రైతు బీమాకు వయో పరిమితా..!

ABN , First Publish Date - 2022-01-28T08:18:39+05:30 IST

రైతు బీమాకు వయోపరిమితి విధించడంపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

రైతు బీమాకు వయో పరిమితా..!

  • 59 ఏళ్లు దాటిన వారు రైతులు కారా?
  • ఆ లాజిక్‌ ఏంటో సీఎం కేసీఆర్‌ చెప్పాలి
  • వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్‌


హైదరాబాద్‌, జనవరి 27(ఆంధ్రజ్యోతి): రైతు బీమాకు వయోపరిమితి విధించడంపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తనకు నచ్చిన అధికారులకు 65 ఏళ్ల వరకు పొడిగింపు ఇస్తున్న సీఎం కేసీఆర్‌.. రైతు బీమాకు మాత్రం 59 ఏళ్ల పరిమితి విధించడం ఏంటని ప్రశ్నించారు. దీని వెనకున్న లాజిక్‌ ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గురువారం లోట్‌సపాండ్‌లో జరిగిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు. ‘‘59 ఏళ్లు దాటిన తర్వాత వ్యవసాయం చేసేవారు రైతులు కారా? వారు చేసేది వ్యవసాయం కాదా? మీరు ఇచ్చే బీమా రైతులకా? వారి వయసుకా? బీమా దక్కాలంటే రైతులు 59 ఏళ్లలోపే చనిపోవాలా? అసలు.. రైతు నిర్వచనం తెలుసా మీకు? సెంటు భూమి ఉన్నా రైతు బీమా అందుతుందని గతంలో మీరు ప్రకటించలేదా? అప్పుడు వయోపరిమితి విషయం గుర్తు రాలేదా?’’ అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. 


రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో 9 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వమే ప్రకటించిందని, ఇది.. కేసీఆర్‌ సిగ్గుపడాల్సిన విషయమని పేర్కొన్నారు. రైతు బీమా విషయంలో ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే.. న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. కౌలు రైతులను ఎందుకు రైతులుగా పరిగణించడం లేదో.. 80 వేల పుస్తకాలు చదివిన ఈ అపర మేధావి చెప్పాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రానికే మంచి చేయలేని ఆయన.. జాతీయ రాజకీయాల్లోకి వెళతాననడం ఓ పెద్ద జోక్‌. అయినా.. ఎవరిని ఉద్ధరించడానికి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళతారు? ఇప్పటికే రాష్ట్రాన్ని అమ్మేశారు. ఇక దేశాన్ని అమ్మేస్తారేమో..!’’ అని షర్మిల ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్‌, మద్యం దందాను పెంచి పోషిస్తోంది కేసీఆరేనని ఆరోపించారు. దీనిపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ ఏమైందని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు వీధి రౌడీల్లా కొట్టుకుంటున్నారని విమర్శించారు. కొవిడ్‌ ముగిసిందని ప్రకటించిన మరుక్షణం.. పాదయాత్ర మళ్లీ ప్రారంభిస్తానని షర్మిల స్పష్టం చేశారు. తెలిపారు. రైతుల ఆత్మహత్యలపై బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడుతలేరని నిలదీశారు. ఽకాగా.. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ఆ రాష్ట్రం గురించి తనతో మాట్లాడవద్దని షర్మిల అన్నారు.

Updated Date - 2022-01-28T08:18:39+05:30 IST