సెగలు.. పొగలు

ABN , First Publish Date - 2022-06-18T06:14:58+05:30 IST

త్రివిధ దళాల్లో నాలుగేళ్ళకు మాత్రమే సైనికులను నియమించే ‘అగ్నిపథ్’ పథకం ఇంత హింసకు కారణమవుతుందని ఎవరూ ఊహించి ఉండరు.

సెగలు.. పొగలు

త్రివిధ దళాల్లో నాలుగేళ్ళకు మాత్రమే సైనికులను నియమించే ‘అగ్నిపథ్’ పథకం ఇంత హింసకు కారణమవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఆరంభమైన నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారి, ఇప్పుడు దక్షిణాదికీ విస్తరించాయి. అక్కడక్కడ బస్సు దహనాలున్నా, ఆగ్రహం కేంద్రంమీద కనుక నిరుద్యోగులు ప్రధానంగా రైళ్ళనూ, రైల్వేస్టేషన్లనూ లక్ష్యంగా చేసుకున్నారు. వందలమంది నిరసనకారులు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో తక్కువ సమయంలో అధిక విధ్వంసం సృష్టించి పోలీసులకు పాలుపోకుండా చేశారు. బోగీలు తగులబడటం, ఇంజన్లు ధ్వంసం కావడం, విలువైన పార్సిల్ సామగ్రి ధ్వంసం కావడం, ప్రయాణీకులు పరుగులు తీయడం వంటివి గతంలో ఎన్నడూ చూడనివి.


వీరంతా ఉన్మాదులో, ఉగ్రవాదులో అవుతారు కానీ రేపటి సైనికులు ఎలా అవుతారని ప్రభుత్వ పెద్దలు ప్రశ్నిస్తున్నారు. పూర్వసైనికాధికారుల్లో అత్యధికులు అగ్నిపథాన్ని తూర్పారబడుతుంటే, మరికొందరు సైనికాధికారులు నిరసనకారులను మందలిస్తున్నారు. దేశరక్షకులు కాదల్చుకున్నవారు ఇలా వ్యవహరిస్తే భక్షకులనిపించుకొని, శిక్షలకు గురవుతారే తప్ప ఉద్యోగాలు పొందలేరని హెచ్చరిస్తున్నారు. ఇది విధ్వంసకారులకు తెలియనిదేమీ కాదు, వారిని క్షమించాల్సిన అవసరమూ లేదు. కానీ, ఏ ఉద్యోగాలమీదైతే వారు ఆశలుపెట్టుకొని, కొన్నేళ్ళుగా నిరీక్షించారో, ఇప్పుడది ఓ స్వల్పకాలిక కాంట్రాక్టు అంశంగా మారిపోయినందున ఆగ్రహం తట్టుకోలేకపోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మాజీ సైనికాధికారుల పర్యవేక్షణలో గ్రామీణ యువత సైన్యంలో చేరేందుకు నిరంతరాయంగా శిక్షణ పొందుతూంటుంది. కరోనా కారణంగా నియామకాలు నిలిచిపోయి, వారంతా ఎంతో ఆందోళనలో ఉన్నారు. వయోపరిమితి సహా పలు నిబంధనలను సడలించి, మరిన్ని పోస్టుల భర్తీతో తమకు సైనికులుగా అవకాశం ఇస్తారని ఆశిస్తున్న వీరికి, ఈ నాలుగేళ్ళ ప్రతిపాదన మనస్తాపం కలిగించింది. చానెళ్ళ ముందు వారు వాపోతున్నది కూడా తమకు దేశరక్షణ అవకాశాన్ని దక్కనీయకుండా చేశారనే. పైగా వీరిలో అత్యధికులు సైనికకుటుంబాలకు చెందినవారు. ప్రతీ దానినీ దేశభక్తితోనూ, సైనికుల ఆత్మగౌరవంతోనూ ముడిపెట్టి విపక్షాల నోరుమూయించే పాలకులకు ఈ యువత మనోవేదన అర్థంకాలేదని అనుకోలేం. విధ్వంసం వెనుక విపక్షాలున్నాయనీ, ఆయా రాష్ట్రాల్లో హింసకు అక్కడి పాలకుల చేయూత కారణమని కేంద్రంలోని అధికారపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. నిరాశ, నిస్పృహలకు లోనైన యువత ఏకం కావడానికీ, ఇలా స్వల్పకాలంలోనే కట్టుగా కదలడానికీ సోషల్ మీడియా ఉపకరించిందని న్యూస్ చానెళ్ళు వివరిస్తున్నాయి.


