మళ్లీ ఎలుగుబంటి కలకలం

ABN , First Publish Date - 2022-07-07T06:15:57+05:30 IST

కరీంనగర్‌లో ఎలుగబంటి సంచారం మళ్లీ మొదలైంది.

మళ్లీ ఎలుగుబంటి కలకలం

కరీంనగర్‌ క్రైం, జూలై 6: కరీంనగర్‌లో ఎలుగబంటి సంచారం మళ్లీ మొదలైంది.  శాతవాహన విశ్వవిద్యాలయం ఆవరణలోకి మంగళవారం రాత్రి ఒక ఎలుగుబంటి వచ్చిందని స్థానికులు సమాచారం అందించారు. వెంటనే ఎస్‌యూ అధికారులు అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్‌ శివారులోని ఒక ఇంటి వద్ద తచ్చాడుతున్న ఎలుగుబంటిని స్థానికుడు రాత్రి గమనించాడు. ఆ తరువాత ఆ ఎలుగుబంటి మార్క్‌ఫెడ్‌ గోదాముల ఆవరణలోకి ప్రవేశించి అక్కడి నుంచి ఎస్‌యూ క్యాంపస్‌లోని గుట్టలు, చెట్లపొదల్లోకి వెళ్లిపోయింది. ఎస్‌యూ క్యాంపస్‌లో దట్టమైన చెట్లు, ముళ్ళపొదలు ఉండటంతోపాటు, గుట్టలు, పెద్దపెద్ద రాళ్లు ఉన్నాయి. ఎలుగుబంటి చాలా కాలంగా అక్కడే ఒక గుట్టసొరికలో ఆవాసం ఏర్పాటు చేసుకుని ఆహారం కోసం రాత్రి వేళ బయటకు వెళ్లి రాత్రి సమయంలోనే తన ఆవాసానికి చేరుకుంటున్నట్లు స్థానికులు, అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. మార్చినెలలో ఇదే విధంగా ఎలుగుబంటి ఎస్‌యూ క్యాంపస్‌లో సంచరించగా సీసీ కెమెరాలో రికార్డు అయింది. కొంతమంది విద్యార్థులు ఎలుగబంటి కదలికలను రికార్డు చేశారు. ఎస్‌యూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేయటంతో కొద్దిరోజులపాటు తరగతులను నిలిపివేసి విద్యార్థులను హాస్టల్‌ నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. క్యాంపస్‌లో అటవీశాఖ అధికారులు 24 గంటలపాటు పెట్రోలింగ్‌ నిర్వహించారు. ఆ ఎలుగుబంటిని పట్టుకునేందుకు మూడు ట్రాపర్‌ కేజ్‌లు, కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ తరువాత కొద్దిరోజులకే కరీంనగర్‌-జగిత్యాల రహదారిలో రాత్రి సమయంలో రోడ్డు దాటుతున్న ఎలుగుబంటిని గుర్తించారు. కరీంనగర్‌ పరిసర ప్రాంతాల్లో తరచుగా ఎలుగుబంటి, పిల్లలతో తిరుగుతున్నా దానిని అటవీశాఖ అధికారులు బంధించలేకపోతున్నారు. ఎస్‌యూలోకి మళ్లీ ఎలుగుబంటి చొరబడిందనే వార్త తెలియడంతో ఆ ప్రాంత ప్రజలతోపాటు విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థులు సాయంత్రం 5 గంటల తరువాత హాస్టల్‌ గదుల్లో నుంచి బయటకు రావద్దని ఎస్‌యూ అధికారులు ఒక సర్క్యూలర్‌ను జారీ చేశారు. 

Updated Date - 2022-07-07T06:15:57+05:30 IST