మోదం... ఖేదం

ABN , First Publish Date - 2022-05-20T06:17:59+05:30 IST

కోనసీమ జిల్లా పేరును డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. అధికార వైసీపీలోని కేడర్‌ సహా వివిధ సామాజిక వర్గాల ప్రజలు పేరును వ్యతిరేకిస్తూ ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు.

మోదం... ఖేదం
బండారులంక ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తున్న దృశ్యం

  • కోనసీమ జిల్లా పేరు మార్పుపై రాజుకుంటున్న ఉద్యమం
  • ఒకవైపు సంబరాలు, మరోవైపు నిరసన సెగలు
  • శానపల్లిలంకలో సీఎం దిష్టిబొమ్మకు శవయాత్ర
  • బండారులంకలో రాస్తారోకో, నిరసన ర్యాలీ

కోనసీమ జిల్లా పేరును డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. అధికార వైసీపీలోని కేడర్‌ సహా వివిధ సామాజిక వర్గాల ప్రజలు పేరును వ్యతిరేకిస్తూ ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు అంబేడ్కర్‌ పేరుపెట్టడాన్ని హర్షిస్తూ దళిత సంఘాలు, వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. గత 24 గంటల వ్యవధిలో  కోనసీమ జిల్లాలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకుంటున్న సంఘటనలు సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తూ అమలాపురంలోని ఈదరపల్లి  వంతెన వద్దనున్న అంబేడ్కర్‌ విగ్రహానికి, సీఎం జగన చిత్రపటానికి జిల్లా సాధన సమితి నాయకులు జంగా బాబూరావు, డీబీ లోక్‌ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేయగా మంత్రి పినిపే విశ్వరూప్‌ పాల్గొన్నారు. రావులపాలెంలో అంబేడ్కర్‌ విగ్రహానికి ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు భారీ వేడుక నిర్వహించాయి. అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఇదిలా ఉండగా అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మార్చడాన్ని నిరసిస్తూ బుధవారం రాత్రి నుంచి ఉద్యమాలు చోటుచేసుకున్నాయి. అయినవిల్లి మండలం శానపల్లిలంకకు చెందిన వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో సీఎం జగన దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ముందు సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. డప్పులతో కొందరు కార్యకర్తలు పాడెను మోసిన తీరు, ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ అవుతున్నాయి. అయితే ఈ ఘటనపై అయినవిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారానికి చెందిన యువత, వివిధ సామాజికవర్గాల ప్రజలు అమలాపురం రూరల్‌ మండలం బండారులంక గ్రామానికి చేరుకుని జిల్లా పేరు మార్పును నిరసిస్తూ బండారులంకలో ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. దాంతో అమలాపురం-అంబాజీపేట రహదారిపై ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ రాస్తారోకో అనంతరం ఆ యువకులంతా సుమారు ఐదు కిలోమీటర్ల మేర ప్రదర్శన నిర్వహించారు. ఏ పేరూ వద్దు.. కోనసీమ పేరే ముద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మన ప్రాంతం కోనసీమ, మన జిల్లా కోనసీమ, మన యాస కోనసీమ అంటూ ప్లకార్డులు చేతబూని ప్రదర్శన జరిపారు. సెక్షన 30 ఉల్లంఘించారంటూ వారిపై కేసు పెట్టారు.ఈదరపల్లి వంతెన, ఆర్టీసీ కాంప్లెక్సు, గడియార స్తంభం సెంటర్‌, నల్లవంతెన మీదుగా కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుని పేరు మార్పుపై తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాగా కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఆజాద్‌ ఫౌండేషన ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించడానికి పిలుపునిచ్చారు. అమలాపురం రూరల్‌ మండలం గున్నేపల్లి అగ్రహారం గ్రామంలో ఓ సామాజికవర్గానికి చెందిన కేతా వినయ్‌ వాట్సాప్‌ స్టేటస్‌లో అంబేడ్కర్‌ పేరును కించపరిచే విధంగా గుర్తించిన ఆ పరిసర గ్రామాలకు చెందిన వందలాది మంది దళితులు ఆ యువకుడి ఇంటిని చుట్టుముట్టి తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. రూరల్‌ సీఐ పి.వీరబాబు ఆధ్వర్యంలో అంబాజీపేట, ఉప్పలగుప్తం, అమలాపురం రూరల్‌ ఎస్‌ఐలు చైతన్య, జి.వెంకటేశ్వరరావు, అందే పరదేశి ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ సమస్య పరిష్కరించడంలో పోలీసుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. తీవ్ర ఆవేశంతో ఉన్న యువకులను బుజ్జగించడంలో చేతులెత్తేశారు. అయితే ఇది రెండు సామాజికవర్గాల మధ్య వివాదంగా మారుతుందన్న ఆందోళనతో ఆయా గ్రామాల పెద్దలు శాంతియుత పరిష్కారానికి ఎనలేని కృషి చేశారు. కాగా స్టేటస్‌ పెట్టిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు.

Updated Date - 2022-05-20T06:17:59+05:30 IST