మళ్లీ స్కూళ్లు బంద్..!

ABN , First Publish Date - 2021-10-22T13:20:27+05:30 IST

పాఠశాలల మూసివేత..

మళ్లీ స్కూళ్లు బంద్..!

విమానాలు రద్దు.. స్కూళ్లు బంద్‌

చైనాలో భారీఎత్తున సామూహిక టెస్టులు


బీజింగ్‌, మాస్కో: చైనాలో ఒక్కసారిగా కరోనా కలవరం..! వందల కొద్దీ విమానాల రద్దు, పాఠశాలల మూసివేత, పెద్దఎత్తున సామూహిక పరీక్షలు, ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ ఆంక్షలు..! వృద్ధ దంపతులు సహా పదుల సంఖ్యలో పర్యాటకులకు కరోనా పాజిటివ్‌ రావడమే దీనంతటికీ కారణం. వీరంతా షాంఘై నుంచి మొదలై గ్జియాన్‌, గాన్సు ప్రావిన్స్‌, ఇన్నర్‌ మంగోలియాలో పర్యటించారు. ఈ క్రమంలో రాజధాని బీజింగ్‌ సహా ఐదు ప్రావిన్స్‌ల్లో పెద్దఎత్తున ప్రజలతో కాంటాక్టు అయినట్లు భావించి చైనా చర్యలు చేపట్టింది. అనుమానం ఉన్న ప్రాంతాల్లో విహార కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలను మూసివేసి స్థానిక ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి.


వాయువ్య చైనాలోని 40 లక్షల జనాభా ఉన్న లాన్‌జూ నగరంలో అవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ ప్రజలకు ఆదేశాలిచ్చారు. గ్జియాన్‌, లాన్‌జూల్లో 60 శాతం విమాన సర్వీసుల ను రద్దు చేశారు. ఇన్నర్‌ మంగోలియాలోని ఎరెన్‌హట్‌కు రాకపోకలను నిలిపివేశారు. ఈ ప్రాంతంలో కరోనా ప్రభావం బొగ్గు దిగుమతులపై పడనుంది. కాగా, చైనాలో వరుసగా ఐదో రోజు కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం స్థానిక వ్యాప్తి ద్వారా 13 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. వీటిలో అధిక శాతం ఈశాన్య, వాయువ్య ప్రాంతాలవే.


కేసులు పెరుగుతున్నాయ్‌.. ‘‘ప్లాన్‌ బి’’ తెండి

గత ఏడు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో బుధవారం కొవిడ్‌తో 223 మంది చనిపోయారు. దాదాపు 44 వేల కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజులుగా దేశంలో రోజుకు 40 వేల మందిపైగా వైర్‌సకు గురవుతున్న నేపథ్యంలో నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్నది శీతాకాలమని.. ప్లాన్‌ బి ప్లస్‌ అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఏమాత్రం ఆలస్యంం చేయకుండా మాస్క్‌ తప్పనిసరి, ఇంటి నుంచి పని వంటి నిబంధనలను విధించాలని కోరారు.


మరోవైపు కొవిడ్‌ తీవ్రతతో రష్యా రాజధాని మాస్కోలో ఈ నెల 28 నుంచి ఆంక్షలను అమల్లోకి తేనున్నారు. నవంబరు 7 వరకు పాఠశాలలు, రెస్టారెంట్లు, ఆహారేతర కేంద్రాలను మూసివేయనున్నారు. గురువారం దేశంలో రికార్డు స్థాయిలో 36,339 కేసులు నమోదయ్యాయి. 1,036 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు గుమిగూడకుండా చూడాలని మిగతా ప్రావిన్సులకు సూచించారు. రష్యాలోని 85 రీజియన్లకు గాను అత్యధికచోట్ల సామూహిక కార్యక్రమాలపై ఆంక్షలున్నాయి. అయితే, దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు మాత్రం అవకాశం కనిపించడం లేదు. గతేడాది లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడమే దీనికి కారణం.

Updated Date - 2021-10-22T13:20:27+05:30 IST