ఈ పథకాన్ని రెండేళ్ళ మేధోమథనం తరువాత తీసుకువచ్చామనీ, మాజీ సైనికాధికారులు మెచ్చుకున్నారనీ చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవు. ఇంత హింస తరువాత, వయోపరిమితి సడలింపును ప్రకటించిన ప్రభుత్వం, ఉద్యోగానంతర ప్రత్యేక నైపుణ్య శిక్షణలు, చదువులు, ఉపాధి అవకాశాల మెరుగుదల గురించి ఏవో ప్రమాణాలు చేస్తున్నది కానీ అవేమీ నిరసనకారుల మనసుకు ఎక్కడం లేదు. తమ అద్భుతమైన పథకాన్ని జనమే తప్పుగా అర్థంచేసుకున్నారని ఆడిపోసుకోవడం అధికారంలో ఉన్నవారికి ఓ ఆనవాయితీ. దేశాన్ని సమూలంగా కుదిపేసే నిర్ణయాలను సైతం ఏకపక్షంగా, సంప్రదింపులు జరపకుండా తీసుకోవడం, ప్రజలమీద ప్రయోగించడం ప్రస్తుత పాలకులకు అలవాటు. ఈ తరహా పథకానికి తమను ఆలోచింపచేస్తున్న అంశాలివీ అంటూ ఇటీవల పదవీ విరమణ చేసిన ఆర్మీచీఫ్ నరవణే అప్పట్లో ఓ వివరణ ఇచ్చారు. తమ సైనికాధికారులు కాలేజీలూ, యూనివర్సిటీల్లో పర్యటించినప్పుడు ఈ దేశయువతలో ఆర్మీని కెరీర్‌గా స్వీకరించే ఉద్దేశంకాక, ఆ జీవితాన్ని కాస్తంత రుచి చూడాలన్న ఉత్సాహాన్ని గమనించారనీ, ఓ రెండుమూడేళ్ళ ఆర్మీ అనుభవం ఇచ్చేరీతిలో ఓ పథకాన్ని ఆలోచిస్తున్నామని అన్నారాయన. ఏడాదికోమారు ఏదో పర్యాటక ప్రదేశానికి పోయి ఆహ్లాదాన్ని మూటగట్టుకొని వచ్చినట్టుగా ఆర్మీ అనుభవాన్ని పోలుస్తున్నారు. సైనికోద్యోగాన్ని ఉపాధిగా స్వీకరించేవారికీ, దానిని గ్లామర్‌తో చూసేవారికీ తేడా లేదా? సమాజంలో ఏ స్థాయివారు ప్రాణాలకు తెగించి మరీ ఈ ఉద్యోగంలో చేరతారో పాలకులకు, అధికారులకు తెలియదా? ప్రస్తుతం పథకంలో కొన్ని సవరణలు చేరి వుండవచ్చు కానీ, సారాంశం అదే. దేశరక్షణకు సంబంధించిన ఈ వ్యవహారాన్ని దేశభక్త పాలకులు మరింత పలుచన చేయకుండా తక్షణమే కాలుపూర్తిగా వెనక్కుతీసుకోవడం ఉత్తమం.

Updated Date - 2022-06-18T06:14:58+05:30 IST