ltrScrptTheme3

గ్లాస్గో సదస్సుకు ఎజెండా

Oct 15 2021 @ 02:27AM

వాతావరణ మార్పుల నుంచి మన ధరిత్రిని సంరక్షించుకునేందుకు ఏం చేయాలి? ఏం చేసి తీరాలి?ఈ అంశాలపై చర్చించేందుకు ప్రపంచదేశాల అధినేతలు రెండు సంవత్సరాల విరామం తరువాత వచ్చే నెల బ్రిటన్ లోని గ్లాస్గో నగరంలో సమావేశమవనున్నారు. వాతావరణ మార్పులు మహా తీవ్రరూపం దాల్చనున్నాయని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్’ (ఐపీసీసీ) హెచ్చరించిన నేపథ్యంలో ఈ వాతావరణ శిఖరాగ్ర సమావేశం (కాప్ 26- కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ టు ది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్) జరగనున్నది. 2030 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలోకి వెలువడే ఉద్గారాలను సగానికి తగ్గించాలని, 2050 సంవత్సరంనాటికి ఆ ఉద్గారాలు సున్నా స్థాయికి చేరి తీరాలని, అలా జరిగినప్పుడు మాత్రమే భూతాపం ప్రమాదాలను నివారించవచ్చని ‘కోడ్ రెడ్ ఫర్ హ్యూమానిటీ’ పేరిట ఐపీసీసీ విడుదల చేసిన నివేదిక హెచ్చరించింది. పర్యావరణ పరిరక్షణకు బాల్యం నుంచి కృషి చేస్తోన్న పద్దెనిమిదేళ్ళ స్వీడిష్ యువతి గ్రేటా థన్‌బర్గ్‌కు ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటిస్తారని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆశించారు. అయితే అలా జరగలేదు. అదలా ఉంచి కాప్ 26లో చర్చించాల్సిన అంశాలను చూదాం. 


వాతావరణ మార్పులు ఒక వాస్తవం. ఎవరూ కాదనలేని ఒక యథార్థం. మానవ చర్యల ఫలితంగానే ఆ మార్పులు సంభవిస్తున్నాయని ఐపీసీసీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భిన్నదేశాలవారు భిన్నరీతుల్లో వాతావరణ మార్పుల విషమ పర్యవసానాలను చవిచూస్తున్నారు. ఈ మార్పులకు అత్యధికంగా కారకులు అవుతున్నవారు, వాటి నష్టాల నివారణకు ప్రధాన బాధ్యత వహించడం లేదు. ఈ వాతావరణ అన్యాయం అనే వాస్తవాన్ని తిరస్కరించడానికి వీలులేదు. దానిని అంగీకరించి, తొలుత తగ్గించేందుకు, అంతిమంగా తొలగించేందుకు కృషి చేయడం ద్వారా మానవాళి భవిష్యత్తును కాపాడుకోవాలి. 1992 రియో ధరిత్రీ సదస్సులో ఈ విషయమై ఐక్యరాజ్యసమితి రూపొందించిన ఒడంబడికపై సమితి సభ్యదేశాలన్నీ సంతకాలు చేశాయి. ఉమ్మడి, అయితే భిన్న స్థాయి బాధ్యత నియమం ప్రాతిపదికన ఆ ఒడంబడికకు రూపకల్పన జరిగింది. దీని ప్రకారం సంపన్నదేశాలు తమ కాలుష్యకారక ఉద్గారాలను తగ్గించుకోవాలి. వర్ధమాన దేశాలు కాలుష్యరహిత అభివృద్ధిని సాధించేందుకు అవసరమైన నిధులు, సాంకేతికతలను అభివృద్ధి చెందిన దేశాలు వాటికి సమకూర్చాలి. ఇది, సంపన్న దేశాలు విధిగా నిర్వర్తించవలసిన ఒక చారిత్రక బాధ్యత. విచారకరమైన విషయమేమిటంటే అవి ఆ బాధ్యతా నిర్వహణలో చిత్తశుద్ధి చూపడం లేదు. వాతావరణ మార్పులపై 2015 పారిస్ ఒప్పందం ఆ చారిత్రక బాధ్యత గురించి ప్రస్తావించనేలేదు. వాతావరణ న్యాయాన్ని ఒక అప్రధాన అంశంగా చేశారు. 


