రైతులకు మద్దతుగా ప్రజా సంఘాల ఆందోళన

ABN , First Publish Date - 2020-12-04T05:12:54+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పెరుగుతున్నది.

రైతులకు మద్దతుగా ప్రజా సంఘాల ఆందోళన
కొవ్వూరులో ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు

 కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పెరుగుతున్నది. ఇదే సమయంలో ఢిల్లీలో రైతుల ఉద్యమాన్ని అణగదొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల వామపక్షాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైతులకు మద్దతుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నాయి.


కొవ్వూరు డిసెంబరు 3: రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎం.ఎం.సుందరబాబు అన్నారు. గురువారం కొవ్వూరు శ్రీరామా సొసైటి వద్ద ఆలిండియా కిసాన్‌సభ ఆధ్వర్యంలో సీపీఎం నాయ కులు ధర్నా చేపట్టారు. ఈ సంధర్బంగా సుందరబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులు వ్యతిరేకిస్తున్నప్పటికి ప్రభుత్వం పార్లమెంటులో వ్యవపాయ బిల్లు పాస్‌ చేసిందన్నారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ, టీడీపీలు వ్యవసాయ బిల్లులను రద్దు చేస్తూ తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలియజేస్తున్న ఉద్యమకారుల్ని ప్రజాసంఘాల నాయకుల్ని పోలీసులు గృహనిర్బంధం చేయడం అమానుషమని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఈమని మల్లిక అన్నారు. రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా శుక్రవారం కొవ్వూరులో పీవోడబ్ల్యు, మండలంలోని వాడపల్లి, ఐ.పంగిడి గ్రామాలలో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. 

జీలుగుమిల్లి: ఢిల్లీలో రైతుల ఆందోళనకు స్థానిక రైతులు సంఘీభావం తెలిపారు. కామయ్యపాలెం సచివాలయం వద్ద రైతు సంఘం మండల కార్యదర్శి సీహెచ్‌. సీతారాముడు మాట్లాడుతూ ఢిల్లీలో రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ తీరును ఖండించారు. 

బుట్టాయగూడెం: ఏపీ గిరిజన సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పడమట రేగులకుంట–జైనవారిగూడెం రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి వ్యతిరేకంగా నవంబరు 27 నుంచి రైతులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు తాము సంపూర్ణ మద్దతిస్తున్నట్టు చెప్పారు. 

నల్లజర్ల: రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలను రద్దు చెయ్యాలని సీఐటీయూ నల్లజర్ల మండల కన్వీనర్‌ వెంకట్రావు అన్నారు. ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దుతుగా పుల్లలపాడులో నిరసన తెలిపారు.




Updated Date - 2020-12-04T05:12:54+05:30 IST