట వరకు ఎంతో కొంత కొనుగోలు చేసినా(పార్కింగ్‌ రుసుము కంటే తక్కువ బిల్లు చూపినా) రుసుము వసూలు చేయవద్దు. గంటపైన వాహనం నిలిపితే... పార్కింగ్‌ రుసుము కంటే ఎక్కువ కొనుగోలు చేసిన బిల్లు/సినిమా టికెట్‌ చూపిస్తే పార్కింగ్‌ ఫ్రీ అని స్పష్టం చేశారు. మూడున్నరేళ్లుగా ఈ విధానం అమలవుతుండగా.. స్టాండ్‌ ఎలోన్‌ థియేటర్ల యజమానులు కొన్నాళ్ల క్రితం ప్రభుత్వ వర్గాలతో తమ గోడు వెల్లబోసుకున్నాయి. సినిమాకు రాని వారు సైతం థియేటర్ల ప్రాంగణాల్లో వాహనాన్ని నిలుపుతున్నారని, ఇది పెద్ద సమస్యగా మారుతోందని పేర్కొన్నారు. వాహనాలను కాపాడడం, క్రమపద్ధతి పార్కింగ్‌ చేసేలా నియమించే సిబ్బందికి వేతనాల చెల్లింపు ఆర్థికంగా భారమవుతుందని పాలకుల దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన పురపాలక శాఖ స్టాండ్‌ ఎలోన్‌ థియేటర్లలో పార్కింగ్‌ రుసుం వసూలుకు అవకాశం కల్పించింది. మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు, ఇతర వాణిజ్య సముదాయాల్లో మాత్రం పాత ఉత్తర్వుల్లోని (జీఓ-63) నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.


సాకు చూపి వసూలు...

జూలైలో పురపాలక శాఖ జారీ చేసిన ఉత్తర్వులను సాకుగా చూపి గ్రేటర్‌లో కొందరు అక్రమ పార్కింగ్‌ దందాకు మళ్లీ శ్రీకారం చుట్టారు. కొన్ని స్టాండ్‌ ఎలోన్‌ థియేటర్లలో ద్విచక్ర వాహనాలకు రూ.30, నాలుగు చక్రాల వాహనాలకు రూ.50 వరకు వసూలు చేస్తున్నారు మాల్స్‌, మల్టీప్లెక్సుల్లో పరిస్థితి దారుణంగా మారింది. జీఓను ప్రస్తావిస్తూ.. మల్టీప్లెక్స్‌ల్లో సినిమా చూసిన వారి నుంచి పార్కింగ్‌ ఫీజు తీసుకుంటున్నారు. అత్తాపూర్‌ మంత్ర మాల్‌లోని ఏ స్ర్కీన్‌లో సినిమా చూసినా ద్విచక్ర వాహనాలకు రూ.20, నాలుగు చక్రాల వాహనాలకు రూ.50 రుసుం వసూలు చేస్తున్నారు. 


‘నాలుగు రోజుల క్రితం సినిమాకు వెళితే రూ.50 పార్కింగ్‌ ఫీ తీసుకున్నారని’ బుద్వేల్‌కు చెందిన గంగాధర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పాడు. ఇదే మాల్‌లోని దుకాణాల్లో షాపింగ్‌ చేసిన వారి నుంచీ పార్కింగ్‌ రుసుము తీసుకుంటున్నారని చెబుతున్నారు. శాలిబండలోని సుధా సినీపాలిస్‌ మల్టీప్లెక్స్‌లో ద్విచక్ర వాహనానికి రూ.20, నాలుగు చక్రాల వాహనాలకు రూ.30 తీసుకుంటున్నారు. మల్టీప్లెక్స్‌ అయినప్పటికీ.. స్టాండ్‌ ఎలోన్‌ థియేటర్‌ నిబంధనలు ఇక్కడ అమలు చేస్తుండడం గమనార్హం. కూకట్‌పల్లిలోని ప్రముఖ మాల్‌లో గంటల వారీగా పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నారు. మొదటి రెండు గంటలకు రూ.30, తరువాత ఒక్కో గంటకు రూ.10 చొప్పున అదనంగా చెల్లించాలని రశీదులో స్పష్టంగా ముద్రించారు. సినిమా చూసినట్టు టికెట్లు చూపించినా అక్కడి సిబ్బంది పార్కింగ్‌ ఫీజు తీసుకున్నారని సీఈసీ- ఈవీడీఎం ఖాతాకు ఓ పౌరుడు ఫిర్యాదు చేశాడు. సికింద్రాబాద్‌లోని చెన్నయ్‌ ట్రేడ్‌ సెంటర్‌ (సీటీసీ)లో అక్రమ పార్కింగ్‌ రుసుం వసూలు యథేచ్ఛగా సాగుతోంది. రశీదు ఇవ్వకుండా ద్విచక్ర వాహనానికి రూ.10-20, నాలుగు చక్రాల వాహనాలకు రూ.30-50 వరకు తీసుకుంటున్నారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. 

Updated Date - 2021-11-20T18:50:46+05:30 IST