రెండో అంశం నెట్ జీరో ఎమిషన్స్ (నికర సున్నా ఉద్గారాలు) విషయమై ధర్మోపన్యాసాలను నిలిపివేయడం. భూ ఉపరితల ఉష్ణోగ్రత 19 వ శతాబ్ది స్థాయిల కన్నా 1.5 డిగ్రీల సెల్సియస్ మించి పెరగకూడదని 2015 పారిస్ వాతావరణ ఒప్పందం నిర్దేశించింది. ఈ లక్ష్య పరిపూర్తి జరగాలంటే 2050 నాటికి నెట్ జీరోకు చేరాలని, 2030 నాటికి 2010 స్థాయిలలో సగానికి తగ్గించాలని ఐ పీ సీసీ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ దేశాలు 2050 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధించి తీరాలంటే జి–-7 కూటమి దేశాలతో పాటు చైనా ఉద్గారాలు 2030 నాటికే నెట్ జీరోకు చేరితీరాలి. ప్రపంచ దేశాల సమష్టి కార్యాచరణతో మినహా ఇది సాధ్యం కాదనేది స్పష్టం. 


మూడో అంశం చైనాపై నిక్కచ్చి వైఖరి. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాల కూటమి జి–-70 సభ్యదేశంగా చైనా తన నిజ ఉద్దేశ్యాలను చాలాకాలం పాటు స్పష్టంగా వెల్లడించలేదు. ఉద్గారాల తగ్గింపు విషయమై ఈ కమ్యూనిస్టు దేశం ఇప్పటికీ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. అయితే చైనా ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్ద కార్బన్ ఉద్గారాల దేశంగా ఉంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే వర్తమాన చైనాను నిన్నటి అమెరికాగా చెప్పితీరాలి. వాతావరణ మార్పులకు ఇంతగా కారణమవుతున్న చైనా తన ఇష్టానుసారంగా వ్యవహరించడం ఎంత మాత్రం అంగీకారయోగ్యం కాదు. ఈ విషయాన్ని చైనాకు ప్రపంచం నిర్మొహమాటంగా చెప్పి తీరాలి. 


నాలుగో అంశం ఆర్థిక వనరులు. వర్ధమాన దేశాలు వాతావరణ మార్పుల పెరుగుదలకు తావివ్వనిరీతిలో ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అవసరమైన నిధులను సమకూర్చవలసి ఉంది. సంపన్నదేశాలు ఈ విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించక పోవడం వల్లే పేదదేశాలు వాతావరణ ఒడంబడికలకు నిబద్ధమై ఉండేందుకు సంశయిస్తున్నాయి. భారత్, ఆఫ్రికా దేశాలు తమ హరితగృహ వాయు ఉద్గారాలను తగ్గించాల్సిన అవసరముందనడంలో మరో అభిప్రాయం లేదు. అయితే ఇందుకు దోహదం చేసే మార్కెట్ విధానాలను అనుసరించవలసి ఉంది. మరి అందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించడం సంపన్నదేశాల బాధ్యత. సంకల్పాలకు అనుగుణమైన ఆచరణలు లేకపోవడమే ఇక్కడ అసలు సమస్య. 


చర్చించాల్సిన ఐదో అంశం ‘నష్టాలు-నష్ట పరిహారాలు’. వాతావరణ విపరీత పోకడలతో సంభవిస్తున్న విపత్తులలో అపారనష్టం వాటిల్లుతోంది. ఈ విపత్తులు తరచు సంభవిస్తున్న కారణంగా ప్రజలు వాటిని సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నారు. ఆస్తులు, జీవనాధారాల విధ్వంసం వారిని పేదరికంలోకి నెట్టివేస్తోంది. ఫలితంగా వారు అంతులేని నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. వ్యక్తులే కాకుండా సమాజాలు కూడా అభద్రతాభావానికి లోనవుతున్నాయి. వాతావరణ మార్పు ఒక గొప్ప సమానీకరణ శక్తి. ఈ విపత్తుల బాధితులకు కాలుష్యకారకులే నష్టపరిహారాలు సమకూర్చాలి. పేదదేశాలు ఈ విషయంలో ఎటువంటి రాజీ ధోరణికి తావివ్వకుండా ఒక కచ్చితమైన వైఖరితో వ్యవహరించాలి. వాతావరణ మార్పులను సాహసం, సహకారం, సమ్యక్ భావాలతో ఎదుర్కోవలసిన సమయం ఆసన్నమయింది. ఈ వాస్తవాన్ని గ్లాస్గో వాతావరణ శిఖరాగ్ర సదస్సు సమాలోచనలలో పాల్గొనే వారు గుర్తించి తీరాలి. భూ తాపం పెరుగుదలతో మానవాళికి ముంచుకొస్తోన్న పెనుముప్పును నివారించేందుకు కాప్ 26 సదస్సులో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయమై ప్రపంచప్రజలు, ముఖ్యంగా యువజనులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మాటలతో కాలయాపనకు ఇంకెంతమాత్రం ఆస్కారం లేదు. తక్షణ కార్యాచరణ ముఖ్యం.

సునీతా నారాయణ్

‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’

డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.